OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?

  • వారసుల కోసం ఉమ్మడి ప.గో.జిల్లా టీడీపీ నేతల ఎత్తులు
  • జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సీట్ల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌?
  • ట్రయల్స్‌లో చింతమనేని, మాగంటి బాబు, గంట మురళి
  • ఏలూరు జడ్పీని తన భార్య లేదా కుమార్తెకు ఇవ్వమంటున్న మాగంటి
  • మరో పాతికేళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళ కోసం అధిష్టానం చూపులు
  • ఆ లెక్కలు చింతమనేని కుమార్తె నవ్యశ్రీకి వర్కౌట్‌ కావచ్చన్న ఊహాగానాలు
  • తన కుమార్తె కోసం చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ట్రయల్స్‌
  • ఏలూరు, పశ్చిమగోదావరి జడ్పీ పీఠాలపై జనసేన సైతం గురి
Otr

Otr

OTR: ఆంధ్రప్రదేశ్‌ అంతటా… స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ప్రయత్నిస్తుంటే…. ఆ జిల్లాలో మాత్రం వారసుల భవిష్యత్‌ కోసం ఆలోచిస్తున్నారట. అవకాశాలు ఎప్పుడూ వస్తాయా ఏంటి…? వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలంటూ… వారసులను తెరపైకి తెచ్చేందుకు కొందరు సీనియర్స్‌ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. ఇక స్థానిక ఎన్నికల్లో తిరుగు ఉండదని భావించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి నేతలు ఇదే ఊపులో వారసులతో పొలిటికల్‌ అరంగేట్రం చేయించాలనుకుంటున్నట్టు సమాచారం. ఏదో చిన్నాచితక పదవుల కోసం కాకుండా… కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారట. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కోసం టిడిపి నేతలు ఓవైపు, జనసేన ముఖ్యులు మరోవైపు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూసే వారికంటే వారసుల కోసం సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలే ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ లిస్టులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు వంటి చాలామంది నాయకులు ఉన్నారట.

పార్టీ అధికారంలో ఉంది, కూటమి సహకారం ఉంది. ఇలాంటప్పుడే వారసులకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆసక్తి రేపుతున్నాయి. ఏలూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అవకాశాన్ని తన భార్య లేదా కుమార్తెకు కల్పించాలంటూ మాజీ ఎంపీ మాగంటి బాబు ఇప్పటికే పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. గతంలో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి… ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒకరికి టిక్కెట్‌ ఇస్తారా లేదా అనే చర్చ జిల్లాలో నడుస్తోంది. అయితే కీలకమైన పదవుల్ని యువతకు అందించాలనే లక్ష్యంతో పార్టీ అధిష్టానం ఉందని సమాచారం. కీలక పదవులు దక్కించుకునే నేతలకు కనీసం మరో పాతికేళ్లపాటు పార్టీ కోసం పని చేసే ఓపిక ఉండాలన్న అభిప్రాయంతో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో… ఇదే స్ట్రాటజీతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీకి అవకాశం దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభావం చూపగలిగే నేతలకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది అధిష్టానం లెక్కగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుంటున్న చింతమనేని కుమార్తె ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన కేంద్ర సాధికారిక కమిటీ ముందు ఆ ప్రాంత వాసులను కష్టాలను వివరించారు. ఇదే అదునుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నవ్యను చైర్మన్ స్థానంలో కూర్చో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట దెందులూరు ఎమ్మెల్యే. పార్టీ అధిష్టానం కూడా దూర దృష్టితో ఉన్నందున నవ్యకు అవకాశాలు మెరుగుపడవచ్చంటున్నారు.

మరోవైపు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కుమార్తె సైతం జడ్పీ అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే పార్టీ పెద్దలను కలుస్తున్నారట. దీంతో… వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందంటూ లెక్కలేస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కోసం టిడిపి, జనసేన నేతల మధ్య పోరు గట్టిగానే నడుస్తోంది. అయితే అధిష్టానం ఎలాంటి లెక్కలు వేస్తోందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. వారసులను తెరపైకి తీసుకొచ్చేందుకు టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు, అవకాశం దక్కించుకునేందుకు జనసేన నాయకులు చేస్తున్న ప్రయత్నాలు మరోవైపు ఉండడంతో ప్రత్యర్థి పార్టీల కంటే మిత్రుల మధ్యనే పోటీ ఎక్కువగా కనిపిస్తోందట. ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూడాలి.