Site icon NTV Telugu

ఆరోపణలు ఎదుర్కోలేకే GHMC మొదటి సమావేశం వర్చ్యువల్ గా పెట్టారా?

తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్‌ ఎత్తేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యక్రమాలు ఎప్పటిలా కొనసాగుతున్నాయి. GHMC కౌన్సిల్‌ సమావేశం మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అన్‌లాక్‌లో ఎందుకు వర్చువల్‌ మీటింగ్‌ పెట్టారు? విపక్షాల విమర్శలేంటి? ఆన్‌లైన్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ లోగుట్టు ఏంటి?

వర్చువల్‌గా ముగిసిన జీహెచ్‌ఎంసీ తొలి కౌన్సిల్‌ భేటీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా GHMC కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్‌లో విస్తృతంగా చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా జనరల్‌ బాడీ సమావేశం షెడ్యూల్‌ ఖరారు చేస్తే.. అధికారపార్టీతోపాటు.. ప్రతిపక్షాలు గ్రేటర్‌ సబ్జెక్టులపై కుస్తీ పడతాయి. అజెండాలోని అంశాలను ఆమోదించుకోవాలని అధికారపక్షం చూస్తుంది. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు యోచిస్తాయి. సమావేశం మొత్తం వాడీవేడీగా సాగుతుంది. అయితే GHMC కౌన్సిల్‌ తొలి సమావేశాన్ని ఫిజికల్‌గా కాకుండా వర్చువల్‌గా నిర్వహించడం చర్చకు దారితీసింది.

అన్‌లాక్‌లో వర్చువల్‌ మీటింగ్‌పై ప్రశ్నలు

వర్చువల్‌ భేటీకి కోవిడ్‌ను కారణంగా చెబుతున్నారు అధికాపక్ష నాయకులు. అయితే రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గి.. లాక్‌డౌన్‌ కూడా ఎత్తేశారు. అన్నీ అన్‌లాక్‌ అయ్యాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ సమయంలో కౌన్సిల్‌ భేటీని వర్చువల్‌గా నిర్వహించి ఉంటే ఈ స్థాయిలో చర్చ జరిగేది కాదు. కానీ.. అన్‌లాక్‌లోనూ ఆన్‌లైన్‌ భేటీ నిర్వహించడాన్ని ప్రశ్నిస్తున్నాయి విపక్షపార్టీలు. గ్రేటర్‌ రాజకీయవర్గాల్లోనూ ఈ అంశమే హాట్‌ హాట్‌గా మారింది.

కరోనా ఏ విధంగా అడ్డొచ్చిందని ప్రశ్న

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక.. ఎన్నో పబ్లిక్‌ మీటింగ్‌లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ప్రజలు.. అధికారులు హాజరవుతున్నారు. 150 మంది కార్పొరేటర్లు, కొంత మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్న GHMC కౌన్సిల్‌ మీటింగ్‌కు కరోనా ఏ విధంగా అడ్డొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.

విపక్షాల దాడిని తప్పించుకునేందుకే వర్చువల్‌ భేటీ పెట్టారా?

GHMC తొలి కౌన్సిల్‌ సమావేశంలో గొంతు విప్పి తమ డివిజన్‌ సమావేశాలను ప్రస్తావించాలని చాలా మంది కార్పొరేటర్లు ఆశించారు. కొత్తగా కార్పొరేటర్లు అయినవారు ఎక్కువ మంది ఉండటంతో.. కౌన్సిల్‌ సమావేశం ఎలా జరుగుతుందో చూడాలని అనుకున్నవారూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఫిజికల్‌గా GHMC మీటింగ్‌ పెడితే… ప్రశ్నలు.. ఆరోపణలు.. విమర్శల మోతాదు ఎక్కువై రచ్చ జరిగేదని గ్రేటర్‌ రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. ఆ రచ్చ నుంచి తప్పించుకునేందుకే కోవిడ్‌ను కారణంగా చూపించి.. అన్‌లాక్‌లోనూ వర్చువల్‌గా మీటింగ్‌ నిర్వహించారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లోగుట్టు అదేనని.. కానీ.. దానికి కరోనాతో కవరప్‌ చేశారని కామెంట్స్‌ చేస్తున్నారట. కారణం ఏదైనా.. తొలి మీటింగ్‌ కొత్తగా.. చప్పగా సాగిపోయిందనే కార్పొరేటర్లు లేకపోలేదు.

Exit mobile version