శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్‌కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీవాణి ట్రస్ట్ కొందరికి వ్యాపార వస్తువైందా?
కొండపై దళారి వ్యవస్థను అరికట్టడానికి.. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే VIP బ్రేక్ దర్శనాలను 2019 అక్టోబరులో ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే శ్రీవాణి ట్రస్ట్. ఈ ట్రస్ట్‌కు పదివేలు విరాళంగా ఇస్తే.. వారికి ప్రొటోకాల్ తరహాలో VIP బ్రేక్ దర్శనం కల్పిస్తోంది TTD. శ్రీవాణి ట్రస్ట్‌కు ఆదరణ కూడా పెరిగింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపార ధృక్పథంతో చూడటం.. దానికి విజిలెన్స్ వెరైటీ భాష్యం చెప్పడంతో చర్చ మొదలైంది.
తమిళనాడు వ్యాపారి ఇచ్చిన ప్రకటనపై చర్చ..!
బ్రేక్ దర్శనాలు, వసతి కలిపి రూ. 1,11,116 వసూలు..!
తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసంలో శ్రీవారిని దర్శించుకోవాలని తపిస్తారు తమిళ భక్తులు. ప్రస్తుతం కొండపై కోవిడ్ నిబంధనల మేరకు పరిమితంగానే భక్తులను ధర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం.. ప్రత్యేక ప్రవేశ దర్శనం.. లేదా సిఫారసు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు పొందడం. ఇవేమీ కుదరకపోతే శ్రీవాణి ట్రస్ట్‌కు 10 వేలు విరాళంగా ఇచ్చి VIP బ్రేక్ దర్శనానికి వెళ్లడం. ఇప్పుడు ఇదే శ్రీవాణి ట్రస్ట్‌ను తన వ్యాపారానికి వినియోగించుకున్నడు తమిళనాడుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి. వాసవి యాత్ర అండ్ టూర్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు. తమిళులకు ముఖ్యమైన శనివారాలలో శ్రీవారి దర్శనం చేయించడమే ఈ ప్రకటనలోని సమాచారం. చెన్నై, కోయంబత్తురు, బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ ద్వారా తిరుపతికి తీసుకువచ్చి తిరుమలతోపాటు పద్మావతి అమ్మవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనం కల్పిస్తామని శివకుమార్ వెల్లడించారు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో వసతి సౌకర్యం, వీఐపీ దర్శనాలకు కలిపి లక్షా 11 వేల 116 రూపాయలు వసూలు చేస్తున్నారు ఆ తమిళ వ్యాపారి. చెన్నై, కోయంబత్తూరు నుంచి అయితే మరో 10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందట.
చర్చకు దారితీసిన విజిలెన్స్ పత్రికా ప్రకటన..!
ఇంత వరకు బాగానే ఉన్నా.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రైవేట్ యాడ్‌పై టీటీడీ విజిలెన్స్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. టీటీడీలో VIP బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ఉన్నవారికి, వాళ్లు సిఫారసు చేసినవారికి మాత్రమే ఉందని ఆ ప్రకటనలో విజిలెన్స్ విభాగం పేర్కొంది. శ్రీవాణి ట్రస్ట్‌కు పదివేల విరాళం ఇచ్చి VIP బ్రేక్ దర్శనం చేసుకునే వెసులుబాటు ఉన్న విషయాన్ని మర్చిపోయినట్టుంది. TTD పెట్టిన పథకాన్ని వినియోగించుకొనేవారిని దోషులుగా చేస్తోంది విజిలెన్స్. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సులువుగా అందరికీ దొరుకుతాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా.. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే బ్రేక్ దర్శనం పొందే వెసులుబాటు ఉంది. భక్తులు తమ ఆధార్‌కార్డును చూపించి బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొందవచ్చు.
సిఫారసులు లేని బ్రేక్ దర్శనాలే కొందరికి వ్యాపారం..!
ఇలా ఎలాంటి సిఫారసులు లేకుండా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు పొందే అవకాశం ఉండడంతో.. దానిని తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకొని.. సోషల్ మీడియాలో ప్రకటన జారీ చేసే స్థితికి వెళ్లింది. టీటీడీలో ఉన్న లోపాలను తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భక్తుడిని మోసగించే పరిస్థితి లేకపోయినా.. టీటీడీ మాత్రం చర్యల పేరుతో రంగంలోకి దిగడం చర్చగా మారింది. వాస్తవానికి ఇలాంటి వ్యాపార ఆలోచనలు కలగడానికి టీటీడీ వ్యవహార శైలే కారణమన్నది కొందరి వాదన.
టూరిజం పేరుతో ప్రభుత్వ సంస్థలు చేస్తున్నదేంటి?
ఒకవైపు టూరిజం అభివృద్ధి పేరుతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధికధరకు ప్రభుత్వ రంగ సంస్థలే విక్రయిస్తున్నాయి. మరోవైపు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విడుదల సమయంలో ఇంటర్నెట్ కేంద్రాలు భక్తులు వద్ద సర్వీస్ ఛార్జ్ పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఇదో బిజినెస్ టెక్నిక్‌గా మారిపోయింది. భక్తులకు తిరుమలపై ఉన్న సెంటిమెంట్‌ను అధికారికంగా కొందరు… వ్యాపార కోణంలో మరికొందరు దోచుకుంటూనే ఉన్నారు.
