పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అన్నట్టుగా తయారైంది TTD పరిస్థితి. ఏకంగా 75 మందితో బోర్డు ఏర్పాటుకు కసర్తతు పూర్తయింది. ఇదే TTDకి సంకటంగా మారినట్టు టాక్. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా.. అంతమంది పాలకమండలి సభ్యులను సంతృప్తిపర్చడం TTDకి పెద్ద సవాలేనా?
ఒత్తిళ్లతో ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పెరిగిందా?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఎట్టకేలకు పూర్తయింది. సంప్రదాయాలను పక్కన పెట్టి.. 75 మందితో బోర్డు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 25 మంది బోర్డులో ఉంటారు. మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను తర్వాత ప్రకటిస్తారు. TTD పాలకమండలికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వానికి పెద్దఎత్తున సిఫారసులు అందాయి. సీఎంలు, కేంద్రమంత్రులే కాకుండా వివిధ పక్షాల నేతలు.. మాజీ ప్రధానులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలా అనేకమంది పేర్లను సిఫారసు చేశారట. వారిని సంతృప్తిపర్చడానికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితా పెంచి.. వారందరినీ ఆ కోటాలో పడేయాలని భావిస్తోంది రాష్ట్రప్రభుత్వం. ప్రత్యేక ఆహ్వానితులు విధాన నిర్ణయాల్లో భాగం కాబోరని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డ స్పష్టం చేశారు.
75 మందికి 75 వాహనాలను సమకూర్చాలి?
75 మంది 1800 మంది దర్శనానికి సిఫారసు?
వారాంతాల్లో 75 మంది కోటా 1350 మందికి సిఫారసు?
ప్రత్యేక ఆహ్వానితులు బోర్డులో భాగం కానప్పుడు… వారికి ఉంటే ప్రొటోకాల్స్ సంగతేంటి? వారికి కేటాయించే టికెట్ల సంగతేంటి అన్నది చర్చ. సభ్యుల కోసం TTD ఒక్కొక్కొరికీ ఒక్కో వాహనం ఏర్పాటు చేసి.. అటెండర్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఒక్కసారిగా 75 మంది సభ్యులకు వాహనాలను సిద్ధం చేయడమంటే TTDకి తలకు మించిన భారమే. వీరికి వాహనాలు సమకూర్చడానికి అద్దెవాహనాల వైపు మొగ్గు చూపొచ్చు. అలాగే అటెండర్లను కేటాయిస్తే.. భక్తులకు సేవలు అందించేందుకు ఎవరు మిగులుతారో? గతంలో ఒక్కో పాలకమండలి సభ్యుడికి రోజు 50 వరకు టికెట్లు కేటాయించే వెసులుబాటు ఉండేది. గత బోర్డులో 37 మంది సభ్యులు ఉండటంతో టికెట్ల కేటాయింపులో కోత పడింది. సాధారణ రోజుల్లో 24, వారాంతాల్లో 18 టికెట్లు కేటాయించేవారు. ఇప్పుడు ఏకంగా 75 మంది సభ్యులకు టికెట్ల కేటాయింపు.. సర్దుబాటు అధికారులకు భారంగా మారక తప్పదు. పాత లెక్కల ప్రకారం రోజుకు 24, వారాంతాల్లో 18 టికెట్లకు పరిమితం అవుతారా లేక ఆ సంఖ్యను ఇంకా కుదిస్తారో చూడాలి. ఒక్కొక్కరికీ 24 టికెట్లు ఇస్తే బోర్డు మెంబర్లు సిఫారసు చేసే వారి సంఖ్య 1800 మంది అవుతుంది. అదే వారాంతాల్లో 1350గా తేలుతుంది. సామాన్య భక్తులకు పెద్దపీట అంటే .. వీళ్ల కోటా తగ్గించడం ఒక్కటే మార్గం. మరి అలా జరుగుతుందా అన్నది ప్రశ్నే.
75 మందితో బోర్డు మీటింగ్ ఎక్కడ?
ఆస్థాన మండపమే సమావేశానికి దిక్కా?
ప్రస్తుతం పాలకమండలి సమావేశాన్ని అన్నమయ్య భవన్‌లో నిర్వహిస్తున్నారు. గతంలో సభ్యుల సంఖ్య 18 మించేది కాదు. ఆ మేరకు సమావేశ మందిరాన్ని తీర్చిదిద్దారు. కానీ.. వైసీపీ సర్కార్ వచ్చాక రెండేళ్ల క్రితం 37 మందితో బోర్డు ఏర్పాటు చేయడంతో సమావేశ మందిరంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు 75 మంది సభ్యులతో సమావేశం ఎక్కడ నిర్వహించాలన్నది TTDకి ఎదురవుతున్న మరో సవాల్. ప్రస్తుతం కొత్త మీటింగ్ హాల్ నిర్మించాలంటే ఏడాది పడుతుంది. అప్పటి వరకు సమావేశాలు నిర్వహించకుండా ఉండరు. దీంతో TTD ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఆస్థాన మండపమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆస్థాన మండపంలో మఠాధిపతులు.. పీఠాధిపతుల సదస్సులు నిర్వహించేవారు. ఇప్పుడు అదే తరహాలో పాలకమండలి సమావేశాన్ని కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఉండొచ్చు. మరి ఈ సవాళ్లను టీటీడీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
