Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!

  • తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఫ్లెక్సీ వార్‌..
  • సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ శంకుస్థాపనలో రోడ్డెక్కిన నేతలు..
  • ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తలనొప్పిగా వ్యవహారం
Thandur

Thandur

ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అంతేలేదా? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వేదికలే వర్గపోరుకు కేరాఫ్‌గా మారుతున్నాయా..? ఫ్లెక్సీల్లో ఫోటోల కోసం రోడ్డెక్కుతున్న కాంగ్రెస్‌ నేతలు పార్టీ, ప్రభుత్వ పరువు తీస్తున్నారా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఏంటా ఫ్లెక్సీ వార్‌?

వికారాబాద్ జిల్లా తాండూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్, అల్లాపూర్ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడి ఫొటోలు లేకపోవడం వివాదానికి కారణమైంది. చైర్‌పర్సన్ వర్గీయులు ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించగా.. మరో వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలు తీసేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి.

ఈ వ్యవహారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బషీరాబాద్ మండలంలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం మరో వివాదానికి కేంద్రమైంది. ఇక్కడి ఫ్లెక్సీల్లో స్థానిక సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్ మహారాజ్ ఫొటో లేకపోవడంతో రగడ మొదలైంది. స్థానిక ప్రజా ప్రతినిధిని అధికారులు అవమానించారంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలోనే ఆందోళనకు దిగారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం కేవలం ఫ్లెక్సీ దగ్గరే ఆగడం లేదు. చేయూత పెన్షన్ల పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న కారణంతో.. ఎంపీడీవో సంపత్ కుమార్‌కు జిల్లా పరిషత్ సీఈవో షోకాజ్ నోటీసు జారీ చేశారు.

సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ ప్రోటోకాల్ పాటించడం ఎంపీడీవో బాధ్యత అని నోటీసులో పేర్కొంటూ.. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపై వివరణ కోరారు. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే… ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించిందా..? లేక అధికారుల స్థాయిలో ప్రోటోకాల్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రోటోకాల్ విషయంలో ఎవరి పేరు ఫ్లెక్సీలో ఉండాలి.. ఎవరి ఫొటో ఉండకూడదన్న అంశం అధికార పార్టీ నేతల మధ్య విభేదాలకు కారణమవుతోంది.

తాండూరు కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎలాంటి జోక్యం చేసుకుంటారు..? నేతల మధ్య విభేదాలకు తెరదించుతారా..? లేక ఈ ఫ్లెక్సీల ఫైట్ మరింత ముదురుతుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వేదికలపై ఫ్లెక్సీలే ప్రధాన సమస్యగా మారితే.. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.