Site icon NTV Telugu

కాంగ్రెస్ హైకమాండ్ వారిని లైట్ తీసుకుందా…?

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలను లైట్‌ తీసుకుందా? కొత్త పీసీసీలో ఎందుకు ప్రాధాన్యం కల్పించలేదు? పీసీసీ ఎంపిక ప్రక్రియ సమయంలో వినిపించిన పేర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కాంగ్రెస్‌ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

పీసీసీలో చోటు కల్పిస్తారని ఆశించిన ఉమ్మడి వరంగల్‌ నేతలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి హేమాహేమీల్లాంటి నాయకులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు కండువా మార్చేసినా.. హస్తం శిబిరంలోనే ఉండిపోయిన సీనియర్లు అనేకమంది. మంత్రులుగా.. ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఎందరో. పీసీసీ ఎంపిక ప్రక్రియ మొదలైనప్పుడు ఈ జిల్లాలో చాలామంది పార్టీ పదవులను ఆశించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం కొందరు రేస్‌లో కూడా నిలిచారు. ఆ పోస్ట్‌ కాకపోయినా చెప్పుకోవడానికి పీసీసీలో ఇంకేదైనా గౌరవప్రదమైన చోటు కల్పిస్తారని ఆశించారు నాయకులు. కమిటీ ప్రకటన తర్వాత వారి ఆశలన్నీ నీరు గారిపోయాయి.

సీతక్క, కొండా సురేఖలకు పార్టీ పదవులు దక్కలేదు!

జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాలుగా మారింది. ఈ ఆరు జిల్లాల నుంచి ఒక్క వేం నరేందర్‌రెడ్డిని మాత్రమే కమిటీలోకి తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. వారిలో గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. మరో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వీరు కాకుండా జిల్లాలో సీనియర్లుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, పార్టీ నేతలు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండపల్లి దయాసాగర్‌, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. సీతక్క, కొండా సురేఖల్లో ఒకరికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇస్తారని ప్రచారం జరిగినా.. ఇద్దరి పేర్లనూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఓరుగల్లు ప్రాంత కాంగ్రెస్‌ నేతలను హైకమాండ్‌ లైట్‌గా తీసుకుందా అని కేడర్‌ చర్చించుకుంటోంది.

గతంలో పీసీసీ, ఏఐసీసీలలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రాధాన్యం
పదవులు రాని కాంగ్రెస్‌ నేతలు నారాజ్‌!

కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతక్కను ఆ పదవికే పరిమితం చేశారు. గతంలో పీసీసీ, AICCలలో వరంగల్‌ జిల్లాకు ప్రాధాన్యం ఉండేది. రాజకీయాల్లో చురుకుగా పనిచేసేవారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ కమిటీ ప్రకటించినా.. ఇక్కడి నాయకులు సైతం రేస్‌లో ఉండి.. పదవుల కోసం ఢిల్లీస్థాయిలో లాబీయింగ్‌ చేసేవారు. ఈ దఫా ఆ ఊసే లేదు. కొత్త కమిటీపై రియాక్షన్‌ లేదు. పదవి రాలేదన్న బాధను పైకి వ్యక్తం చేయడం లేదు. నేతలు నారాజ్‌గా ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.

కొత్త పీసీసీ కమిటీ నేతల్లో చురుకు పుట్టించలేదా?

ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన వారంతా సైలెంట్‌గా ఉన్నారు. కొత్త కమిటీకి అనుకూలమో.. వ్యతిరేకమో కూడా కామెంట్‌ చేయడం లేదు. సాధారణంగా పీసీసీకి కొత్త సారథి వస్తే ఊరేగింపుగా గాంధీభవన్‌కు వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి పోటీపడేవారు. వరసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధో ఏమో.. సీనియర్లు యాక్టివ్‌గా లేరన్నది ఓపెన్‌ టాక్‌. కొత్త కమిటీ ప్రకటన వారిలో చురుకు పుట్టించలేదట. అయితే ఇప్పుడు పదవులు రానివారంతా టైమ్‌ చూసుకుని బరస్ట్‌ అవుతారన్న అనుమానాలైతే ఉన్నాయట. మరి.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version