Site icon NTV Telugu

టీ కాంగ్రెస్‌లో డజను మందికిపైగా అధికార ప్రతినిధులు..!

ఏ పార్టీకైనా అధికార ప్రతినిధులు బలం. విమర్శలు వచ్చినా.. సమస్యలపై స్పందించాలన్నా.. వాళ్ల పాత్ర కీలకం. కానీ.. ఆ జాతీయపార్టీలో స్పోక్‌పర్సన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు లేవట.

డజను మందికిపైగా అధికార ప్రతినిధులున్నా పార్టీ వాయిస్‌ లేదు..!

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక వేసిన పార్టీ పదవులు అధికార ప్రతినిధుల పోస్టులే. పార్టీకి అధికార ప్రతినిధుల పాత్ర కీలకమని భావించి వాటిని ప్రకటించారు. కాంగ్రెస్‌ వాయిస్‌ వినిపించడం.. సమస్యలపై పూర్తి అవగాహనతో స్పందిస్తారని ఏరికోరి మరీ ఆ జాబితాలో చాలామందికి చోటు కల్పించారు. దీంట్లో కూడా సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధులు అనే విభజన చేసింది పీసీసీ. డజను మందికి పైగా అధికార ప్రతినిధులు ఉన్నా.. వాళ్లెవరో.. ఏం చేస్తున్నారో పీసీసీకి.. పార్టీ ముఖ్యులకు తెలియదట. కాంగ్రెస్‌ వాయిస్‌ వినిపించాల్సిన వాళ్లే పార్టీ పనులు పక్కన పెట్టేశారు.

పదవుల్లో ఉన్నవారు అడపాదడపా కనిపిస్తున్నారా?

రాష్ట్రంలో వరసగా రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు.. పార్టీ మీద విమర్శలు.. ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వీటిపై అఫీషియల్‌ స్పోక్‌పర్సన్స్‌ స్పందించిన దాఖలాలు లేవు. ఉన్నామా.. అంటే ఉన్నాం అన్నట్టే ఉంది వాళ్ల తీరు. పార్టీ పదవి ఉంది కాబట్టి ఆ జాబితాలోని కొందరు అడపా దడపా గాంధీ భవన్‌లో కనిపిస్తున్నారు తప్పితే.. సీరియస్ వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు. సమస్య ఏదైనా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేదంటే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్య నాయకులే రియాక్ట్‌ అవుతున్నారు. పీసీసీ ఒక సమస్యపై లైన్‌ తీసుకుంది అంటే.. దానిపై జనంలో చర్చ జరిగేలా అధికార ప్రతినిధులు కసరత్తు చేయాలి. ఆ కోణంలో పార్టీ నేతలు ఆలోచిస్తున్నారో లేదో తెలియదు.

వ్యక్తిగతంగా ఫోకస్‌ కావడానికే చాలామంది యత్నం?

సీనియర్ అధికార ప్రతినిధుల్లో అద్దంకి దయాకర్, బెలయ్య నాయక్‌లు మాత్రమే తళుక్కుమంటున్నారు. టీవీ చర్చల్లో కనిపిస్తున్నారు. మరో ప్రతినిధి హరివర్దన్ రెడ్డి ఒకటి.. ఆర తప్పితే యాక్టివ్‌గా లేరు. సిరిసిల్ల రాజయ్య అంతంత మాత్రమే. నేరెళ్ల శారద అంటి ముట్టనట్టు ఉంటున్నారని గాంధీభవన్‌ వర్గాల టాక్‌. మానవతా రాయ్‌.. నిరుద్యోగ జాక్ నేతగా రేవంత్‌రెడ్డికి సన్నిహితం. రామచంద్ర రెడ్డి, చారగొని వెంకటేష్‌లు తప్పదు అనుకుంటే ప్రెస్‌మీట్‌ పెట్టి గాయబ్‌ అవుతున్నారు. మరో అధికార ప్రతినిధి రియాజ్ సభలు..సమావేశాలు ఉంటే తప్పితే కనిపించరట.
రవళీరెడ్డి మీడియా చర్చల్లో పాల్గొంటున్నారు. మునుగోడుకు చెందిన పున్న కైలాష్‌ ఇంకా డ్యూటీ ఎక్కలేదు. చాలా మంది వ్యక్తిగతంగా ఫోకస్‌ కావడానికి చూస్తున్నారు తప్పితే.. గాంధీభవన్‌ వేదికగా బర్నింగ్‌ టాపిక్‌లపై మాట్లాడుతున్నది లేదట.

పీసీసీ పెద్దల దిశానిర్దేశం లేదా?

కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదిలీలు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన సమస్య. వీటిని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు పట్టించుకున్నట్టు లేరు. మూడున్నర లక్షల మంది ఉద్యోగుల సమస్యను లైట్‌ తీసుకున్నారు. పీసీసీ పెద్దలు సైతం అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం లేదన్న విమర్శ ఉంది. మరి.. కాంగ్రెస్‌కు కళ్లు, చెవులుగా పనిచేయాల్సిన కీలక నేతలు ఎప్పుడు గాడిలో పడతారో.. అసలు పార్టీ వాయిస్‌ వినిస్తారో లేదో చూడాలి.

Exit mobile version