Site icon NTV Telugu

ఏపీ టీడీపీలో నేటి ఇంఛార్జ్‌లే రేపటి అభ్యర్థులా…?

నేటి ఇంఛార్జ్‌లే రేపటి అభ్యర్థులు. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌. పార్టీ కూడా గట్టి నిర్ణయానికే వచ్చేసిందట. నాయకులను ఒప్పించే బాధ్యతలను పెద్దలే తీసుకున్నట్టు టాక్‌. అదేలాగో..ఎందుకో ఇప్పుడు చూద్దాం.

నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నియామకంపై టీడీపీ ఫోకస్‌!

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ టీడీపీలో ముఖ్యనేతలు చాలా మంది కాడి పడేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోయారు. సొంత వ్యాపారాల్లో కొందరు.. మౌనంగా మరికొందరు ఉండిపోయారు. టీడీపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపిచ్చినా స్పందన లేదు. నేతల పలాయనంతో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించే ప్రక్రియకు టీడీపీ ఇటీవల శ్రీకారం చుట్టింది. గత ఆరు నెలలుగా చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు ఇదే పనిమీద ఉన్నారట.

టికెట్ వస్తుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయా?

ఏపీలో ప్రస్తుతం 30కి పైగా నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి టీడీపీ ఇంఛార్జ్‌లు లేరు. ఇప్పటికే ఇంఛార్జ్‌లుగా ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తారో లేదో క్లారిటీ లేదు. ఈ కారణంగానే ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకోవాలంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నాయకులు. ఎన్నికల వరకు పని చేసిన తర్వాత కొత్తవారు సడన్‌గా తెరపైకి వస్తే ఎలా అని భయపడుతున్నారట. ఈ కారణంగా పాత నాయకులు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడటం లేదట. ఈ విషయం అర్థం చేసుకున్న టాప్ లేయర్.. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల పదిమంది టీడీపీ ఇంఛార్జ్‌ల నియామకం!

ఈ మధ్య కాలంలోనే దాదాపు 10కి పైగా నియోజవర్గాలకు టీడీపీ ఇంఛార్జ్‌లను నియమించారు. ఈ సందర్భంగా పూర్తిస్థాయి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇంఛార్జ్‌లుగా ఉన్నవారే 2024లో అభ్యర్థులుగా ఉంటారని చెబుతున్నారట. నాయకులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారట. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం టీడీపీ ఇంఛార్జ్‌గా రెడ్డి సుబ్రమణ్యంను నియమించారు. గత ఎన్నికల్లో విఫల ప్రయోగం చేసిన కొవ్వూరులోను పార్టీ వెనక్కి తగ్గింది. 2014లో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయిన కెఎస్ జవహర్‌ను ఇంఛార్జ్‌ను చేసింది. నరసాపురంలో 2019వరకు ఎమ్మెల్యేగా ఉన్న బండారు మాధవనాయుడు ఆసక్తి చూపకపోవడంతో పొత్తూరి రామంజనేయరాజుకు ఓకే చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెంలో ఎరక్షన్ బాబును ఫైనల్ చేశారు. కృష్ణాజిల్లా తిరువూరును దేవదత్‌కు అప్పగించారు. కోడుమూరులో ప్రభాకర్‌ను ఇంచార్జ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇంఛార్జ్‌గా ఉంటే టికెట్‌ ఖాయమా?

ఈ విధంగా ఖాళీలను పూరిస్తున్న టీడీపీ అధిష్ఠానం.. ఇంఛార్జ్‌గా ఉంటే టికెట్‌ ఖాయమనే ఆఫర్‌ ఇస్తోందట. నమ్మకం కలిగించకపోతే.. సామర్థ్యం ఉన్నవారు పనిచేయడానికి సిద్ధపడరని గ్రహించారట. చివరి నిమిషంలో మార్పులు అనే సంస్కృతికి చెక్ పెట్టకపోతే జరిగే నష్టాన్ని అధిష్ఠానం గుర్తించినట్టు తెలుస్తోంది. సమస్యలు ఉన్నచోట స్వయంగా చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు మాట్లాడి మరీ ఫైనల్ చేస్తున్నారట. మరి ఈ హామీలు చివరి వరకు ఉంటాయా? నామినేషన్ ముందు రోజు ఒత్తిళ్లకు, పరిణామాలకు తలొగ్గి మళ్లీ పాత బాట పడతారో చూడాలి.

Exit mobile version