Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమ’శిక్ష’ణకు పెద్దపీట…!

మాట మీరినా.. మాట తూలినా.. మటాషే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ట్రెండే నడుస్తోంది. పీసీసీకి కొత్తచీఫ్‌ వచ్చాక క్రమశిక్షణ కమిటీ కఠినంగా ఉంటోంది. కాకపోతే ఇప్పటివరకు వేటు పడ్డవారి గురించే చర్చ. వారంతా ఓ నేత వర్గమట. అందుకే వేటు వెనక కథేంటని చర్చించుకుంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు.

కొత్త చీఫ్‌ హయాంలో వేటుపడ్డవారి గురించి కాంగ్రెస్‌లో చర్చ!

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎవరినైనా తిట్టేయొచ్చు. అది పార్టీ వేదికైనా.. పార్టీ ఆఫీసైనా..! రాహుల్‌, సోనియాగాంధీలను తప్పించి.. పీసీసీ చీఫ్‌ మొదలుకొని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ వరకు ఎవరినీ వదలరు కొందరు నాయకులు. గాంధీభవన్‌లో తిడితే పెద్దగా పట్టించుకోరు అన్నది పార్టీ వర్గాల్లో ఓపెన్‌ టాక్‌. క్రమశిక్షణ కమిటీ ఉన్నా.. ఆ తిట్టిన వారు ఏ వర్గం.. వారి బ్యాక్‌గ్రౌండ్‌ చూసి చర్యలు ఉండేవి. ఒకవేళ నోటీసులు ఇచ్చినా.. తర్వాత ఏమైందో ఎవరికీ తెలిసేది కాదు. అలాంటి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కొత్త పీసీసీ చీఫ్‌ వచ్చాక వేటు అనే కత్తి వేళ్లాడుతోంది. పార్టీ గీత దాటినా.. మాట మీరినా.. గంటల్లోనే చర్యలు చేపడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొత్త చీఫ్‌ హయాంలో వేటుపడ్డవారి గురించే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోందట.

అప్పట్లో కౌశిక్‌రెడ్డిపై చకచకా చర్యలు!

హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. ఆయన టీఆర్ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ టికెట్‌ తనకే అని కౌశిక్‌రెడ్డి ఆడియో బయటకు రావడంతో వేటు వేయడానికి చకచకా చర్యలు చేపట్టారు. పార్టీ లైన్‌ దాటితే వేటేనని.. క్రమశిక్షణ కమిటీ కూడా అందుకు సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్‌ ఆదేశించారట. కాకపోతే కౌశిక్‌రెడ్డి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బంధువు. కానీ.. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు ఉత్తమ్‌. ఆ ఎపిసోడ్‌ అలా ముగిసింది.

గాంధీభవన్‌లో ఘర్షణపడ్డ ఇద్దరు నేతలు!

ఇటీవల రావిర్యాల దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సందర్భంగా.. గాంధీభవన్‌లో పాసుల పంచాయితీ జరిగింది. గాంధీభవన్ ఇంఛార్జి కుమార్‌రావుతో ఘర్షణకు దిగారు పార్టీ జనరల్ సెక్రటరీ నిరంజన్‌, పీసీసీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణరెడ్డి. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌పై సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఇంఛార్జ్‌గా ఠాగూర్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు ఓటమి తప్ప విజయం లేదు. ఆయన్ని మార్చితే తప్ప పార్టీ బాగుపడదు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ల హవానే పార్టీలో నడుస్తోంది అని ఆ ఇద్దరూ మండిపడ్డారు.

గాంధీభవన్‌లో జరిగిన గొడవ పీసీసీ చీఫ్‌ చెవిలో పడటంతో.. నిరంజన్‌, సత్యనారాయణరెడ్డిలను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలని ఆదేశించారట. అయితే ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని కొందరు సూచించగా.. వేటు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఇంఛార్జ్‌ చెప్పినట్టు సమాచారం. వీరు కూడా పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కు సన్నిహితులే. ఈ ఇద్దరిపై వేటు పడకుండా ఉత్తమ్‌ వర్గం విఫలయత్నం చేసిందట. దాంతో పార్టీలో మళ్లీ చర్చ మొదలైంది. మరి.. ఈ శిక్షలు వ్యూహాత్మకమా కాదో కాలమే చెప్పాలి.

Exit mobile version