అయోధ్య రామాలయంలో విరాళాల స్కామ్.. ఆలయాల నిర్వహణ తీరు ఎలా ఉండకూడదో మరోసారి చాటిచెప్పింది. ఈ సందర్భంగా దేశంలో ఆలయాల నిర్వహణకు దిక్సూచిగా నిలిచే తిరుమల అందరికీ గుర్తురావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా తిరుమల ఆలయ నిర్వహణలో అవినీతికి తావు లేకుండా టీటీడీ సమర్థంగ కాచుకుంటోంది. కానీ అయోధ్యలో మాత్రం అందుకు భిన్నంగా రామాలయంలో దర్శనాలు మొదలైన ఏడాదికే.. అవినీతి బాగోతం బట్టబయలై.. ట్రస్టే దోపిడీదారుగా తేలడం చూసి.. దేశప్రజలంతా అవాక్కవుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ సూచనలు, సలహాలతో సమర్థ నిర్వహణ వ్యవస్థను అయోధ్యలో ఏర్పాటు చేయకపోతే.. మరిన్ని అనర్థాలకు తావిచ్చినట్టే అవుతుంది. కోట్లాది మంది భక్తులు రాముడి ఆలయ నిర్మాణం కోసం.. తర్వాత ఆలయ నిర్వహణ కోసం లెక్కకు మిక్కిలిగా విరాళాలిచ్చారు. వీటిని ట్రస్ట్ జాగ్రత్త చేస్తుందని బలంగా నమ్మారు. కానీ ఈ కోట్ల మందికి ట్రస్ట్ నమ్మక ద్రోహం చేసింది. రాముడితో పెనవేసుకుపోయిన భక్తుల విశ్వాసాలను, భావోద్వేగాలను దారుణంగా అవహేళన చేసింది.
అయోధ్యలోని ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణ విరాళాల సేకరణలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలు, విరాళాలు దుర్వినియోగం అయ్యాయనే వార్తలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న బంగారం, నగదు, ఇతర విలువైన కానుకలకు సరైన రికార్డులు కానీ, రశీదులు కానీ నిర్వహించడం లేదనే ఆరోపణల్లో నిజం లేకపోలేదని సిట్ విచారణలోనూ తేలింది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రాల్లో ప్రతిరోజూ పారదర్శకంగా ఆడిటింగ్ జరుగుతుందని, కానీ అయోధ్య ట్రస్ట్‌లో అటువంటి యంత్రాంగం లేకపోవడమే ఈ అవినీతికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, అధికార పక్షానికి చెందిన ఒక మాజీ ఎంపీ కూడా ఈ నిధుల దుర్వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడిని పెంచింది. ట్రస్ట్‌లో లూజ్ మెకానిజం ఉండటం వల్లే నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని, ఇందులో చాలా పెద్ద తలకాయల ప్రమేయం కూడా ఉందంటూ వచ్చిన ఆరోపణలు.. మరింతగా అగ్గి రాజేస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు మరో ముఖ్య ప్రతినిధి శుక్లాను పదవుల నుంచి తప్పుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో వారు తమ పదవులకు రాజీనామా చేయగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిట్ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ట్రస్ట్‌లోని కొందరు ఉద్యోగుల ఇళ్లపై జరిగిన దాడుల్లో భారీగా నగదు లభ్యమైంది. గతంలో అద్దె ఇళ్లలో నివసించిన సాధారణ ఉద్యోగులు సైతం, ట్రస్ట్ కార్యక్రమాల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల విలువైన బంగ్లాలు, భారీ ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిధులపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి.
మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయితే తాము ఎలాంటి విమర్శలకు వెనకాడబోమని, దర్యాప్తులో నిజా నిజాలు తేలేవరకు నిందితులు జైల్లోనే ఉంటారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భక్తుల కష్టార్జితమైన ప్రతి రూపాయికి పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ట్రస్ట్ ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇప్పటివరకు వచ్చిన నిధులపై సమగ్ర పబ్లిక్ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. భవిష్యత్తులో నూతన బోర్డు ఏర్పాటుతోనైనా పారదర్శకత వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
అయోధ్యలో రామజన్మభూమి కోసం భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో విరాళాలు, ఆభరణాలు, బంగారం, వెండి ఇటుకలు సమర్పించారో లెక్క తెలియదు. అక్షింతల పంపిణీ పేరిట, రామ్ రామ్ గ్రామ్ అభియాన్ పేరిట నిర్వహించిన కార్యక్రమాలకు అనేకమంది భక్తులు తాదాత్మ్యంతో ప్రతిస్పందించారు. సీసీటీవీ కెమెరాల్లో కనీసం 70సార్లు నగదు తీసుకువెళుతున్నట్లు, మూటలు మోసుకెళుతున్నట్లు దృశ్యాలు బహిర్గతమయ్యాయి. సిబ్బంది కొందరు కావాలనే కెమెరాలకు అడ్డుగా నిలుచుని హుండీల నుంచి నగదు కాజేసే దృశ్యాలు రికార్డు కాకుండా చేశారని సిట్ తేల్చింది. దోచుకున్న డబ్బుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్న సమాచారం కూడా లభించింది. సిట్ అరెస్టు చేసిన వారిలో నోట్లు లెక్కపెట్టే కొందరు అధికారులు, చంపత్‌రాయ్ వ్యక్తిగత డ్రైవర్ రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ తదితరులు ఉన్నారు. కానీ బాధ్యత వహించాల్సిన చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు కేవలం రాజీనామాలు చేశారు. అనిల్ మిశ్రా అయోధ్యలో అధునాతన సౌకర్యాలతో మూడంతస్తుల బ్రహ్మాండమైన బంగళాను నిర్మించుకున్నారని వార్తలు వచ్చాయి. నిజానికి అయోధ్యలో కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నడిపిన అలోక్ బన్సల్, ఆయన సతీమణి శివానీ బన్సల్, చందన్ రాయ్ బన్సల్, మనీష్ బన్సల్ తదితరులు చంపత్ రాయ్ బంధువర్గీయులే, సిట్ స్వాధీనం చేసుకున్న అనేక భూమి కొనుగోళ్ల పత్రాలు మీడియాకు చేరాయి.
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో లేదా ప్రతిష్ఠతో బిజెపి బాధ్యత తీరిందా? ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసాన్ని తర్వాత నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదా? అసలు దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా, ఆదర్శనేతగా మోడీ తర్వాత అంతటివాడుగా ప్రశంసించబడే యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన అయోధ్య రాముడి సంపదను కాపాడడంలో పూర్తిగా విఫలమైనట్లే. ఏదో చిన్న ఉద్యోగులను బలి చేసినంత మాత్రాన న్యాయం జరగదు. ఈ విషయమై సిబిఐ విచారణ కోరాలి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అసలు ఎన్ని కోట్ల విలువైన సంపద చోరీకి గురైందో లెక్కతేలాలి. అది తిరిగి సదరు వ్యక్తుల నుంచి రాబట్టాలి. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రక్షాళన జరగాలి. దానిలో సాధువులకు, కరసేవకులకు, విశ్వహిందూ పరిషత్ సభ్యులకు, ఇంకా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు, నేతలకు కాకుండా గతంలో బాధ్యతాయుతమైన పదవులు అలంకరించిన వ్యక్తులను ట్రస్టీలుగా నియమించాలి. దేవుడి సంపదకు కష్టోడియన్లుగా ఉండవలసిన ట్రస్ట్ సభ్యులు తమ దగ్గర వారిని ఉద్యోగాలలో నియమించుకొని నిధులను, నగలను తరలించుకుపోయారని స్పష్టమవుతున్నది. ఈ చోరీ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరో బయటకు రావాలి. తిమింగలాలను వదిలి చిన్న చేపలను చిక్కించుకుంటున్నారు. సిట్ నివేదిక ప్రకారం 8 మందిని అరెస్టు చేసినా మరో 150 మందిని కూడా ఆ నివేదిక అనుమానించడం గమనంలోనికి తీసుకోవాలి. సిసిటివి ఫుటేజ్ ధ్వంసం చేశారు లేదా కెమెరా కన్నుగప్పి నగదు దొంగిలించారు. టాయిలెట్లలో కూడా దాచుకున్నారు. నోట్ల కట్టల్లో ఎక్కువ నోట్లు పెట్టి ఆలయ ప్రాంగణం దాటిన తర్వాత ఆ ఎక్కువగా ఉన్న నోట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.
వెండి ఇటుకలకు లెక్కలేదు, రసీదు ఇవ్వలేదు. సదరు వ్యక్తుల ఇళ్లలో వారి ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. ఇది కేవలం ఆ చిన్న ఉద్యోగుల దురాశతో కూడిన హస్తలాఘవమా లేక వారి పెద్దల అండదండలతో ఈ పనికి పూనుకున్నారా అనేది విచారణలో తేలాల్సిన అంశం. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ విధమైన దుర్మార్గాలను ప్రభుత్వాలు అరికట్టాలి. దేవుడికే శఠగోపం పెడితే ప్రజలు ఎలా సహించాలి? దోషులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా వారిని శిక్షించి తీరుతాం లాంటి భారీ డైలాగులు చాలా కాలం నుండి వింటున్నాం. ఏ దోషి కూడా శిక్షించబడ్డ దాఖలాలు లేవు. నేడు అయోధ్య రాముడి నగదు నగలు కూడా మాయమవుతాయా? ఈ విధంగా దేవుళ్ళ సొమ్ము కైంకర్యం చేయడం మామూలు అయిపోయింది. హే రామ్! ఇక నిన్ను నువ్వే కాపాడుకోవాలి. శ్రీరామ జన్మభూమిలో చోరీకి పాల్పడిన వారికి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడమే సరియైన శిక్ష. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
అయోధ్య ఆలయం మిగతా ఆలయాల్లాంటిది కాదు. ఈ దేశానికి అత్యంత ఆరాధ్యుడైన రాముడు కొలువై ఉన్న ఆలయంలో.. జరిగిన స్వామిద్రోహాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మర్యాదా పురుషోత్తముడిగా మన్ననలు అందుకునే రాముడికే.. మర్యాద ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణపై కూడా లెక్కలేనన్ని సందేహాలు ముసురుకోవడం ఎవరికీ మంచిది కాదు. రాముడి సొమ్ము దోచేసి.. 2 రాజీనామాలు చేసేస్తే.. అంతా సరైపోతుందా అనేది సామాన్య భక్తులు అడుగుతున్న ప్రశ్న.
అంతిమంగా వందల ఏళ్ల కల.. సాకరమైందన్న ఆనందం కొన్నాళ్లు కూడా నిలవలేదు. రాముడి తిరిగొచ్చాడంటూ.. దేశవ్యాప్తంగా జరిగిన సంబరాల గుర్తులు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. అయోధ్య రామాలయానికి రోజూ పెరుగుతున్న భక్తుల తాకిడి చూసి.. పులకిస్తున్న మనసులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇంతలోనే మహాపచారం జరిగిపోయింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్న విరాళాలు, కానుకలు మాయమయ్యాయన్న ఆరోపణలు అయోధ్యలో కలకలం రేపాయి. మొదట్లో ఇవి ఉట్టి ఆరోపణలే అని భావించిన వారు కూడా.. తర్వాత సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించడంతో అలర్ట్ అయ్యారు. చివరకు సిట్ ప్రాథమిక విచారణలోఅడుగుడగునా నిర్లక్ష్యం నిజమేనని బయటపడటం.. సీసీ టీవీ ఫుటేజ్‌లో మార్పులు.. అన్నీ కలిసి రామభక్తుల మనోభావాల్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. ఎంతో నమ్మకంతో రాముడి ఆలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇచ్చిన విరాళాలు కొందరు స్వార్థపరుల చేతిలోకి వెళ్లిపోయాయని, ఆలయ వ్యవహారాలు చూసే ట్రస్టే.. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తోందని తెలిసి.. భక్తులు నిర్ఘాంతపోతున్నారు. ఇందుకోసమేనా రామాలయం కట్టింది..? ఈ బరితెగింపు చూడటానికేనా రాముడ్ని కొలువుతీర్చింది..? అని కోట్లాదిమంది భక్తులు నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు. ఏతావాతా ఆలయానికి వచ్చిన విరాళాలకు భద్రత కల్పించడంలో అలవిమాలిన నిర్లక్ష్యం.. అంతిమంగా రాముడి పరువు తీసిందనే చర్చ జరుగుతోంది.

