NTV Telugu Site icon

MLC Elections 2025: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్..! వైఫల్యం ఎక్కడ జరిగింది..?

Uttarandhra Mlc Elections

Uttarandhra Mlc Elections

MLC Elections 2025: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మేథావి వర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ విస్త్రతంగా జరుగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగింది ? బాధ్యులు ఎవరనే పోస్ట్ మార్టం మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీడీఎఫ్ ఈ ఎన్నికల్లోవ్యూహాత్మకంగా వ్యవహరించింది. గతంలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు పని చేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఒక అభ్యర్ధి పక్షాన అధికార పక్షం నిలబడటం, టీచర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడం నెగెటివిటీకి కారణం అయిందనే విశ్లేషణ జరుగుతోంది. ఇక్కడ గెలిచింది ఎవరు….?. ఓడింది ఎవరు…?. అనే చర్చ కంటే ఉత్తరాంధ్ర మా బలం అని చెప్పుకుంటున్న చోట పరాజయం, దాని వెనుక కారణాలను సమీక్షించుకోకపోతే నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కూటమిలో స్పష్టమైన చీలిక ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు, బీజేపీ బహిరంగంగానే పీఆర్టీయూ అభ్యర్ధి శ్రీనివాసుల నాయుడుకి పనిచేశాయి.

ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన పార్టీల ఆలోచనలను ప్రభావితం చేయవద్దని బీజేపీ నేత మాధవ్ హెచ్చరించారు. బీజేపీ విభేదించిన దానిని సమీక్షించుకోకుండా జనసేన-టీడీపీ ఒక్కటై రఘువర్మకు అండగా నిలిచాయి. మద్దతు ప్రకటించినంత ఈజీగా టీచర్ల సంఘాలను ఒప్పించడం, పీడీఎఫ్ వ్యూహాలను అంచనా వేయడంలో వైఫల్యం చెందాయి. శ్రీనివాసులు నాయుడుని విజేతగా ప్రకటించే సమయంలోనూ హైడ్రామా నడిచింది. ఏ కారణం చేతనైన ఫలితాల్లో తేడా వస్తే ఎంటర్ అయ్యేందుకు బీజేపీ రెడీ అయింది. శ్రీనివాసులు నాయుడు విజయాన్ని తమ వ్యూహంగా చెప్పుకునేందుకు ప్రయత్నించి టీడీపీ…విమర్శల పాలైంది. సీఎం, డీప్యూటీ సీఎం ఫోటోలు పెట్టుకుని గెలిచినందున శ్రీనివాసులు నాయుడు కూటమి అభ్యర్ధేనని క్లైం చేసుకోవాలనే ఆలోచనకు పీఆర్టీయూ గండికొట్టింది. తనను రాజకీయ పార్టీలకు అంటగట్టవొద్దని శ్రీనివాసులు నాయుడు చెప్పేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానమైన ప్రభుత్వ, ప్రయివేట్ రంగం నుంచి ఓటర్లుగా ఉన్న టీచర్ల ఆలోచనలను పసిగట్టే దిశగా…కూటమి నాయకత్వం ఆలోచనలు చేయలేకపోవడం పెద్ద ఫెయిల్యూర్‌. కొందరు అంతర్గతంగా విభేదించినా…మరికొందరు అంటీముట్టనట్టు వ్యవహరించడానికి కారణం అదే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హుందాగా వ్యవహరించిందనే చర్చ జరుగుతోంది. పరోక్షంగా పీఆర్టీయూకి మద్దతు ఇచ్చినప్పటికీ…ఆ ప్రచారం ఎక్కడా తమ మీదకు రాకుండా పకడ్భందీగా వ్యవహరించింది. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరుపెట్టుకోవాలనే ఆత్రుత వెనుక అంతరార్ధం ఏంటని మంత్రి అచ్చన్నకు చురకలు అంటించారు మాజీ మంత్రి అమర్నాథ్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తెలుగుదేశం-జనసేనల్లో అంతర్గత సమీక్షకు కారణమైంది.