Site icon NTV Telugu

రేవంత్ కు షాక్..జట్టు కట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు..!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా జట్టు కట్టారా? రేవంత్ మీద నుంచి టార్గెట్ మళ్లించారా.. లేక వ్యూహాత్మక ఎత్తుగడ ఎంచుకున్నారా? వరస భేటీల వెనక వ్యూహం ఏంటి? వారి తాజా లక్ష్యం ఎవరు?

ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ల గురి..!

ఒకరికొకరు చెక్‌ పెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఎవరికి వారే దిట్ట. ఏదైనా తమ దారిలోకి రావాలని అనుకుంటారు తప్పితే.. అంతా ఒకేదారిలో నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది నేతల వ్యవహార శైలి. ఒకరు యస్ అంటే.. ఇంకొకరు నో అంటారు. భిన్నాభిప్రాయాలు సహజమే కానీ.. అవి చాలా దూరం వెళ్లి తెగేవరకు లాగేలా పంచాయితీ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితమే వాళ్లకు అస్త్రంగా మారింది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు ఓపెన్‌ కాగా.. పరోక్షంగా మరో సీనియర్‌ నాయకుడు వ్యవహారాలను చక్కబెట్టే పనిలో ఉన్నారట. అయితే రేవంత్‌ను కాసేపు పక్కన పెట్టి.. రాష్ట్ర ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై వారంతా గురిపెట్టినట్టు తెలుస్తోంది.

ఠాగూర్‌ తీరు నచ్చకే లక్ష్యంగా చేసుకున్నారా?

రేవంత్‌కి మొదటి నుంచి ఠాగూర్‌ అనుకూలంగా ఉంటున్నారనే ప్రచారం చేశారు సీనియర్లు. పార్టీ వ్యవహారాల్లో ఇద్దరు ఒకే దారిలో ఉండటంతో… సీనియర్లు ఇప్పుడు ఠాగూర్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. అందరికీ సయోధ్య కుదిర్చి.. ఏకతాటి మీదకు తేవాల్సిన ఠాగూర్.. వన్ సైడ్‌గా ఉంటున్నారు అనేది సీనియర్ల వాదన. దీంతో ఠాగూర్ తీరు నచ్చనివాళ్లు ఆయన్ని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారట. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఆయన్ని తప్పించేలా వ్యూహం పన్నుతున్నట్టు టాక్‌.

వారం రోజులుగా కాంగ్రెస్‌లో రహస్య సమావేశాలు..!

ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన సమావేశం తర్వాత.. పార్టీలో ఇద్దరు కీలక నాయకులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌తో సంబంధం లేకుండా మరో ఇద్దరు నేతలు సైతం ప్రత్యేకంగా సమావేశమైనట్టు టాక్‌. ఈ సమావేశాల వేడి సెగలు రేపుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్‌లో సీనియర్ నాయకులు భేటీ అయ్యారట. ఆ మీటింగ్‌లోనే ఠాగూర్‌ని రాష్ట్ర ఇంఛార్జ్‌ పదవి నుంచి తప్పించే స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ తరహా రహస్య సమావేశాలు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌లో ఎక్కువైయ్యాయి. గడిచిన వారం రోజులుగా కాంగ్రెస్‌ రాజకీయం అంతా రహాస్యం చుట్టూనే తిరుగుతోంది.

13న ఢిల్లీకి కాంగ్రెస్‌ ముఖ్యనేతలు..!

ఠాగూర్‌ను తప్పిస్తే.. రాష్ట్రంలో తాము అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా పావులు కదుపుతున్నారట సీనియర్లు. ఈ నెల 13న ఢిల్లీ రావాలని పార్టీ ముఖ్యనేతలకు సమాచారం వచ్చింది. ఈ మీటింగ్‌కి వెళ్లే నాయకులు ఇంఛార్జ్‌ ఠాగూర్ తీరుపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఎలాగూ హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఠాగూర్ లక్ష్యంగా అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి.. ఈ అంశంలో సీనియర్ల వ్యూహం ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version