Site icon NTV Telugu

ఉలుకు.. పలుకు లేని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ…

ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఆమె చెప్పిందే వేదం. ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలే వద్దనుకున్నారో.. లేక పరిస్థితులు బాగోలేక కామ్‌ అయ్యారో ఏమో.. ఉలుకు లేదు పలుకు లేదు. కేడర్‌ సైతం పక్క చూపులు చేసే పరిస్థితి. ఇంతకీ ఆమె మౌనం దేనికి సంకేతం? ఉపఎన్నిక వేళ జరుగుతున్న చర్చ ఏంటి?

రెండేళ్లుగా టీడీపీ నేత విజయమ్మ మౌనం!

కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీకి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈపాటికే పోలింగ్‌ జరగాల్సి ఉన్నా.. కరోనా ఉద్ధృతి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఉపఎన్నికలను వాయిదా వేసింది. 2019లో YCP ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో చనిపోయారు. దాంతో బద్వేలు ఉపఎన్నిక జరగనుంది. ఈ సమయంలో నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండాల్సిన టీడీపీ శ్రేణులు డల్‌గా ఉండటం చర్చగా మారుతోంది. బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కనుసన్నల్లోనే టీడీపీ వ్యవహారాలు నడుస్తాయి. రెండేళ్లుగా ఆమె మౌనంగా ఉంటున్నారు. ఆ ఎఫెక్ట్‌ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లోనూ కనిపిస్తోందట.

బద్వేలు టీడీపీలో విజయమ్మ చెప్పిందే శాసనం!

గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన బిజివేముల వీరారెడ్డి.. టీడీపీ ఆవిర్భావం తర్వాత బద్వేలులో సైకిల్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ లీడ్‌ రోల్‌ తీసుకున్నారు. నాటి ఉపఎన్నికలో విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. జనరల్‌ కేటగిరిలో ఉన్న బద్వేలు 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో తెరవెనక రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఆమె చెప్పిన వారే టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆమె చెప్పినట్టే జరుగుతాయి. 2014లో టీడీపీ అభ్యర్థి ఓడినా.. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో విజయమ్మ హవా సాగింది.

విజయమ్మ ఎందుకు సైలెంట్‌ అయ్యారు?

2019 ఎన్నికల్లోనూ విజయమ్మ చక్రం తిప్పాలని చూశారు కానీ.. నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు బద్వేలులో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతూ వచ్చిన విజయమ్మ ఒక్కసారిగా కామైపోయారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదట. ఒకానొక సమయంలో పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగినా.. దాన్ని కొట్టి పారేశారు. ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కేడర్‌ సైతం డైలమాలో ఉందట.

రెండేళ్లుగా టీడీపీ కార్యక్రమాలకూ దూరం!

2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ కేడర్‌ చెదిరిపోకుండా కాపాడుకుంటూ వచ్చారు విజయమ్మ. 2014లో వైసీపీ నుంచి గెలిచిన జయరాములు నాటి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చిక్కి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఆ స్థాయిలో చక్రం తిప్పిన విజయమ్మ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారట. టీడీపీ పిలుపిచ్చే కార్యక్రమాలేవీ పట్టించుకోవడం లేదట. దీంతో కేడర్‌కు బద్వేలులో అసలు టీడీపీ ఉందా అన్న అనుమానం కలుగుతోందట. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన రాజశేఖర్‌ మాత్రమే అడపాదడపా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రాజకీయాల్లో కొనసాగుతారో.. లేదో?

ఉపఎన్నిక వేళ బద్వేలులో టీడీపీ పరిస్థితిని చూసినవారంతా.. విజయమ్మ రాజకీయాల నుంచి తప్పుకొన్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటనల్లేవ్‌. దీంతో ఆమె రాజకీయాల్లో కొనసాగుతారా.. లేక గుడ్‌బై చెబుతారా అని చర్చించుకుంటున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version