Site icon NTV Telugu

వివాదాస్పద కామెంట్స్‌ చేసిన టీడీపీ మహిళా నేతలు..!

ఒక్కసారి మాట జారితే అవి ఎంత దూరం తీసుకెళ్తాయో.. వాటి పర్యవసానాలను ఊహించడం కష్టం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన ఆ మహిళా నేతల పరిస్థితి అలాగే ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వారి వెనక ఎవరున్నారన్నది ప్రశ్నే.

టీడీపీ మహిళా నేతల కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌..!

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన తర్వాత.. అనంతపురం తమ్ముళ్లు, మహిళా నేతలు ఓ రేంజ్‌లో అధికారపార్టీపై ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి కూడా. చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారన్న బాధతోనో.. లేక వైసీపీపై ఆగ్రహంతోనో.. కొందరు టీడీపీ మహిళా నేతలు చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీశాయి. మీడియా ముందుకు వచ్చిన టీడీపీ మహిళా నాయకులు.. వైసీపీ నేతల తీరును ఖండించారు. అక్కడితో సరిపెడితే బాగోదనుకున్నారో ఏమో.. ముఖ్యమంత్రిపైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా.. మంత్రులపైనా ఘాటైన పదజాలమే ఉపయోగించారు. టీడీపీ మహిళా నేతలు చేసిన ఆ కామెంట్స్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి.

టీడీపీ మహిళా నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు..!

ఆ వ్యాఖ్యలకు సంబంధించి పోలీస్‌ యాక్షన్‌ మొదలైంది. నవంబర్‌ 24న 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు ఖాకీలు. అంత జరిగినా మహిళా నేతలు తగ్గలేదు. మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటిరోజే నగరంలోని టీడీపీ మహిళా నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో భగ్గుమన్న మహిళా నేతలు.. కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులతో గొడవపడ్డారు కూడా. ఈ ఘటనలు చర్చగా మారాయి.. రచ్చ రచ్చ చేశాయి.

అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ మహిళా నేతలు..!

ఇంతలో సీన్‌ అనంతపురం నుంచి విజయవాడకు మారింది. టీడీపీ మహిళా నేతలు.. విజయవాడలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి.. అక్కడి నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ నుంచి అనంతపురానికి మహిళా నేతలు తిరిగి వస్తారని భావించిన పోలీసులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. విచారణ కోసం వస్తామన్న వాళ్లు.. అజ్ఞాతంలోకి వెళ్లడంతో తల పట్టుకున్నారు ఖాకీలు. ఇప్పుడీ వివాదం పోలీసులు వర్సెస్‌ టీడీపీ మహిళా నేతలు అన్నట్టుగా మారిపోయింది.

మహిళా నేతల కామెంట్స్‌ వెనక డైరెక్షన్‌ ఎవరిది?

మీడియా ముందు కామెంట్స్‌ చేసింది టీడీపీ మహిళా నేతలే అయినా.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరన్న దానిపై పోలీసులు పోకస్‌ పెట్టారు. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. డైరెక్షన్‌ ఎవరిది. మాటల రచయతలు ఎవరు? ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారు? ఆర్థిక లావాదేవీలు ఇలా వివిధ అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్న మహిళా నేతలను విచారిస్తే .. ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని అనుకుంటున్నారట. అందుకే ఈ ఎపిసోడ్‌లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఉత్కంఠ పొలిటికల్‌ సర్కిళ్లలో పెరిగిపోతోంది.

Exit mobile version