Site icon NTV Telugu

పార్టీలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై రచ్చ…!

పీసీసీలో పంచాయితీలు.. మహిళా కాంగ్రెస్‌లో సిగపట్లు. కాంగ్రెస్‌ కల్చర్‌లో ఇది కామన్‌. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్‌ పోస్ట్‌కంటే మహిళా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పదవిపై ఎక్కువ రచ్చ అవుతోంది. కమిటీ కూర్పు కొలిక్కివస్తున్నా.. ఆపేవాళ్లు తెరవెనక చురుగ్గానే పావులు కదుపుతున్నారట.

ధరలు పెరిగినా.. మహిళా కాంగ్రెస్‌ సైలెంట్‌!

తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియామకం జటిలంగా మారినట్టే.. మహిళా కాంగ్రెస్‌ నాయకుల మధ్య కూడా కయ్యాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రస్తుత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్‌ కమిటీ అచేతన స్థితిలో ఉంది. కార్యక్రమాలు లేవు. కార్యకర్తలు కూడా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నిత్యవసరాలతోపాటు వంటగ్యాస్‌ దరలు పెరిగాయి. వీటిపై మాట్లాడిన మాహిళా కాంగ్రెస్ నాయకులే లేరు.

మహిళా కాంగ్రెస్‌ కొత్త కమిటీపై కసరత్తు

ఆ మధ్య ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే.. తమకు సమాచారం ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్‌ నాయకులు రచ్చ రచ్చ చేశారు. షర్మిల పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌.. మహిళా ప్రెసిడెంట్‌తో పడకే వెళ్లారని టాక్‌. గాంధీభవన్‌ ముందు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌ కొత్త కమిటీ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. కొత్త చీఫ్‌ నియామకం కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నియామకం కూడా పీసీసీ పంచాయితీలాగే తయారైందట.

నేషనల్‌ ప్రెసిడెంట్‌ సుశ్మితదేవ్‌ పరిశీలనలో పేర్లు

మహిళా కాంగ్రెస్ పదవి నియామకం కోసం జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్​కసరత్తు మొదలు పెట్టారు. పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావు, భవానీరెడ్డి, ఇందిరారావు, గండ్ర సుజాత పేర్లు పరిశీలించారట. వీరిని రెండు, మూడు రోజులుగా సుశ్మిత దేవ్ ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారట. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా.. సునీతారావు పేరు దాదాపుగా ఖరారైందట. అయితే మహిళా కాంగ్రెస్ పరిశీలన కోసం పంపిన జాబితాపై పంచాయితీ నడుస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన భవానిరెడ్డి పేరును పరిశీలనకు పంపడంపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మహిళా నాయకులు.

సునీతారావు పేరును ఫైనల్‌ చేశారని ప్రచారం!

పీసీసీ చీఫ్‌ నియామకం విషయంలో కొత్త వారికి ఎలా పదవి ఇస్తారని సీనియర్లు గళం ఎత్తుతున్న సమయంలో.. మహిళా కాంగ్రెస్‌కు వచ్చేసరికి ఆ రూల్‌ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారట. ఇదే విషయమై మహిళా నేతలు ఒకరిపై ఒకరు కయ్‌మంటున్నారు. సిగపట్లుకు సిద్ధపడుతున్నారు. అయితే తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి నియామకం విషయంలో హైకమాండ్‌ ఒక నిర్ణయానికి వచ్చేసిందని చెబుతున్నారు. NSUIతోపాటు యూత్‌ కాంగ్రెస్‌లో పనిచేసి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న సునీతారావును ఫైనల్‌ చేశారని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా ఆమె పేరును సిఫారసు చేశారట.

సునీతారావు పేరుకు పలువురు అభ్యంతరం!

పార్టీతోపాటు.. మహిళా కాంగ్రెస్‌ను పటిష్టం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆర్థిక సమస్యలు.. అజెండా వంటి అంశాలపై సునీతారావు నుంచి హైకమాండ్‌ కొంత క్లారిటీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అవి కొలిక్కి రాగానే కమిటీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే.. సునీతారావు అంటే గిట్టని వారు.. ఆమె నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. పీసీసీ కమిటీలా మహిళా కాంగ్రెస్‌ కమిటీ కూర్పును నాన్చుతారో… తేల్చుతారో చూడాలి.

Exit mobile version