Site icon NTV Telugu

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టీడీపీలో సెగ..!

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే సెగ మొదలైందా..? కొందరు టీడీపీ నేతలే ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారా..? అందుకే ఉలిక్కిపడి వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తున్నారా..? ఇంతకీ పుట్టపర్తిలో పల్లెకు వచ్చిన కష్టమేంటి?

పుట్టపర్తి టీడీపీలో పల్లెకు సెగ మొదలైందా?

పల్లె రఘునాథరెడ్డి. మాజీ మంత్రి. అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్‌. విద్యావేత్తగా ఉన్న ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా.. మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు పల్లె. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడైనా.. టీడీపీకి విధేయుడిగా ముద్రపడింది. అందుకే పల్లెను మంత్రిని చేశారని.. తర్వాత చీఫ్‌విప్‌ పదవి కట్టబెట్టారని గుర్తు చేసుకుంటుంది టీడీపీ కేడర్‌. ఇంత వరకు బాగానే ఉన్నా.. పుట్టపర్తి టీడీపీలో పల్లెకు సెగ మొదలైనట్టు ప్రచారం జోరందుకుంది.

వ్యతిరేకవర్గ మీటింగ్‌కు కిష్టప్ప రావడంతో పల్లె గుర్రు..!

పల్లె మంత్రిగా ఉన్నసమయంలోనూ పుట్టపర్తి టీడీపీలో వర్గాలు ఉన్నా.. అవి ప్రభావం చూపే స్థాయిలో లేవు. రాన్రాను అవి పెద్దవి అయ్యాయి. ఇప్పుడు పల్లెకు వ్యతిరేకంగా బాహాటంగానే తిరుగుబాటు ఎగరవేసే పరిస్థితి తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. పుట్టపర్తి టీడీపీలో పల్లెతో విభేదించే మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బీసీ గంగన్న ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప హాజరయ్యారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నిప్పుల మీద నడుస్తున్నట్టుగా ఫీలవుతున్నారట మాజీ మంత్రి పల్లె.

కేడర్‌ను తప్పుదోవ పట్టిస్తే వేటు వేస్తానని వ్యతిరేకులకు పల్లె వార్నింగ్‌..!

పల్లె వ్యతిరేకులంతా బీసీ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. కొత్త వ్యక్తులు నియోజకవర్గానికి వస్తారని జోరుగా ప్రచారం మొదలుపెట్టేశారు. ఇది పల్లెకు.. ఆయన వర్గానికి మింగుడు పడటం లేదు. ఇంకా కామ్‌గా ఉంటే బాగోదనుకున్నారో ఏమో.. టీడీపీలోని వ్యతిరేకులపై ఓపెన్‌గానే ఫైర్‌ అయ్యారు రఘునాథరెడ్డి. టీడీపీ ఆదేశాల ప్రకారం తానొక్కడినే పుట్టపర్తి టీడీపీ ఇంఛార్జ్‌ను. కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే వేటు వేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి. పార్టీ ఒకసారి వేటు వేశాక.. వారితో వెంట తిరిగినా.. వారికి మద్దతుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా టీడీపీ పరంగా చర్యలు ఉంటాయని ఈ మాజీ లెక్చరర్‌ గట్టి లెక్చరే ఇచ్చారు. అయితే మాజీ మంత్రి తీరును టీడీపీలో ఓ వర్గం తప్పుపడుతోందట.

బీసీ ప్రచారం వట్టిదేనా..? అధిష్ఠానం సంకేతాలు ఉన్నాయా..?

గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని.. అంతా కలిసి ముందుకెళ్దామని పల్లె రఘునాథరెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలోని ఆయన వ్యతిరేకులు బీసీ పల్లవి అందుకున్నారు. అందుకే బీసీ ప్రచారం వట్టిదేనా.. లేక పార్టీ అధిష్ఠానం నుంచి ఏమైనా సంకేతాలు అందాయా అనే చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌ను చూసిన వాళ్లయితే మాత్రం నిప్పులేనిదే పొగరాదుగా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. మొత్తానికి సైలెంట్‌గా ఉండే పల్లె రఘునాథరెడ్డి అనంత టీడీపీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయారు.

Exit mobile version