వైద్యశాఖలో అంతా గందరగోళమే. ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు. దీనికితోడు ఇంఛార్జుల పాలన. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయి అధికారులు రారు. వ్యవస్థ మొత్తం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి. కీలకమైన వైద్య విభాగంలో ఎందుకిలా జరుగుతోంది?
వైద్యశాఖలో ఇంఛార్జుల పాలన..!
విభజన చట్టం ప్రకారం తెలంగాణ వైద్యశాఖలో చర్యలు తీసుకోలేదు. దీంతో పరిపాలనా విభాగాలలో ఇంఛార్జుల కాలం నడుస్తోంది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ యూనివర్సిటీ వీసీ, నర్సింగ్ రిజిస్ట్రార్, నిమ్స్ డైరెక్టర్‌లు అనేక సంవత్సరాలుగా కుర్చీలను వదలటం లేదు. HODలు ఏళ్ల తరబడి అదేవిధుల్లో ఇంఛార్జులుగా కొనసాగుతున్నారు. అర్హులైన వారికి అవకాశం రావడం లేదు. వైద్యవిధాన పరిషత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ల్లోనూ ఇంఛార్జులే. నిత్యం బీజీగా ఉండే DME పోస్టుతోపాటు వైద్యవిధాన పరిషత్ ఇంఛార్జ్ బాధ్యతలు ఒకరి దగ్గరే ఉన్నాయి. దీంతో రెండు శాఖల సమన్వయం సాధ్యం కావడం లేదు.
నిమ్స్ డైరెక్టర్ పదవీకాలం ముగిసినా ఇంఛార్జ్‌గా కొనసాగింపు..!
వైద్యశాఖలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ HOD పోస్టుల్లో ఒకవ్యక్తి రెండేళ్లకంటే మించి పనిచేయడానికి లేదు. ఈ రూల్‌ను తుంగలో తొక్కేశారు. ప్రస్తుత నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం 2019లోనే ముగిసింది. అర్హతల ప్రకారం డైరెక్టర్ పోస్ట్ చేపట్టాల్సిన వారు వెనకపడే పరిస్థితి. హెల్త్ యూనివర్సిటి ఏర్పడిన మొదట్లో 2015 ఓ ఐఏఎస్ ఆఫీసర్ వీసీగా పనిచేశారు. ఆయన ఆరునెలల వ్యవధిలో ఆ పోస్టు నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత వచ్చిన వీసీ ఏడేళ్లగా అక్కడే ఉన్నారు. ఈ విషయంలో రాజ్‌భవన్ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదట.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఇంఛార్జే..!
ఏటా 800 కోట్ల వరకు బిల్లులు చెల్లించే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో పోస్ట్‌ను కూడా ఇంఛార్జే ఏలుతున్నారు. ఐఏఎస్ కేడర్ వ్యక్తి ఉండాల్సిన టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ పోస్టులో గ్రూప్ 1 ఆఫీసర్ కొనసాగుతుండటం విశేషం. సీజనల్ వ్యాధులు, రెగ్యులర్ ఫీవర్స్ వంటి ఒత్తిళ్లు ఉండే ఫీవర్ ఆస్పత్రి సూపరిండెంట్‌కు ఐపిఎం డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా.. వైద్యశాఖను గాడిలో పెట్టకపోవడం ఆ శాఖ ఉద్యోగులను ఆశ్చర్య పరుస్తోంది.
ప్రభుత్వాన్ని కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా?
ప్రభుత్వం వైద్యశాఖపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టకుండా కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా? కీలక పోస్టుల్లో కొనసాగేందుకు పూర్తిస్థాయి అధికారులు రాకుండా చేస్తున్నారా లేక.. ఈ శాఖలో వచ్చే రాబడిని వదులుకోలేకపోతున్నారా? కరోనా టైమ్‌లో వైద్యశాఖలో ఇంఛార్జులు కాకుండా పూర్తిస్థాయి అధికారులు ఉంటే ఇంకోలా ఉండేదనిచర్చ నడిచింది. రాష్ట్రం చేసుకున్న అదృష్టమో ఏమో.. ఆ గండం గట్టెక్కేసింది. కానీ.. ముప్పు తొలగిపోలేదు. మరి.. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రభుత్వం వైద్యశాఖపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందో లేదో చూడాలి.
