చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్‌గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్!
కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా?
పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు కార్పొరేటర్ల అత్యుత్సాహం GVMC అధికారులకు, వైసీపీ ముఖ్యులకు తలనొప్పిగా మారింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కౌన్సిల్ వేదికగా చర్చించాల్సిన ప్రజాప్రతినిధుల్లో కొందరు నేరుగా పంచాయితీలు చేస్తున్నారట. ఒక డివిజన్‌కు కార్పొరేటరైతే సర్వాధికారాలు ఉంటాయని భావిస్తూ.. సమీక్షలు పెడుతున్నారట. కొత్తగా వచ్చిన వాళ్లతో కాంట్రవర్సీ ఎందుకు అనుకున్నారో ఏమో.. మొదట్లోనే ఈ వ్యవహారాలను కత్తిరించాల్సిన అధికారులు చూసీచూడనట్టు ఉండిపోయారు. దీంతో కార్పొరేటర్ల తీరు ముదురు పాకాన పడిందట.
కార్పొరేటర్ల తీరుపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన కమిషనర్ !
వార్డు సచివాలయాలను కార్పొరేటర్లు అడ్డాగా చేసుకుని.. సిబ్బందికి ఆదేశాలివ్వడం.. గంటల పాటు సమీక్షలు నిర్వహించడం చర్చగా మారుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూశాక విపక్ష కార్పొరేటర్లు అదే చేస్తున్నారట. వ్యవహారం శ్రుతి మించుతుందని గమనించిన మున్సిపల్ కమిషనర్ సృజన పరిస్థితిని ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. అక్కడ నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా ఆమె కీలక చర్యలకు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కార్పొరేటర్లు నేరుగా సమీక్షలు చేస్తే హాజరుకావొద్దని.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు అధికారవర్గాల భోగట్టా. అయితే సమీక్షలకు రాకపోతే కార్పొరేటర్లతో తలనొప్పి.. వెళ్లితే అధికారులతో చీవాట్లు ఎదురవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారట.
పార్టీ మీటింగ్‌లకు రిసోర్స్ పర్సన్స్‌ను వాడేసుకుంటున్నారా?
వార్డుల్లో ఉండే రిసోర్స్ పర్సన్స్‌ను పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారట అధికారపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆర్పీలు హాజరవుతారు. కానీ, వైసీపీ మీటింగ్‌లకు కూడా రావాలని ఒత్తిడి చేస్తున్నారట. పార్టీ కార్యకర్తలతో నిర్వహించుకోవాల్సిన సభలు, సమావేశాలకు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నట్టు సీనియర్ అధికారులు దృష్టికి వెళ్లింది. వైసీపీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వంద మందిని తీసుకురావాలని కార్పొరేటర్లు ఆదేశిస్తున్నారట. ఎంత మందిని తీసుకొచ్చారో నిరూపించేందుకు ఫోటోలు అడుగుతున్నట్టు సమాచారం. అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్న తాము మీటింగ్‌లకు వెళ్లి రావడానికి ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారట ఆర్పీలు.
వైసీపీ పెద్దలు కూడా కార్పొరేటర్ల తీరుపై గుర్రుగా ఉన్నారా?
జీవీఎంసీ పరిధిలోని ఒక్కో డివిజన్‌లో పది నుంచి పదిహేను మంది ఆర్పీలు ఉన్నారు. డివిజన్లలోని డ్వాక్రా గ్రూపు సభ్యులను సమీకరించి ఆటోల్లో ప్రాంగణాలకు తీసుకురావడానికి వీళ్లకు రెండు, మూడు వేలు ఖర్చు అవుతోందట. ఈ విషయంలో కార్పొరేటర్లకు కొందరు జీవీఎంసీ ఉద్యోగులు వంత పాడటం కమిషనర్ దృష్టికి వచ్చిందట. వారిపై కఠిన వైఖరికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు కూడా కార్పొరేటర్ల తీరుపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. లేని అధికారంతో చెలరేగిపోతున్న కొందరు కార్పొరేటర్లకు త్వరలోనే అంటకత్తెర తప్పదని తెలుస్తోంది. బలమైన కేడర్ ఉండగా పార్టీ కార్యకలపాలకు ఆర్పీలను మోహరించి మమా అనిపిస్తున్న వారిపై ఆరా తీస్తున్నట్టు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి.. ఈ ఆగడాలకు అధికారులు చెక్ పెడతారో.. అధికారపార్టీ పెద్దలు కొరఢా ఝులిపిస్తారో చూడాలి.