NTV Telugu Site icon

ఏళ్లకు ఏళ్లు ఒకేచోట కొందరు ఐఏఎస్‌లు..!

ఐఏఎస్‌ అధికారులకు మూడేళ్లకోసారి బదిలీలు జరుగుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. తెలంగాణలో కొందరు IASలు మాత్రం ఏళ్ల తరబడి తాము పనిచేస్తున్నచోట కుర్చీలకు అతుక్కుపోయారు. అక్కడి నుంచి కదిలితే ఒట్టు. అధికార వర్గాల్లో ప్రస్తుతం వారి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోందట.

ఒకే పోస్టులో మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న కొందరు ఐఏఎస్‌లు..!

తెలంగాణ కేడర్‌లో దాదాపు 150 మంది IASలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉంటే.. మరికొందరు రాష్ట్రంలోనే వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. అధికారులు ఎవరైనా ఒకే పోస్ట్‌లో ఎక్కువ కాలం ఉండకుండా బదిలీ చేస్తుంది ప్రభుత్వం. మూడేళ్లకోసారి ఈ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. కానీ.. తెలంగాణలో కొందరు ఐఏఎస్‌లో మూడేళ్ల కంటే ఎక్కువ కాలమే కొన్ని పోస్టుల్లో పాతుకుపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏ పోస్టులో అయితే కుదురుకున్నారో.. ఇప్పటికీ అదే బాధ్యతల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఫోకల్‌ ఫోస్టుల్లో ఉంటే.. మరికొందరు లూప్‌లైన్‌కు పరిమితమయ్యారు.

ఆరేడేళ్లుగా ఒకే సీటులో పాతుకుపోయిన అధికారులు..!

ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మిత సభర్వాల్‌ 2014 జూన్‌లో CMOకి బదిలీ అయ్యారు. ఇప్పుడూ అక్కడే ఉన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శిగా 2015లో వచ్చిన జయేష్‌ రంజన్‌ ఇప్పటికీ అదే సీటులో ఉన్నారు. వీళ్లే కాదు.. హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్ అధికారి బాల మాయదేవి, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, సహకారశాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్యలు సైతం 2015 నుంచి అదే పోస్టుల్లో కొనసాగుతున్నారు. తెలంగాణ రాక ముందు నుంచీ ఆర్థిక శాఖలో కంటిన్యూ అవుతున్నారు రామకృష్ణారావు. బీసీ సంక్షేమ శాఖలో బుర్రా వెంకటేశంది కూడా అదే పరిస్థితి. సీనియర్ ఐఏఎస్‌ శైలజ రామయ్యర్‌ చేనేతశాఖకు అంకితమయ్యారు. దాదాపు ఆరేడేళ్లుగా ఒకే సీటులో అధికారులు పాతుకుపోయారు.

లూప్‌లైన్‌లో ఉన్నవాళ్లకు మోక్షం ఎప్పుడో..?

పురపాలకశాఖలో అరవింద్‌ కుమార్‌, యువజన సర్వీసులు, క్రీడల శాఖలో సవ్యసాచి ఘోస్‌, గెజిటర్స్‌ డైరెక్టర్‌గా కిషన్‌, ప్రొటోకాల్‌ విభాగంలో అర్విందర్‌ సింగ్‌, ఆయుష్‌లో అలుగు వర్షిణి, విద్యాశాఖలో నవీన్‌ మిట్టల్‌లు తమ విభాగాల్లో 2018 నుంచి కదలలేదు. వీళ్లేకాదు.. మరికొందరు ఐఏఎస్‌ అధికారులదీ అదే పరిస్థితి. వీరిలో చాలామంది తమను ఎప్పుడు బదిలీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారట. లూప్‌లైన్‌లో ఉన్నవాళ్లు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని రోజులు లెక్కపెట్టుకుంటున్నారు.

ఐఏఎస్‌ల బదిలీల్లో అందరినీ కదుపుతారా?

తెలంగాణలో త్వరలో పెద్ద ఎత్తున IASల బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరి.. ఆ జాబితాలో ఏళ్లకు ఏళ్లుగా ఒకే కుర్చీకి అతుక్కుపోయిన వారికి కూడా స్థాన చలనం ఉంటుందా.. లేక వాళ్లను టచ్‌ చేయరా? అధికార వర్గాల్లో ఇదే చర్చ. ప్రభుత్వంలోని పెద్దలకు.. కొందరు అధికారులపై గురి కుదిరితే వాళ్లను మార్చడానికి ఇష్టపడరు. పదోన్నతి కల్పించినా ప్రస్తుతం ఉన్న సీట్‌లో నుంచి కదపరు. మరి త్వరలో చేపట్టే బదిలీలలో ప్రభుత్వ ఆలోచన ఏంటో.. అధికారుల ఎదురు చూపులు ఎంత వరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.