Station Ghanpur TRS Politics : నియోజకవర్గానికి మంత్రి వచ్చినా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? ఒకరు హాజరై.. మరొకరు డుమ్మా కొట్టడం వెనక ఆధిపత్యపోరాటమే కారణమా? కుమ్ములాటలు పెరగడమే తప్ప.. తగ్గే సంకేతాలు కనిపించడం లేదా? లెట్స్ వాచ్..!
ఆ మధ్య మాటల తూటాలతో పరస్పరం విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అధికారపార్టీలోని ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పాత పగలు మళ్లీ బుసకొట్టాయి. రెండు శిబిరాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరైనా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డుమ్మా కొట్టేశారు. జిల్లాకు చెందిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం దూరంగానే ఉన్నారు. దీంతో అధికారపార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరాటం కొత్త పుంతలు తొక్కుతుందోనే చర్చ నడుస్తోంది.
చెరువుల్లో చేప పిల్లలను వదలడంతోపాటు.. గొర్రెల పెంపకం దార్లతో మంత్రి తలసాని సమావేశం అయ్యారు. స్టేషన్ ఘనపూర్‌లో కార్యక్రమం జరగడంతో అక్కడి ఎమ్మెల్యేగా రాజయ్య వచ్చారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ శ్రీహరి మాత్రం సైలెంట్ అయ్యారు. కొద్దిరోజులుగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం వల్లే శ్రీహరి రాలేదని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఆశిస్తూ.. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేలా విమర్శలు చేసుకోవడం ఆ ప్లాన్‌లో భాగమనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎవరి గ్రూపు వారిదే.
ఎవరికి వారే స్టేషన్ ఘనపూర్‌ను తమ అడ్డాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆరోపణల తీవ్రతా శ్రుతిమించుతోంది. ఏకంగా మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారు రాజయ్య, శ్రీహరి. ఇద్దరూ సీనియర్ లీడర్లే కావడంతో జిల్లా నేతలు వీళ్లకు సర్దిచెప్పలేని పరిస్థితి ఉందట. అధిష్ఠానం కలుగ చేసుకుంటే కానీ.. సమస్య కొలిక్కి రాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు మంత్రులు వచ్చినా ఒకరినొకరు ఎదురు పడటానికి ఇష్ట పడటం లేదు. మరి.. ఈ వర్గపోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
