Site icon NTV Telugu

ఇంద్రవెల్లి సభ తర్వాత ఆ పార్టీ ఆలోచన మారిందా.?

ఇంద్రవెల్లి సభ తర్వాత కాంగ్రెస్‌ ఆలోచన మారిందా? పార్టీతో కలిసి ప్రయాణం చేయకపోతే.. కాంగ్రెస్‌లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న సంకేతాలు పంపుతోందా? మారిన వైఖరిపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి?

ఇంద్రవెల్లి సభకు రాని నేతలపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చర్చ!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. సీనియర్‌ నాయకులకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటిది పదేళ్ల కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ముఖ్యులు అనుకున్నవారు తమకు భవిష్యత్‌ బాగుంటుంది అనుకున్న చోటుకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమంది కీలక నేతల మధ్య సఖ్యత లేదు. ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్‌లో ఆ ఎపిసోడే హీటెక్కించింది. సభ తర్వాత కార్యక్రమానికి రానివారిపై ఫోకస్‌ మళ్లింది.

సభకు ముందు కొందరు నేతలతో మాట్లాడిన పీసీసీ చీఫ్‌!

ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో చేపట్టిన పెద్ద కార్యక్రమం ఇంద్రవెల్లి సభ. కొందరు సీనియర్లు డుమ్మా కొట్టినా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కేడర్‌తోపాటు లీడర్స్ తరలివెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నాయకులు తప్పకుండా సభకు వస్తారని లెక్కలు వేసుకున్నారట. ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం.. సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లారట. ఇదే మంచి అవకాశం.. బద్దకం వీడి రోడ్డెక్కితేనే భవిష్యత్‌ ఉంటుందని చెప్పారట. గతంలోఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు.. మాజీ ఎమ్మెల్యేలు.. సీనియర్ నాయకులతో రేవంత్‌ మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇంత హోంవర్క్‌ చేసినా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు ఇంద్రవెల్లి సభకు రాలేదట. వారిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇంద్రవెల్లి సభకు రాని యూత్‌ నేత!

ఒకప్పుడు NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా.. యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన భార్గవ్‌ దేశ్‌పాండే ఇంద్రవెల్లి సభలో కనిపించలేదు. ఆయన 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పార్టీ టికెట్‌ రాలేదు. కానీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో తన వర్గంవారిని కొన్నిచోట్ల గెలిపించుకున్నారు. దేశ్‌పాండేతో రేవంత్‌ మాట్లాడినట్టు చెబుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ నాయకులతోనూ దేశ్‌పాండేకు సన్నిహిత సంబంధాలున్నాయట. ఆ కారణంగానే ఇంద్రవెల్లి సభకు వెళ్లలేదని అనుకుంటున్నారు.

నేతలతో సఖ్యత లేక కొందరు రాలేదా?

దేశ్‌పాండే తరహా నాయకులు జిల్లాలో చాలామంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగుతూనే వేరేపార్టీలో కర్చీఫ్‌లు వేశారట. మరికొందరు ఉన్న నేతలతో పడక దూరంగా ఉంటున్నారట. రానున్న రోజుల్లో ఇలాంటి వారిపట్ల కాంగ్రెస్‌ అనుసరించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version