Site icon NTV Telugu

తెలకపల్లి రవి : కేంద్ర పాలిత ప్రాంతంగానే ఎన్నికలు, కాశ్మీర్‌పై బిజెపి వ్యూహం

కేంద్ర పాలిత ప్రాంతంగానే ఎన్నికలు, కాశ్మీర్‌పై బిజెపి వ్యూహంజమ్మూకాశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం రకరకాల కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. 2019 ఆగష్టు5న హఠాత్తుగా నాటకీయంగా కాశ్మీర్‌ ప్రతిపత్తికి సంబంధించిన 370వ అధికరణాన్ని పక్కన పెట్టడం, లడక్‌ను విడదీసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగాక ఒక రాజకీయ ప్రక్రియ చర్చలు అంటూ జరగడం ఇదే మొదటిసారి.ఈ సమావేశం ఒక ఎత్తుగడ మాత్రమేనని రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నిటినీ రప్పించడం కేంద్రానికి విజయమని కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి.ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్‌ షా భద్రతా సలహాదారు అజిత్‌ దోవెల్‌, కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హాలు కూడా చర్చలలో పాలు పంచుకున్నారు. . నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం ఈ సమావేశం పిలిచినట్టు స్పష్టమైంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణకుకేంద్రం కట్టుబడివుందని ఈ సమావేశంలో మోడీ హామీ ఇచ్చినట్టు కొందరు నేతలు తెలిపారు.

నియోజకవర్గాల పునర్విభజనలో అందరూ పాలుపంచుకోవాలని ప్రధాని మోడీ ఈ సమావేశంలో కోరారు. తర్వాత ఇతర విషయాలు ఆలోచించవచ్చునన్నారు. హోంమంత్రి అమిత్‌ షా ఈ విషయం మరింత గట్టిగా చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనలో బిజెపి వ్యూహాత్మక ప్రయోజనం ఒకటుంది. కాశ్మీర్‌లో చివరి సారి నియోజకవర్గ పునర్విభజన1995లో జరిగింది.అప్పటికి సీట్లు 76 నుంచి 87కు పెరిగాయి. వాస్తవానికి 111 సీట్లు అంటున్నాఅందులో 24 ఆక్రమిత కాశ్మీర్‌కు కేటాయించబడ్డాయి. నాలుగు స్థానాలున్న లడక్‌ను విడదీశాక కాశ్మీర్‌ శాసనసభలో 83 స్థానాలున్నాయి.ఇందులో కాశ్మీర్‌ 47,36 జమ్మూలోవుంటాయి. 2019లో రాష్ట్ర విభజన తర్వాత 2020 మార్చిలో జస్టిస్‌ రాజన ప్రకాశ్‌ ఆద్వర్యంలో పునర్విబజన కమిషన్‌ వేశారు. 2011లో జనాభా లెక్కలు తీయలేదు గనక 2001నే కొలబద్దగా తీసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో ఈ కమిషన్‌ సమావేశం జరిగినపుడు ప్రతిపక్షాలు బహిష్కరించాయి. పునర్విభజన వల్ల జమ్మూలో ఏడు సీట్లు పెరుగుతాయని అంచనా వేశారు.

కాశ్మీర్‌లో వివిధ పార్టీలు ఓట్లు చీల్చుకుంటే జమ్మూలో ప్రాంతంలో ఆధిక్యత గల బిజెపి అప్పుడు తనే నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల అవకాశం వస్తుందని ఆశపడుతున్నది. వారి ఆశ. ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన ముఖ్యమని అందుకే వారు పట్టుపట్టారు. పనిలో పనిగా కేంద్రం ఆధీనంలోకి వచ్చిన కాశ్మీర్‌లో చాలా చర్యలు తీసుకున్నట్టు నిధులు మంజూరు చేసినట్టు కూడా చెప్పుకోవడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. 370,35 ఎ పునరుద్ధరణ ముందు జరగాలని అన్నప్పుడు ప్రధాని మౌనం దాల్చారని చెబుతున్నారు. ఆ విషయం సుప్రీం కోర్టు ముందు విచారణలో వుంది గనక చర్చించడానికి లేదని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ ముజఫర్‌ బేగ్‌ అడ్డు తగిలారు. ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు మెహబూబా ముఫ్తి పాకిస్తాన్‌తో కూడా కాశ్మీర్‌పై చర్చలు జరపాలని వాదించారు.370 పునరుద్ధరణ లేకుండా తాము ఎన్నికలలో పాల్గొనబోమని చెప్పారు.

కాని సమావేశంలో మాత్రం పాకిస్తాన్‌ ప్రస్తావన తేలేదని అంటున్నారు. బిజెపి మద్దతు వున్నట్టు చెప్పబడే అప్‌నీ పార్టీ నాయకుడు బుఖారి కూడా పరోక్షంగా కేంద్రానికి మద్దతునిచ్చేలా మాట్లాడారు.ఈ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి ఎలాటి హామీ రాలేదని సిపిఎం నాయకుడు యూసప్‌ తరిగామి స్పష్టంగానే ప్రకటించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తాము కట్టుబడివు న్నామని ఫ్రధాని చెప్పారని ఒక కథనం .కాని కాలక్రమంలో పునరుద్దరణ జరుగుతుందని అమిత్‌ షా పాత పల్లవినే ఆలపించారని కూడా ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగానే హడావుడిగా ఎన్నికలు జరిపించి అధికారంలోకి వస్తానన్నదే బిజెపి తాపత్రయం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నదాన్ని బట్టి ఈ విషయం స్పష్టం.
ఈ సమావేశం ముందు తర్వాత కూడా వేర్వేరు వర్గాల నుంచి విభిన్నమైన స్పందనలు వచ్చాయి.

read also : బీజేపీ లో ముసలం… సొంతపార్టీ నేతలపై మోత్కుపల్లి ఫైర్

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో తాలిబాన్లు తమ దేశంలోకి రావచ్చు గనక పాకిస్తాన్‌ పశ్చిమ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరిస్తుందనీ ఈ సమయాన్ని భారత ప్రభుత్వం ఎంచుకుందని ఒక వ్యాఖ్య.అందుకు తగినట్టే పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మెహబూద్‌ ఖురేషి ఈ సమావేశం విపలమైందని వ్యాఖ్యానించారు. 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో అణచివేత పెరిగిపోయిందని యాభై శాతంపరిశ్రమలు మూతపడ్డాయని, తాము దీన్ని ఐరాసలోకూడా లేవనెత్తామని చెప్పారు. కాని 2021ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ భారత్‌ దళాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంఒకటి కుదిరింది, అజిత్‌ దోవెల్‌ ఆ చర్చలు కొనసాగించనున్నారు. తీవ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రతినిధులు అంటున్నారు. మరోవైపున కాశ్మీర్‌లో 370 పునరుద్ధరణ ప్రసక్తి వుండరాదని బిజెపి అనుకూల వ్యాఖ్యాతలు రాశారు. ఎలాటి మెతక వైఖరికి ఆస్కారం లేకుండా కాశ్మీర్‌ పట్ల కఠినంగానే వ్యవహరించాలని వారు వ్యాసాలు రాశారు. మరోవైపున ఈ సమావేశంలో పాల్గొనడం స్పందించడమే ప్రతిపక్షాల మెత్తబడినట్టు తెలుస్తుందని మరికొందరు తీవ్రధోరణిలో వ్యాఖ్యానించారు.

గత రెండు రోజులలోనూ అక్కడ కొన్ని ఘటనలు కూడా జరిగాయి. కాశ్మీర్‌ పాలనను కేంద్ర అధికారుల చేతుల్లోనుంచి రాష్ట్ర అధికారులకు అప్పగించాలని ఆ చట్రం మిగిలినరాష్ట్రాలలో లాగే వుండాలని ఒమర్‌ అబ్దుల్లా,గులాం నబీ ఆజాద్‌ అనడం 370ని ప్రస్తుతంపక్కనపెట్టడమేనని కొందరు భాష్యం చెబుతున్నారు. కాంగ్రెస్‌ కూడా ఏదోలా ఎన్నికలు జరిగితే మంచిదన్నట్ట్టు వుందని వారి వాదన. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ప్రతిపక్షపార్టీల వైఖరులలో తేడాలు వుండొచ్చు గానివెంటనే పూర్తిస్తాయిలోే ప్రజాస్వామ్య పునరుద్ధరణ ముఖ్యమన్నది కాశ్మీర్‌ ప్రజల ఏకాభిప్రాయం. మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అందుకు భూమిక కాగలదా అన్నది భవిష్యత్తు చెప్పాలి. కేవలం బిజెపి ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం రాజకీయ ఎత్తుగడలకు పాల్పడితే ప్రధాని చెప్పిన ఢల్లీికే దూర్‌ దిల్‌కీ దూర్‌ ఇంకా పెరుగుతుందే గాని తగ్గదు. కేంద్రం ఏమి చెప్పుకున్నా ఈ రెండేళ్లలో ఆ దూరం పెరిగిందనే పరిశీలకుల అభిప్రాయం,370 రద్దుపై సిపిఎం నేషనల్‌కాన్ఫరెన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టు విచారణలో వుంది గనక అక్కడ ఏమైనా జరుగుతుందా అనేది కూడాచూడవలసిందే. ఇప్పటికే ఆలస్యమైన ఈ కేసును త్వరగా తేల్చడం అత్యున్నతన్యాయస్థానంబాధ్యత.

Exit mobile version