Site icon NTV Telugu

మంత్రి పువ్వాడ వర్సెస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి..!

చాలారోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి రవాణా మంత్రి.. సంస్థకు ఛైర్మన్‌, పూర్తిస్థాయి ఎండీ వచ్చారు. ఈ మార్పు రుచించలేదో ఏమో.. ఆర్టీసీవైపు కన్నెత్తి చూడటం లేదు మంత్రి. సంస్థ ఛైర్మన్‌ను కలిస్తే ఒట్టు. కలిసి సమీక్షల్లేవ్‌. ఎందుకిలా? మంత్రికి ఉన్న అభ్యంతరాలేంటి?

ఆర్టీసీ వ్యవహారాలపై మంత్రి టచ్‌ మీ నాట్‌..!

పువ్వాడ అజేయ్‌ కుమార్‌… తెలంగాణ రవాణా మంత్రి. బాజిరెడ్డి గోవర్దన్‌… తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్టీసీలో వ్యవహారాలను అన్నీ తానై చూసిన పువ్వాడ.. కొద్దిరోజులుగా సంస్థవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సీనియర్ ఐపీఎస్‌ వీసీ సజ్జనార్‌ ఎండీగా.. బాజిరెడ్డి ఛైర్మన్‌గా వచ్చాక.. పూర్తిగా ఇటు రావడమే మానేశారు. అజేయ్‌కు చెక్‌ పెట్టేందుకే సజ్జనార్‌, బాజిరెడ్డిలను తీసుకొచ్చారని జరుగుతున్న చర్చ వల్లో ఏమో.. టచ్‌ మీ నాట్‌ అన్నట్టు ఉండిపోయారు మంత్రి.

బాజిరెడ్డి, పువ్వాడ కలిసి సమీక్షలు చేసింది లేదు..!

ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్దన్‌ బాధ్యతలు చేపడుతున్న సమయంలో మంత్రి అజేయ్‌ కనిపించలేదు. ఆ తర్వాతైనా కలిసి మాట్లాడుకున్నారా అంటే అదీ లేదు. ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డిని సెప్టెంబర్‌ 16న సీఎం కేసీఆర్ నియమించారు. సెప్టెంబర్‌ 18న మంత్రి పువ్వాడను ఆయన ఇంటికెళ్లి కలిశారు బాజిరెడ్డి. ఆ తర్వాత ఎడముఖం.. పెడముఖంగా మారిపోయింది. పువ్వాడకు బాజిరెడ్డి నియామకం ఇష్టంలేకనే ఆయన్ను దూరం పెడుతున్నారని… అందుకే ఇంత వరకు బాజిరెడ్డిని కలవ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బస్సుల లెక్కలు చెప్పకపోవడంపై పువ్వాడపై సీఎం అసంతృప్తి..!

ఇటీవల తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడకు చేదు అనుభవం ఎదురైనట్టు ప్రచారం జరిగింది. ఆర్టీసీలో ఎన్ని బస్సులు ఉన్నాయో సీఎం కేసీఆర్‌ అడగ్గా.. మంత్రి చెప్పలేకపోయారట. ఆర్టీసీ అధికారులకు మంత్రి ఫోన్‌ చేసినా వివరాలు రాలేదట. ఆ ఎపిసోడ్‌లో పువ్వాడపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల టాక్‌.

బస్‌భవన్‌లో కాలు పెట్టేందుకు ఇష్టపడని పువ్వాడ..!

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక సజ్జనార్‌.. తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులకు గురి కుదిరింది. దసరా సమయంలో ప్రత్యేక బస్సుల విషయంలో ఛైర్మన్‌ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు చెబుతారు. ఆర్టీసీ అభివృద్ధికి మంత్రి పువ్వాడ సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్తామని బాజిరెడ్డి ప్రకటించారు. కానీ.. పువ్వాడ మాత్రం బస్‌భవన్‌లో కాలు పెట్టేందుకు ఇష్టపడటం లేదట. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించే సమయంలో ఈ విధంగా కీలక సారథులు ఎవరికి వారుగా ఉండటం పార్టీలోనూ..ఆర్టీసీలోనూ చర్చగా మారుతోంది. మరి.. నేతల మధ్య గ్యాప్‌ పూడ్చేందుకు పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version