NTV Telugu Site icon

తెలకపల్లి రవి : జగన్‌ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర సమస్యలు, రాజకీయ కథలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్‌ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్‌,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్‌,పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు ముందునుంచి రకరకాల కథనాలు ప్రచారంలోకి రావడమే గాక ఆయన వారిని కలుసుకుంటున్న తరుణంలో కూడా కొనసాగడం రాష్ట్రంలో రాజకీయ వాతావరణానికి ప్రతిబింబం. ముఖ్యమంత్రి జగన్‌ హొంమంత్రి అమిత్‌షాకు ఇచ్చిన వినతిపత్రంలో వివిధ అంశాలు సమగ్రంగా పొందుపర్చడం ఒకటైతే మిగిలినవారికి శాఖల వారి అంశాలు వచ్చినట్టు కనిపిస్తుంది.

పోలవరం పెరిగిన ఖర్చును 55 వేల కోట్లకు ఆమోదం తెలిపి ఎప్పటికప్పుడు విడుదల చేయడం, విద్యుత్‌ రంగంలో అనవసర బారంగా మారిన రెండు ధర్మల్‌ స్టేషన్లతో నలభై ఏళ్ల పాటు కొనుగోలు చేయాలనే ఒప్పందం రద్దు ద్వారా 300 కోట్ల పైన అనవసర భారం తగ్గింపు, ఉపాధి పనుల బకాయిలు 4వేల కోట్లు, పౌర సరఫరాల శాఖకు రావలసిన మూడు వేల కోట్ల పైగా మొత్తాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆయా మంత్రుల దృష్టికి తెచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం రేషన్‌ బియ్యంకేటాయించడం రాష్ట్రానికి చాలా నష్టదాయకమని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరారు.పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు కూడా చర్చించారు. రాష్ట్రంలో మహానగరాలు లేవు గనక సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకారం అనివార్యమని, ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేక హోదా మాత్రమే మార్గమని కూడా ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా మూడు రాజధానులు పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడివున్నదని అమిత్‌ షాకు చెప్పడమే గాక ఆ మేరకు హైకోర్టును కర్నూలుకు తరలించడానికి రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు.

నీటి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌తో సమావేశంలో తాము కట్టబోయే కాలనీలలో మౌలిక సదుపాయాల బాధ్యత కూడా పిఎంఎవైలో చేర్చాలని కోరారు. ఈ భేటీల తర్వాత గజేంద్ర షెకావత్‌ ట్వీట్‌ చేశారు. రాజ్‌కుమార్‌ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను అభినందనలు తెలిపారు. అయితే మౌలికంగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థలను కేంద్రం అంగీకరించిందా ఆ దిశలో చర్యలు తీసుకోబోతోందా అన్నది మాత్రం అటూ ఇటూ ఎవరూచెప్పడం లేదు, రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా వున్నా కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకోవడం కోసం ఢల్లీి వెళ్లడం, వివిధ శాఖల మంత్రులతో మాట్లాడటం షరామామూలే. వాటిపై తక్షణ స్పందన లేదా ఆమోదం రావడం చాలా అరుదు. గతంలో తాను 29 సార్లు ఢల్లీి వెళ్లినా ఫలితం లేకపోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అంటుండేవారు. ప్రత్యేకహోదా విషయంలో ఆయన పిల్లిమెగ్గలు అందరూచూశారు. జగన్‌ విషయానికి వస్తే మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టి వుంది గనక తాము ఒత్తిడి చేయగలిగింది వుండదని ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పేశారు.

ఇక ఇతర అంశాలలో కూడా కేంద్రం నుంచి నిధుల విడుదల గానివిభజన సమస్యల పరిష్కారం గాని జరిగింది నామకార్థమే. అయినా విపరీతమైన అప్పులు ఆస్తుల అమ్మకాలపై ఆధారపడుతున్నదే గాని గట్టిగా అడిగేందుకు వత్తిడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం లేదు.జగన్‌ ప్రస్తుత పర్యటన కూడా ఇందుకు భిన్నమైన ఫలితాలు సాధించింది లేదు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అభ్యర్థించడం న్యాయమే గాని అది నిరాకరించబడుతున్నప్పుడు రాజ్యాంగ బద్దంగా జరగాల్సినవి కూడాజరగనప్పుడు నిలదీయవసలిన నిరసించవలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. కనీసం ప్రజల తరపున ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకోవలసి వుంటుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఆ దిశలో అడుగులు వేయకపోగా కేంద్రంతో మంచిగా వున్నామనే సంకేతం ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తుంటారు. విద్య నుంచి విద్యుత్‌ వరకూ కేంద్రం ఆదేశాలను పథకాలను అందరికన్నా ముందే అమలుచేస్తుంటారు.

తాను మంచిగా వుండటమే గాక కేంద్రంపై ప్రధానిపై ఎవరైనా విమర్శలు చేసినా సరికాదని చెబుతుంటారు.గతంలో చంద్రబాబు మూడున్నరేళ్లు బిజెపితో కలసి వుండి చివరి ఏడాదిలో విడగొట్టుకుని వీరవిమర్శలు చేశారు. ఈ ముఖ్యమంత్రి మొదటి నుంచి అనుకూలంగా వుంటున్నారు. ప్రభుత్వ వైఖరికి భిన్నంగా చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై పోరాడుతున్నారా అదీ లేదు. టిడిపి విమర్శలు జగన్‌ప్రభుత్వానికే పరిమితమవుతున్నాయి. ఈ మధ్య మహానాడులో కేంద్రానికి అంశాలవారి మద్దతునిస్తామని కూడా తీర్మానం చేశారు. కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్‌ వంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల హక్కుల కోసం ఇది సమాఖ్య విధానమని తమ తమ పద్ధతులలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితికి భిన్నమైన వాతావరణం ఏపిలోనూ కొంతవరకూ తెలంగాణలోనూ చూస్తున్నాం. కనుక కేంద్రం ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప గట్టిగా అడిగడం అనే ప్రసక్తి వుండదు. అదలా వుంచితే ముఖ్యమంత్రి జగన్‌ ఢల్లీిపర్యటన అనగానే ముందునుంచే రకరకాల వూహాగానాలు కథలూ కబుర్లూ రాయడం కొన్ని మీడియా సంస్థలకు పరిపాటిగా మారింది.తనపై వున్న సిబిఐ కేసుల నుంచి రక్షణ కోసమే ఆయన కేంద్రనేతలను కలుస్తారనేది ఈ కథనాల్లో మొదటిది.

ఆ కేసులున్నంత కాలం ఈ మాట వుంటూనే వుంటుంది. ముఖ్యమంత్రి కలుసుకోవడం తప్పనిసరిగా జరుగుతూనే వుంటుంది. కలసినప్పుడు ఏమేమీ మాట్లాడుకుంటారనేది అలావుంచితే సిబిఐతో సహా కేంద్ర సంస్థలు బిజెపియేతర రాష్ట్రాలతో ఎలా దాగుడుమూతలు ఆడుతున్నాయో రోజూ కనిపిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా వంటి వ్యక్తి వాటిని సూటిగా చర్చించి అభయం ఇచ్చిపంపుతారనుకోవడం హాస్యాస్పదం. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ రద్దయిందని ఆఖరి నిముషంలోనూ కథనాలు ప్రసారం చేయడం విశ్వసనీయతకు విఘాతమే. పైగాఈ క్రమంలోవ్యక్తి ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిని తక్కువ చేసి కేంద్ర నేతలు మాత్రం అతీతులైనట్టు చిత్రించడం విడ్డూరం. జగన్‌ పర్యటనలో ప్రస్తావించిన సమస్యలు చాలా వరకూ వాస్తవికమైనవే గనక కేంద్రం వాటికి స్పందించి విభజిత ఆంధ్ర ప్రదేశ్‌ను ఆదుకుంటుందని ఆశించాలి. లేకపోతే ప్రజలను సమీకరించి ఒత్తిడి పెట్టేందుకు పాలక ప్రతిపక్షాలు కూడా సిద్ధం కావాలి. తమలో తమ తగాదాలు ఆ తర్వాతనే..

Show comments