Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల లొల్లి…!

తెలంగాణ కాంగ్రెస్‌లో హైకమాండ్‌ వేసిన PAC ఏం చేస్తుంది? ఇప్పటి వరకు PCC నిర్వహిస్తున్న సమావేశాలకు.. PACకి తేడా ఏంటి? కొత్త కమిటీనే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందా.. లేక PAC ఉత్సవ విగ్రహంగా మారుతుందా?

కాంగ్రెస్‌ పీఏసీ రాజకీయ నిర్ణయాలు చేస్తుందా?

ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ రగులుతూనే ఉండటం తెలంగాణ కాంగ్రెస్‌లో కామన్‌. పార్టీలో చాలా మంది సీనియర్లకు పీసీసీ కొత్త కమిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదనే చర్చ ఉంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాశారు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. ఆ లేఖను పరిగణనలోకి తీసుకున్నారో లేక హైకమాండే ఆలోచన చేసిందో కానీ.. కాంగ్రెస్‌లో సీనియర్లు.. ఎంపీలు, మాజీ పీసీసీ చీఫ్‌లతో కలిసి పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ప్రకటించింది. PACకి రూపం ఇచ్చినా.. ఆ కమిటీ ఏం చేయాలన్నది స్పష్టత లేదు. PACనే రాజకీయ నిర్ణయాలు చేయాలా వద్దా అన్న అంశంలో పార్టీ నేతల్లోనే క్లారిటీ లేదట.

శనివారం మీటింగ్‌కు సీనియర్లు వస్తారా?

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యతిరేక బలగమంతా PACలో ఉండటంతో సీనియర్లు జట్టు కడతారా అన్న అనుమానాలు ఉన్నాయట. జట్టుకట్టి రేవంత్‌ను కట్టడి చేస్తారన్న ప్రచారమైతే జరుగుతోంది. ప్రతి శనివారం జరిగే కాంగ్రెస్‌ మీటింగ్‌కు ఇకపై సీనియర్లు కూడా వస్తారని టాక్‌. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదట. సీనియర్లతో PACని వేసినా.. పీసీసీ చీఫ్‌ దానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో తాజా పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

కోర్‌ కమిటీని రేవంత్‌ యాక్టివ్‌ చేస్తారా?

గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కోర్‌ కమిటీ సమావేశాలు పెట్టాలని.. సమీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సీనియర్‌ నేత VH పదే పదే లేఖలు రాశారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త పీసీసీ కమిటీ ప్రతి శనివారం భేటీ అవుతోంది. ఇన్నాళ్లూ ఇదే పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ అని పీసీసీ ప్రకటించింది కూడా. ఇప్పుడు కొత్తవారితో PAC ఏర్పాటైంది. అది రేవంత్‌కు ఇష్టం లేదన్నది గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దాంతో ప్రతి శనివారం భేటీ అవుతున్న దాన్నే కోర్‌ కమిటీగా మార్చుతారా అన్న సందేహాలు ఉన్నాయట. శనివారం జరిగే సమావేశాలకు.. PAC సభ్యులను పిలిచే అవకాశాల్లేవ్. అందుకే కోర్‌ కమిటీని రేవంత్‌ యాక్టివ్‌ చేయొచ్చని సమాచారం.

పీఏసీ ఏర్పాటు చేయించిన సీనియర్ల ఎత్తుగడలు ఫలిస్తాయా?

ఎట్టిపరిస్థితుల్లోనూ రేవంత్‌ను కట్టడి చేయాలని అనుకుంటున్న సీనియర్లు.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్న. వారి ప్లాన్ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందనే చర్చ నడుస్తోంది. హైకమాండ్‌ వేసిన PAC, ప్రతి శనివారం జరిగే సమావేశం ఒకటేనా? అంతమందిదో సమావేశం సాధ్యమేనా? అనే సందేహాలు ఉన్నాయట. అందుకే PAC ఉత్సవ విగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరి అభిప్రాయం. మరి.. ఈ కమిటీ వర్సెస్‌ కమిటీ పాలిటిక్స్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుందో చూడాలి.

Exit mobile version