నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వల్ల హాని లేదని ఆయుష్ డైరెక్టర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికలను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాలని తెలిపారు. ఇక, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. అంతేగాక కోవిడ్‌కు మందుగా కూడా చెప్పలేమని కూడా అన్నారు. ఆయన ఇచ్చే మందును నిర్వచించలేకున్నా దాన్ని తీసుకున్న 500 మందిని విచారించినప్పుడు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు గనక ఇష్టమైన వారు తీసుకోవచ్చని కూడా పేర్కొన్నారు. కళ్లలో వేసే మందులో వాడుతున్న ఆకులో ప్రమాదం లేనివని స్పష్టం చేశారు.
ఈ నివేదిక సమర్పించేందుకై ఆయుష్ బృందం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డినికలిసినపుడు ఆయన ప్రజల భద్రత, కళ్లపై ప్రభావం వంటి అంశాలు ఎక్కువగా అడిగారని, మరింత అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటారని రాములు చెబుతున్నారు. ఈ లోగా మరింత అధ్యయనం జరిగే వరకూ ఆనందయ్యకు భధ్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్లోపతికి సంబంధించింది కాదు గనక ఈ మందును పరీక్షించేందుకు ఐసిఎంఆర్ బృందంరావడం లేదని కేంద్ర ఆయుర్వేద పరిశోధనా మండలికి తమ నివేదిక పంపుతున్నాము గనక వారు దీని తదుపరి ప్రభావం అంచనావేస్తారని కూడా రాములు వెల్లడించారు. ఎందుకంటే దేశంలో నాటు మందుల వల్ల మేలు జరిగిన ఉదాహరణలెన్ని వున్నాయో నష్టాలు జరిగిన ఉదంతాలు కూడా అంతకంటే తక్కువగా లేవు. ధర విపరీతంగా వున్నా ఇంగ్లీషు మందు అనేక పరీక్షలు దాటి వస్తాయనేది నిజం. ఈ పరీక్షలే దేశదేశాలలో దశలవారీగా జరుగుతూనే వుంటాయి.
ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై సాగుతున్న భిన్న కథనాలు విమర్శలు తర్జనభర్జనను చూసినపుడు శాస్త్రీయంగా మదింపు వేసే పద్ధతి సరైందనే చెప్పాల్సి వుంటుంది. ఒక పల్లెలో పరిమితంగా ఆయన ఉచిత పంపిణీ చేయడం వేరు, రాష్ట్రంలో దేశంలో కూడా విపరీత ప్రచారం జరిగి వేమంది తరలివెళ్లడం వేరు. ఇంతగా ఈ మందు ప్రచారం జరిగాక దాన్ని అనేక రెట్లు అధికంగా తయారు చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో వాడే దినుసులు ఆకులతో పాటు శుభ్రత, సరఫరా పద్ధతులు పాటింపు, చేరిన జనసందోహం కరోనా నియమావళి పాటించదం, తదుపరి ఫ్రభావాలు అన్నీ అంచనా కట్టాలి. ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకోవాలి. ఆ విధంగా మందు పంపిణీకి సహాయం అందించడమంటే దానికి అధికార ముద్ర వేయడమే, కనుక అన్నింటినీ నిర్ధారించుకోవడం తప్పనిసరి బాధ్యత. ఇదేదో ఆయుర్వేదానికి అల్లోపతికి మధ్యన వివాదంలా చూడటం అర్థం లేని విషయం. ఆ విధంగా అయితే ఆయుర్వేదం కూడా ఒప్పుకోవడం లేదు కదా.. సంప్రదాయ వైద్యం లేదా నాటుమందు పసరుమందుగా దీన్ని పరిగణించాల్సి వుంటుంది. అయినా నష్టం లేకుండా కొంత ఉపయోగమేననుకుంటే అనుమతించవచ్చు. ఇప్పటికే వాడినవారి లో కొందరికి సమస్యలు వచ్చాయని రాలేదనీ రకరకా ప్రచారాలు వింటున్నాం. మరి 500 మందిలో ఎవరికీ నష్టం జరగలేదని ఆయుష్ బృందం చెబుతున్నది ఇందుకు విరుద్ధంగా వుంది. వీటి నిజానిజాలు నిగ్గు తేల్చడం పెద్ద సమస్య కాబోదు. ఆ ప్రయత్నం వేగంగానూ పకడ్బందీగానూ జరగాలి.
స్థానిక శాసనసభ్యుడు కాకాని గోవర్థనరెడ్డి నుంచి తెలుగుదేశం, వైసీపీ నాయకులు దీనిని కూడా రాజకీయ సమస్యగా వాదించుకోవడం ఆరోపణలు చేసుకోవడం హాస్యాస్పదం. మీడియాలో కూడా కొంతమంది అటూ ఇటూ అవసరాన్ని మించి లాగడం గందరగోళం పెంచుతున్నది. కోవిడ్ చికిత్స పేరిట కార్పొరేట్ వైద్యశాలలు ఫీజులు గుంజుతూ ప్రజలను పిప్పి చేస్తున్న మాట నిజమే. అయితే, అందుకు ఆనందయ్య మందు విరుగుడు అన్నట్టు చెప్పడానికి ఆధారాలు మరింత బలోపేతం కావాలి తప్ప సంచనాలతో ప్రయోజనం లేదు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బాబా రాందేవ్ విడుదల చేసిన కరోనిల్‌నే గత ఏడాది కరోనా మందు కాదని ప్రకటించిన సంగతి మర్చిపోకూడదు. ఈ సమయంలోనూ ఆయన అల్లోపతిపై చేసిన దారుణ వ్యాఖ్యను ఐఎంఎ నిరసన తర్వాత కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఆక్షేపణతో వెనక్కు తీసుకోవసి వచ్చింది. ఇది సిద్ధాంతాసమస్య కూడా కాదు. అలా అయితే భారత దేశంలో కేరళలోనే ఆయుర్వేదం ఎక్కువగా వుండటం అందరికీ తెలుసు. ఒక మందును గురించిన చర్చను వైద్య విధానా వివాదంగా చేయడం అనుచితం. ఆశాభావం తప్పు కాదు గానీ ప్రపంచమంతటినీ వణికిస్తున్న కరోనాకు ఒక మారుమూల పల్లెలో మందు పుట్టి అందరికీ తగ్గించేస్తుందని అతిగా హడావుడి పడటం కూడా అవాస్తవమే అవుతుంది. తుది నిర్ధారణ జరిగే వరకూ నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇది వేలమంది ప్రాణాలతో ముడిపడిన అంశం.