NTV Telugu Site icon

తెలకపల్లి రవి : సుప్రీం ముందుకు పెగాసస్‌, అమెరికా ఒత్తిడిలో ఇజ్రాయిల్‌

పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌ స్పైవేర్‌తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. రహస్యంగా వినడానికే గాక రహస్య చిత్రాలు తీయడానికీ ఇది ఉపకరిస్తుంది. మన దేశంలో వైర్‌తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి.ఇజ్రాయిల్‌కు చెందిస స్పైవేర్‌ తయారీదారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపుచెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు.ఈ మాట మోడీ ప్రభుత్వమూకాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్‌ కుదిరేపని కాదంటున్నది. మళ్లీ అదేనోటితో ఖండిస్తున్నది. రాజకీయ వేత్తలు న్యాయమూర్తులు మీడియా వ్యక్తులు ఆఖరుకు కేంద్రమంత్రులు ముఖ్యమంత్రులు సిబిఐ ప్యారామిలటరీ అధికారుల ఫోన్లను కూడా హ్యాక్‌ చేసిన ఆనవాళ్లున్నాయంటే మనం నిఘా నీడలో ఏమాత్రం భద్రత గోప్యత లేకుండా బతుకుతున్నామని తేలిపోయింది.ఈ స్పైవేర్‌ను కంప్యూటర్లలోకి కూడా పంపి దొంగసాక్ష్యాలు సృష్టించవచ్చు.దీనిపై సభాసంఘం ద్వారానూ, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోనూ దర్యాప్తు జరపాలనిప్రతిపక్షాలు మీడియా కోరినా ప్రభుత్వం పెడచెవినిపెట్టి ఎదురుదాడి చేస్తున్నది. ఇది దేశ ప్రతిష్టకు భంగంకలిగించే కుట్ర అని ఆరోపిస్తున్నది. సంఘ పరివార్‌ మొత్తానికి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఈ కథనం వచ్చాక ఫ్రాన్స్‌ అద్యక్షుడు మోర్కాన్‌ తన ఫోన్‌ వినడంపై విస్తుపోయి విచారణ కోరాడు. అమెరికా వంటి దేశాలు ఇజ్రాయిల్‌ను విచారణ జరపాల్సిందిగా పైపైనైనా ఒత్తిడి పెడుతున్నాయి. ఆదేశంకూడా సమర్థించుకోలేక ఏదో పైపైవిచారణలు ఉత్తర్వులతో నాటకంఆడుతున్నది.మోడీ సర్కారు తీరు అందుకు పూర్తి భిన్నంగా వుందంటే పెగాసస్‌ను దుర్వినియోగం చేసిన తీరే కారణం.

కర్ణాటక ప్రభుత్వం కూల్చివేతకు ముందు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిఎ ఫోన్‌ వింటారు.బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఫోన్‌ పట్టుకుంటారు. బిఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ కెకెశర్మ సంఘ పరివార్‌ సభకు హాజరైనా సరే నిజంగా విధేయుడో కాదో తేల్చుకోవడానికి హ్యాకింగ్‌ చేసి ఆ పైన బెంగాల్‌ ఎన్నికలకు పరిశీలకుడుగా పంపుతారు.దేశమంతటిపై నిఘా వేసే సిబిఐ అధినేతలు ఆలోక్‌వర్మ, రాకేశ్‌ ఆస్తానాలపై నిఘా వేస్తారు. సిజెఐ రమణ అభ్యంతరాల కారణంగా సిబిఐ అధినేతను చేయలేకపోయిన రాకేశ్‌ ఆస్తానాను ఆ నిబంధనలకు భిన్నంగా ఇప్పుడు పొడగింపు ఇచ్చి ఢల్లీి కమిషనర్‌గా డిఐజి హోదాగల పదవిలో పంపుతారు.సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా నిఘావేస్తారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రమోషన్‌ ఇవ్వదలిచిన వారి విధేయతను పరీక్షించడానికి పెగాసస్‌ వాడతారు.జాతీయ మీడియాలో కీలక పాత్రధారులనూ అందులోనూ తమ కంటిలో నలుసులా వున్న వైర్‌ జర్నలిస్టులను వేటాడటానికి నిఘా వేస్తారు. గతంలో ముఖ్యమంత్రి రామకృష్ణహెగ్గే వంటివారు కేవలం ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లనే రాజీనామా చేయవలసి వచ్చిన సందర్బాలకు ఇది పూర్తి విరుద్ధం. ఇవన్నీ ఉదహరించడమెందుకంటే అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంత దారుణమైన కుట్రలు జరిగాయో తెలియడానికి. అందుకే పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఇదే సమస్య స్తంభింపచేస్తున్నది. ఏదైనా చర్య తీసుకునే వరకూ వెనక్కు తగ్గే అవకాశం కూడా లేదు. ఇదే అదునుగా తీసుకుని కొన్ని బిల్లులను ఆమోదింపచేసుకున్నా దీనికి ముగింపు తెలియక కేంద్రం తలపట్టుకుంటున్నది.12 ప్రతిపక్షాలు రాష్ట్రపతికి కూడా లేఖ రాశాయి. సిపిఎం ఎంపి జాన్‌ బ్రిటాస్‌ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు కోసం పిటిషన్‌ వేశారు.ఎన్‌రామ్‌,శశికుమార్‌లు కూడా కోర్టుకు వెళ్లగా వచ్చేవారం విచారణకు స్వీకరిస్తామని సిజెఐ రమణ ప్రకటించారు.ఈ విధంగా సభలో చర్చను దాటవేసినా సుప్రీంకోర్టులో మాత్రం అన్ని విషయాలు బయిటకు వస్తాయని ఆశించవచ్చు.ఈ లోగామరెన్ని కొత్త సంగతులు వెలుగు చూస్తాయో చెప్పలేము.గతంలో సోషల్‌మీడియా నిర్వహణ సంస్థలైన వాట్సప్‌, ఫస్‌బుక్‌ వంటివి డేటాను వినియోగించడం ద్వారా గోప్యతకు భంగం కలిగిస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్రం వాటిపై కేసులు వేసింది.ఇప్పుడు తనే రహస్యంగా డేటా తెప్పించి దోషిగా బోనులోనిలబడిరది.అటూ ఇటూ అడకత్తెరలోచిక్కింది దేశపౌరులే.పెగాసస్‌ ఉదంతంపై మమతా ప్రభుత్వం సుప్రీం మాజీ న్యాయమూర్తి మదన్‌లోకూర్‌ ఆధ్వర్యంలో తనే విచారణ నియమించి కేంద్రాన్ని సవాలు చేశారు.ఇప్పుడు సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపడుతున్నది గనక చాలా విషయాలు బయిటకు వస్తాయని ఆశించాలి.