Site icon NTV Telugu

TDP 40 Years : సైకిల్‌ ప్రస్థానం..

తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది టీడీపీ. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు అరుదనే చెప్పాలి.

ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు. బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగడ కోసం పోరాడుతుంటే.. ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటం అసాధారణమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16 సంవత్సరాలు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు.. మొత్తం 21 సంవత్సరాలు అధికారంలో కొనసాగడం, 19ఏళ్లపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం విశేషం. ఎన్టీఆర్‌ వేసిన బలమైన పునాది, చంద్రబాబు దార్శనికత, తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది కార్యకర్తల అండతో సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తున్న ఆ రాజకీయ చైతన్య స్రవంతి తెలుగుదేశం పార్టీ.

1982 మార్చి 29.. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌. అప్పటికే అక్కడ చాలా మంది గుమికూడారు. దేశ రాజకీయ యవనికపై చోటుచేసుకోనున్న ఒక సంచలనానికి, చరిత్రకు వారు సాక్షీభూతంగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. తెలుగు చలనచిత్ర రంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా నీరాజనాలందుకుంటున్న ఎన్టీఆర్‌ రానే వచ్చారు. 300 మందితో 4 గోడల మధ్య ఓ సమావేశం నిర్వహించాలనుకున్నారు. అంతకు వారం రోజుల ముందే ఆయన రామకృష్ణా స్టూడియోస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజకీయరంగ ప్రవేశం గురించి చూచాయగా చెప్పారు. దీంతో పార్టీపైనే ఆయన ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ అభిమానులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఆవరణ నిండిపోయింది. సభనుద్దేశించి ఎన్టీఆర్‌ అరగంటపాటు ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అభిమానులు అడగ్గా.. నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అలా పురుడు పోసుకున్న తెలుగుదేశం ఆ తరువాత పెను సంచలనాలకు చిరునామాగా మారింది. ఎన్టీఆర్‌, చంద్రబాబుల హయాంలో అనేక అప్రతిహత విజయాలు సాధించింది. ఎన్నో ఉత్థానపతనాలనూ చవిచూసింది. ఇప్పుడు పాత, కొత్త తరాల మేలు కలయికతో ముందుకు సాగుతోంది.

తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా..! అని ఎన్టీఆర్‌ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించి చైతన్య రథమెక్కి ఎన్టీఆర్‌ జనం మధ్యకు తరలివెళ్లారు. ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన టీడీపీ… ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించింది. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పార్టీకి మొదటి కుదుపు. 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడయ్యారు. హృద్రోగ సమస్యకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకుని వచ్చిన ఎన్టీఆర్‌… తన ఆరోగ్యాన్నీ లెక్కచేయకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి సారథ్యం వహించారు. నెల రోజులపాటు సాగిన ఆ ప్రజా ఉద్యమానికి ప్రధాని ఇందిరాగాంధీ దిగిరాక తప్పలేదు. ఎన్టీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రయ్యారు. ఎన్టీఆర్‌ హయాంలో 1983, 1985, 1989, 1994లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా 3 సార్లు తెదేపా ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలనూ గెలుచుకుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నలభై ఏళ్ల కింద ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఒక చారిత్రక అవసరంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తప్ప మరో బలమైన పార్టీ లేదు. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి బలహీనపడిన తర్వాత రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించింది. మదరాసీలుగా తప్ప జాతీయ స్థాయిలో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపే లేకపోవడం.. పదేపదే ముఖ్యమంత్రులను మారుస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక్కడి నేతలను హీనంగా చూస్తోందన్న అభిప్రాయాల తరుణంలో.. అప్పటికి సినీ రంగంలో తిరుగులేని హీరోగా ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ను ఢీకొన్నారు.

కాంగ్రెస్‌ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే విజయపతాకం ఎగురవేసి అధికారం చేపట్టారు. ఆ సమయంలో మూడు ముఖ్యమైన రాజకీయ మార్పులను టీడీపీ తీసుకొచ్చింది. ఎన్టీఆర్‌ చైతన్య రథమెక్కి నేరుగా జనబాహుళ్యంలోకి వెళ్లి.. రాజకీయాలను సామాన్యులకు చేరువచేసి రాజకీయ చైతన్యం కలిగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో.. బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి.. చట్టసభల్లో సామాన్య సామాజిక వర్గాలు అడుగుపెట్టడానికి దోహదం చేశారు. పేదల సంక్షేమానికి, వారి అభ్యన్నతికి పెద్దపీట వేసే పథకాలకు రూపకల్పన చేసి అప్పటివరకూ కేవలం ఇందిరకు మాత్రమే పరిమితమైన పేదల పక్షపాతి ముద్రను ఎన్టీఆర్‌ తాను కైవసం చేసుకున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పంపిణీతో చరిత్రకెక్కారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా ఎన్టీఆర్‌ తన హయాంలో అనేక పాలనా సంస్కరణలు తెచ్చారు. మండల వ్యవస్థకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలడానికి.. భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి దోహదపడింది. సహకార సంఘాలను ప్రక్షాళన చేసి సింగిల్‌ విండో వ్యవస్థను తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు కల్పించారు. ఇంట్లో ఉండి చదువుకునే వెసులుబాటు కల్పించే దూర విద్య విశ్వవిద్యాలయం, మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలల వంటివి నెలకొల్పారు. అనంతర కాలంలో వీటిలో కొన్ని నిర్ణయాలను కేంద్రప్రభుత్వాలు అందిపుచ్చుకుని.. జాతీయ స్థాయిలో అమలు చేశాయి. హైదరాబాద్‌ నగరాన్ని దీర్ఘకాలం కుదిపివేసిన మత కల్లోలాలను ఎన్టీఆర్‌ ఉక్కుపాదంతో అణచివేసి శాంతిని నెలకొల్పారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న మిగులు జలాల వాటా ఆధారంగా రాయలసీమలో తెలుగుగంగ సహా పలు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ఆ ప్రాంతానికి మొదటిసారి సాగునీటి వసతి కల్పనకు దారులు తెరిచారు.

ఉమ్మడి ఏపీలో 1980 తర్వాత దిగ్గజాలనదగ్గ బీసీ నేతల పేర్లు తీస్తే చాలు.. బీసీలకు ఎంత బలమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో సులువుగా అర్థమైపోతుంది. బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ వెనుకాడలేదు. టీడీపీ ఇచ్చిన ఆ ప్రోత్సాహమే ఇప్పుడు అనేక మంది బడుగు, బలహీనవర్గాల నాయకులు తెరపైకి రావడానికి కారణం అయింది. తెలుగుదేశం పార్టీ పయనం ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు. ప్రతి విజయం అనంతరం సంక్షోభం ఉంది. 1983లో ఎన్టీఆర్ తిరుగులేని విజయం సాధిస్తే.. నాదెండ్ల భాస్కరరావు రూపంలో సంక్షోభం ఎదురయింది. అప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేసి అధికారాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ గెలుపు. కానీ లక్ష్మిపార్వతి రూపంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. ఇక పార్టీ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చింది. పార్టీ నాది.. నాతోనే పోతుందని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీని కాపాడుకోవాలన్న తాపత్రయం అందరిలోనూ కనిపించింది. ఫలితంగా నాయకత్వం చంద్రబాబు చేతికి వచ్చింది.

టీడీపీలో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత కూడా.. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగింది. చంద్రబాబు హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొంత ఇబ్బంది పడినా.. మళ్లీ ఏపీలో నిలదొక్కుకుంది. మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రత్యేకతలు టీడీపీకి ఉన్నాయి. టీడీపీ 4 దశాబ్దాల ప్రయాణంలో అనేక ఆటుపోట్లు, కుదుపులు ఎదుర్కొంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నాదెండ్ల భాస్కరరావు టీడీపీని చీల్చి కాంగ్రెస్‌ మద్దతుతో గద్దెనెక్కారు. కానీ రాష్ట్రంలో తీవ్రమైన ప్రజా ఉద్యమం రావడం.. ప్రతిపక్షాలన్నీ మద్దతివ్వడంతో నెల రోజుల్లోనే ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్ళీ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. వంగవీటి రంగా హత్య, తదితర పరిణామాల్లో 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. అయితే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం ఆ పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారి తీసింది. ఎన్టీఆర్‌ను దేవుడిలా భావించే టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు లక్ష్మీ పార్వతి పెత్తనాన్ని నిరసిస్తూ బయటకు వచ్చి చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఎన్టీఆర్‌ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

1994 శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత.. టీడీపీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు నాయకత్వ మార్పునకు దారితీశాయి. ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. అటు పాలనపైనా, ఇటు పార్టీపైనా క్రమంగా పట్టు సాధించారు. 1999లో శాసనభ ఎన్నికల్లో 180 స్థానాలు గెలుచుకుని చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. ఆయన నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని పరిస్థితుల్లో, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన 2014 శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో టీడీపీ ఓటమి పాలై ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.

టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ భావాలున్న పార్టీ అని ఎన్నోసార్లు నిరూపించుకుంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 35 సీట్లు గెలుచుకుని.. లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఘనత టీడీపీకి ఉంది. ఆ తర్వాత బీజేపీ, జనతా పార్టీ, వామపక్షాల వంటి పార్టీలను కలిపి… జాతీయ స్థాయిలో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు చొరవ చూపారు. ఆ తర్వాత వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఎన్డీఏకి కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు జాతీయంగా.. అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలిగారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి, ఇటు సంస్కరణలకు, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చింది. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, వ్యవసాయ పంపుసెట్లకు రూ.50కే విద్యుత్‌ వంటి ఎన్నో సంక్షేమ పథకాల్ని ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక… హైదరాబాద్‌ను ఐటీ, బయోటెక్‌ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీ తరఫున అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. ఆర్థిక సంస్కరణల్ని అమలు చేశారు. బెంగుళూరు తప్ప దేశంలో మరే నగరం ఐటీ చిత్రపటంలో లేని స్థితిలో ఆయన.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలను ఆకర్షించి హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దారు. కొత్తగా ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి వృత్తివిద్యా కోర్సుల కళాశాలలను రాష్ట్రం నలుమూలలా వందల సంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పలుచోట్ల బలంగా పాతుకుపోయిన నక్సలిజాన్ని గణనీయంగా తగ్గించిన ఘనత కూడా టీడీపీదే. దానివల్ల ఉత్తర తెలంగాణ, పల్నాడు, ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధిపథంలోకి రాగలిగాయి. రాయలసీమలో పాతుకుపోయిన ఫ్యాక్షనిజాన్ని కూడా చంద్రబాబు బాగా తగ్గించగలిగారు.

చంద్రబాబు హయాంలో సాధించుకున్న అభివృద్ధి ముద్ర.. రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్ర ప్రజలు టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వడానికి దోహదపడింది. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి నిర్మాణం చేపట్టడం, దానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం, పోలవరం నిర్మాణాన్ని పరుగులెత్తించడం, కియా కార్ల ఫ్యాక్టరీ వంటి పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి సాధించడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం వంటి వాటిలో ఆయన కొంతమేర విజయవంతమయ్యారు. ఎన్టీఆర్‌ హయాంలో సంక్షేమ ముద్ర తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు హయాంలో అభివృద్ధి ముద్ర సాధించింది.

టీడీపీకి అతి పెద్ద సవాలు తెలంగాణ ఉద్యమ రూపంలో వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ముద్ర వేయడం… దానిని టీడీపీ బలంగా ఎదుర్కోలేకపోవడం ఆ పార్టీని బలహీనపరచింది. సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించినా తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆ పార్టీ నామమాత్రంగానే మిగిలింది. నవ్యాంధ్రలో 2014లో విజయం సాధించిన టీడీపీ.. 2019లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో పరాజయం చవిచూసింది. అయినా తన పట్టు నిలుపుకొని బలమైన రాజకీయ పక్షంగా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో చైతన్యాన్ని నింపి.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి.. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన ఎన్టీఆర్‌ ప్రచారంలో కీలకపాత్ర ఆయన వాహనమైన చైతన్య రథానిదే. షెవర్లే కంపెనీకి చెందిన ఆ 1940 మోడల్‌ వాహనం గురించి అప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. ఎంతో ఆకర్షణీయంగా విశాలంగా సకల వసతులతో ఉండే ఆ వాహనం నిజానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ది. అప్పటికి చాలాకాలంగా ఆయన ఆ వాహనాన్ని వాడుతుండేవారు. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌.. ప్రచారం కోసం ఆ వాహనాన్ని ఎంజీఆర్‌ నుంచి కొనుగోలు చేసి అందులో తనకు కావాల్సిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయించుకున్నారు. కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశమయ్యేందుకు పొడవైన సోఫా, టాయిలెట్‌, వాహనం లోపలి నుంచే పైకి ఎక్కేందుకు మెట్లు ఆ వాహనంలో ఉంటాయి. అలా లోపలి నుంచే వాహనంపైకి ఎక్కి వేలాది బహిరంగ సభల్లో ఎన్టీఆర్‌ ప్రసంగించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్కు చేసి ఉంచారు. ఎన్టీఆర్‌ చనిపోయాక నాచారంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు. ఇప్పటికీ ఆ వాహనం అక్కడే ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక‌, సాంస్కృతిక‌, రాజ‌కీయ ప‌రంగా అనేక మార్పుల‌కు తెలుగుదేశం కార‌ణ‌మైంది. చరిత్రలో ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న టీడీపీని భవిష్యత్తు సవాళ్లు కలవరపెడుతున్నాయి. చంద్రబాబు హయాంలో.. టీడీపీ మూల సిద్ధాంతాలకు దూరం జరుగుతుందోందనే విమర్శలున్నాయి.
1982 వరకూ ఎన్టీఆర్‌కు సినిమాల‌తో త‌ప్ప రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. కానీ స‌మాజ‌మే దేవాల‌యం, ప్రజ‌లే దేవుళ్లని విశ్వసించి సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న సాగించారు. అంత వ‌ర‌కూ అధికారం, రాజ‌కీయం కేవ‌లం కొన్ని కులాలు, డ‌బ్బున్న వాళ్ల చేత‌ల్లోనే వుండేది. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యావంతులు, అంత వ‌ర‌కూ రాజ‌కీయానికి దూరంగా ఉంటున్న అణ‌గారిన వ‌ర్గాల‌కు టీడీపీ అగ్రస్థానం క‌ల్పించింది.

ఏపీ రాజ‌కీయ చిత్రప‌టంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీని రెండు ద‌శ‌లుగా విభ‌జించి చూడాలి. వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ నాయ‌క‌త్వంలోని టీడీపీ, ఆ త‌ర్వాత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రయాణాన్ని విభ‌జించి చూడాలి. ఎన్టీఆర్ హ‌యాంలో పార్టీలో సామాన్యుల‌కు చోటు ఉండేది. కానీ చంద్రబాబు హ‌యాంలో కార్పొరేట్ శ‌క్తుల స్థావ‌రంగా టీడీపీ త‌యారైంది. అంటే టీడీపీని చంద్రబాబు కార్పొరేటీక‌ర‌ణ చేశారు. ఇక్కడే పార్టీ పునాదులు క‌ద‌ల‌డం మొద‌ల‌య్యాయి. ఒక‌ప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే త‌మ‌నూ విజ‌యం వ‌రించి అసెంబ్లీలో, పార్లమెంట్‌లో అడుగు పెడ‌తామ‌నే ఆశ వివిధ పార్టీల్లో ఉండేది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన ప‌రిస్థితి. నాలుగు ద‌శాబ్దాలున్న టీడీపీ అధికారంలోకి రావాలంటే పొత్తు లుంటే త‌ప్ప గ‌ట్టెక్కలేని దుస్థితి. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాప‌రాధ‌మే అని చెప్పక త‌ప్పదు.

క‌నీసం సొంతంగా గెల‌వ‌లేని జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో పొత్తుకు చంద్రబాబు వెంప‌ర్లాడుతున్నారంటే టీడీపీ ఎదిగిన‌ట్టా? దిగ‌జారిన‌ట్టా? టీడీపీ ఆత్మ ప‌రిశీల‌న చేసు కోవాల్సిన స‌మ‌యం ఇది. ఎందుక‌ని పొత్తులుంటే త‌ప్ప ఎన్నిక‌ల‌కు వెళ్లలేని దుస్థితి పార్టీకి వ‌చ్చిందో టీడీపీ నేత‌లంతా ఆలోచించాల్సిన విష‌యం. అభివృద్ధికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తార‌న‌డంలో రెండో మాట‌కు తావు లేదు. ఇదే సంద‌ర్భంలో ప్రచారం ఎక్కువ‌, విష‌యం త‌క్కువ అనే విమ‌ర్శ కూడా లేక‌పోలేదు. ప్రస్తుతం 40 ఏళ్ల టీడీపీ ఓ కీల‌క ద‌శ‌లో ఉంది. చంద్రబాబు వ‌య‌సు పైబ‌డుతుండ‌డం, మ‌రో ఐదారేళ్లు త‌ప్ప ప‌ని చేయ‌లేని ప‌రిస్థితి. ఇదే సంద‌ర్భంలో పార్టీలో ప్రత్యామ్నాయ నాయ‌క‌త్వం ఎద‌గ‌క‌పోవ‌డం ఆ పార్టీ భ‌విష్యత్ పై ఆందోళ‌న క‌లిగిస్తోంది. నారా లోకేశ్‌కు స‌హ‌జంగా క్షేత్రస్థాయిలో క‌ష్టప‌డే గుణం లేద‌నే విమ‌ర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా రానున్న రోజుల్లో అనేక రాజ‌కీయ మార్పులు చోటు చేసుకునే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. కాలానుగుణంగా స‌రికొత్త సిద్ధాంతాల‌తో రాజ‌కీయ పార్టీలు తెర‌పైకి రానున్నాయి.

జ‌వ‌స‌త్వాలు లేకుండా వార‌స‌త్వ రాజ‌కీయాల‌తో నెట్టుకురావ‌డం భ‌విష్యత్తులో క‌ష్టం. అందుకే నారా లోకేశ్ నాయ‌క‌త్వంలో టీడీపీ భ‌విష్యత్ క‌ష్టమ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2024లో జ‌రిగే ఎన్నిక‌లు టీడీపీ భ‌విష్యత్ కు పెద్ద అగ్నిప‌రీక్షే. ఈ ద‌ఫా అధికారంలోకి రాక‌పోతే మాత్రం టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న సిద్ధాంత బలం.. ఇప్పుడు పార్టీకి ఉందా అంటే.. గట్టిగా ఔను అని చెప్పలేని పరిస్థితి. పార్టీ సిద్ధాంతాలకే కాదు.. సామాన్యులకూ దూరం జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు 2004లో ఆ పార్టీకి అధికారం దూరం చేశాయి. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ప్రజలు మరోసారి ఛాన్స్ ఇచ్చినా.. టీడీపీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాలన్న విషయం వదిలేసి.. ప్రతి పనికీ రాజకీయాలతో లింక్ పెట్టడం.. పార్టీకి నష్టం చేసిందనే వాదన లేకపోలేదు. పోలవరం, అమరావతి లాంటి కీలక ప్రాజెక్టులకూ, ఎన్నికల్లో గెలుపూ ముడిపెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపాయారనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణలో ఓటుకు నోటు కేసు.. టీడీపీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. వ్యూహాలకు మారుపేరుగా చెప్పుకునే చంద్రబాబు చేసిన పని.. పార్టీ తెలంగాణను వదులుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ చేసిన తప్పులు తారాస్థాయికి చేరాయి. తన చిరకాల ప్రత్యర్థి, ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. తెలుగుదేశం పుట్టింది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. అలాంటి కాంగ్రెస్ తోనే చేతులు కలపడాన్ని ప్రజలే కాదు.. తెలుగు తమ్ముళ్లు కూడా జీర్ణించుకోలేకపోయారు.

దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీల్లో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతీదీ పక్కాగా ఉంటుంది, పక్కాగా చేస్తుంది ఆ పార్టీ. అయితే ఇప్పుడు కార్యకర్తల్న కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్న టీడీపీ.. కరోనా పేరుతో మహానాడులు కూడా నిర్వహించకపోవడం.. శ్రేణుల్ని నిరాశపరుస్తోంది. ఎన్నికల నిర్వహణలో ధన బలం పెరగడానికి టీడీపీ కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్ అనే పదం బాగా పాపులరైంది. తెలుగుదేశానికి మొదటి భారీ ఓటమి 2004లో వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 47 సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో వైసీపీ ప్రభంజనంలో కేవలం 23 స్థానాలకే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.

2014లో రాష్ట్ర విభజన కూడా తెలుగుదేశానికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన వారినందరినీ తనవైపుకు లాక్కున్నారు కేసీఆర్. నాయకులే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. ఉమ్మడి ఏపీలోని పార్టీని, కేవలం ఆంధ్రా పార్టీగా చూపించడంలో కేసీఆర్ సఫలం అయ్యారు. తెలుగుదేశం తమను తాము జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది. కానీ 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీ హోదా కూడా కోల్పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ తన పాత వైభవం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు వయసుతో సంబంధం లేకుండా కష్టపడటానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. కుమారుడు లోకేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న చంద్రబాబు కల తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. లోకేశ్ అసలు వ్యక్తిత్త్వం ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం ఇమేజ్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించడానికి ఏం చేస్తుంది? నాయకత్వం తనను తాను మార్చుకుంటుందా.. ఎలాంటి కొత్త వ్యూహాలతో ముందుకెళ్తుంది అనేది ఇప్పుడు పార్టీ భవిష్యత్తుకు కీలకం.

https://www.youtube.com/watch?v=VTmeypZdPzA
Exit mobile version