ఇంఛార్జ్‌లను వేయకపోతే పార్టీకి ఛార్జింగ్ కష్టమా? కొత్త పోకడలకు చోటు లేదంటోంది ఎవరు?నిర్ణయం తీసుకుంటే ఒక భయం.. తీసుకోకపోతే మరింత ఆందోళన అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఇంతకీ ఏంటా పార్టీ? ఏమా ఇంఛార్జ్‌ల గోల?
నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించాలని కోరారట!
తెలంగాణ బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు కమలనాథులు. ఇదే సమయంలో కాషాయ శిబిరంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అవి ఆచారణ సాధ్యమా కాదా అని పక్కన పెడితే.. పార్టీలో ఒక చర్చ అయితే మొదలైంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ ఎదుటే ఆ డిమాండ్స్ వినిపించారట. నియోజకవర్గాల్లో పార్టీకి ఊపు తీసుకురావాలంటే ఇంఛార్జ్‌లను ప్రకటించాలని కోరారట. దానికి ఆయన అవునని.. కాదనీ ఏదీ చెప్పలేదట. పైగా బీజేపీకి ఒక లైన్ ఉంది.. దాని ప్రకారమే వెళ్లాలి. తెలంగాణ బీజేపీకి ప్రత్యేకత ఏమీ ఉండబోదని సంతోష్ స్పష్టం చేశారట. దీంతో నాయకులు డీలా పడినట్టు చెబుతున్నారు.
స్పష్టమైన హామీ ఇవ్వని బీఎల్ సంతోష్!
రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్సీలు.. సీనియర్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మందికి బీజేపీలో ఎలాంటి బాధ్యతలు లేవు. హోదాలు లేవు. దీంతో బీఎల్ సంతోష్ ఎదుట.. తమ మనసులో మాట బయటపెట్టారట వలస నాయకులు. ముందుగానే ఇంఛార్జ్‌లను ప్రకటిస్తే.. నియోజకవర్గాల్లో పనిచేయడానికి వీలుకలుగుతుందని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవచ్చని చెప్పారట. ఈసారి కూడా అసెంబ్లీకి ముందుగానే ఎన్నికలు రావొచ్చని అభిప్రాయపడ్డారట. వారి మాటలను పూర్తిగా ఆలకించిన సంతోష్.. ఇంఛార్జ్ పదవులపై స్పష్టమైన హామీ ఇవ్వలేదట. బీజేపీకి జాతీయస్థాయిలో ఒకే విధానం ఉంటుందని ఆయన తెలిపారట.
Read Also : ‘ఫరాజ్’… జూలై 1, 2016… ‘ఆ రాత్రి’ ఏం జరిగింది?
ఇంఛార్జ్ పోస్టుల కోసం ఇద్దరు ముగ్గురు మధ్య పోటీ!
నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటిస్తే.. ఒక భరోసా దక్కుతుందని నేతలు భావిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో తామే పోటీ చేస్తామనే నమ్మకం కలుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. పైగా బీజేపీలో చేరింది ఎన్నికల్లో పోటీ చేయడానికే కదా.. ఆ మాత్రం క్లారిటీ ఇవ్వకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. గ్రేటర్ హైదరాబాద్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు కంటే ఎక్కువమంది సీనియర్లు పోటీపడుతున్నారు. పనిచేసుకోవాలో లేదో తెలియక చురుకుగా ఉండటం లేదు. ఉనికిని కాపాడుకోవడం కోసం అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పాత.. కొత్త వారి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.
ఇంఛార్జ్‌లను ప్రకటిస్తే కొత్త వాళ్లు బీజేపీలో చేరబోరనే ఆందోళన!
ఇప్పుడే నియోజకవర్గ ఇంచార్జ్‌లను ప్రకటిస్తే.. బీజేపీలో చేరాలనుకునేవారు ఆగిపోతారనే అభిప్రాయం కొందరు కమలనాథుల్లో ఉందట. సీటుపై హామీ ఇవ్వలేకపోతే పార్టీలో చేరాలనుకునేవారు ఆగిపోతారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంఛార్జ్‌లను ప్రకటించి.. వారికి చివరి క్షణంలో సీటు ఇవ్వకపోతే లేనిపోని తలపోటులు వస్తాయని ఆందోళన చెందుతున్నారట. అందుకే బీజేపీ తొందరపడబోదన్నది సంప్రదాయ కమలనాథుల మాట. ఈ వైఖరే వలస నాయకులకు రుచించడం లేదని తెలుస్తోంది. మరి.. ఇంఛార్జులతో కాకుండా.. బీజేపీకి ఎలా ఛార్జింగ్ తీసుకొస్తారోర చూడాలి.
