తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఆ పార్టీలకు పరీక్షే. ఇప్పుడు కొత్తగా మరో పార్టీ ఆ జాబితాలో చేరింది. ఉనికి కోసం క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో పోటీ చేస్తాయో లేదో తెలియదు. బరిలో ఉన్నవారికి మద్దతిస్తాయో లేదో కూడా అర్థం కాదు. మొత్తానికి గుంపులో గోవిందగా మారిపోయాయి. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ అంతేనా?
హుజురాబాద్‌లో పోటీ చేస్తాయా లేదా?
తెలంగాణాలో కొన్నిపార్టీలకు ఎన్నికలంటేనే దడ. ఒక రాజకీయపార్టీగా అలా నడిపించేద్దాం అని అనుకుంటున్న సమయంలో హుజురాబాద్ బైఎలక్షన్ నిద్ర లేకుండా చేస్తోందట. వాస్తవానికి రాజకీయ పార్టీల బలం.. బలగం.. తెలియాలన్నా.. సమర్థతకు గీటురాయిగా భావించాలన్నా ఎన్నికలే ఆధారం. ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే అందుకు బలమైన కారణం చెప్పాలి. లేదా.. బరిలో ఉన్నవారికి మద్దతివ్వాలంటే..ఎందుకో ఏంటో స్పష్టం చేయాలి. ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నికలో టీడీపీ, లెఫ్ట్, జనసేన, బీఎస్పీ, కోదండరామ్, తీన్మార్ మల్లన్న, షర్మిల పార్టీలు ఏం చేస్తాయన్నది చర్చగా మారింది.
టీడీపీ పోటీ చేస్తుందా? ఏదో పక్షానికి మద్దతిస్తుందా?
ఒకప్పుడు ఎన్నికలంటే అందరికంటే ముందు ఉండేది టీడీపీ. అలాంటిది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వెనకడుగు వేస్తోంది. హుజురాబాద్‌లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుంటే సోదిలో లేదు టీడీపీ. హుజురాబాద్‌లో ఒకానొక సమయంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అలాంటి చోట సైకిల్ ఉనికి లేకుండాపోయింది. టీ టీడీపీకి బక్కాని నర్సింహులు అధ్యక్షుడిగా వచ్చాక ఇది తొలి టాస్క్. మరి.. ఆయన సారథ్యంలో హుజురాబాద్‌లో టీడీపీ అభ్యర్థిని నిలబెడతారా? లేక ఏదో ఒక పక్షానికి మద్దతిస్తారా అన్న డైలమా తెలంగాణ టీడీపీ తమ్ముళ్లలో ఉంది.
లెఫ్ట్ ఎవరికి రైట్ చెబుతుంది?
సీపీఎం, సీపీఐల వైఖరి ఇంకా తేటతెల్లం కాలేదు. ఈ మధ్య జరిగిన రెండు ఉపఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు అనుసరించిన వైఖరిపై చర్చ జరిగింది. అందుకే హుజురాబాద్‌లోనూ అదేస్టాండ్ తీసుకుంటాయనే అభిప్రాయం ఉంది. బీజేపీకి వ్యతిరేకమన్న ఒకే ఒక అజెండాతో బరిలో ఉన్నవారికి వామపక్షాలు మద్దతిస్తాయని అనుకుంటున్నారు. అయితే లెఫ్ట్ ఎవరికి రైట్ చెబుతుందన్నది ప్రశ్నగానే ఉంది.
బీజేపీకి జనసేన జైకొడుతుందా?
షర్మిల పార్టీ ఫోకస్ 2023పైనేనా?
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తున్నాం అని చెబుతుందే తప్ప జనసేన పెద్దగా పోరాడింది లేదు. ఆ మధ్య కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఏపీలో బీజేపీతో కలిసి సాగుతున్నా.. తెలంగాణలో నిర్ధిష్ట వైఖరి అంటూ లేదు. హుజురాబాద్‌లో బీజేపీకి మద్దతిస్తారా లేక మరోదారిని ఎంచుకుంటారో తెలియదు. ఒకవేళ బీజేపీకి మద్దతు అని చెబితే.. ఈపాటికే బీజేపీ కండువాతోపాటు జనసేన జెండా కనీసం ప్రచారంలో రెపరెపలాడేది. రాజన్న రాజ్యం స్లోగన్‌తో కొత్త పార్టీ పెట్టిన షర్మిల హుజురాబాద్ బై ఎలక్షన్‌ను లైట్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఆ పార్టీ ఫోకస్ అంతా 2023పై ఉందని చెబుతున్నారు. బీఎస్పీలతోపాటు, ప్రొఫెసర్ కోదండరామ్, తీన్మార్ మల్లన్నల వైఖరి ఏంటన్నది చర్చగా మారింది. మరి.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఈ పార్టీలు బయటపడతాయో లేక గుంపులో గోవిందగా మిగిలిపోతాయో చూడాలి.
