Site icon NTV Telugu

టీఆర్ఎస్‌ వైపు సర్వే మనసు మొగ్గు చూపుతోందా?

గతంలో కేంద్రమంత్రిగా పనిచేసి.. ఓ వెలుగు వెలిగిన ఆయన కొన్నాళ్లూగా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో.. సడెన్‌గా చర్చల్లోకి వచ్చారు. ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించి ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయన దారెటు? కొత్త కామెంట్స్‌.. కొత్త ప్రయాణానికి సూచికా లేక.. పాత శిబిరంలో సర్దుకుపోతారా అని అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు?

దళితబంధుపై సర్వే ప్రశంసల జల్లు!
సర్వే కామెంట్స్‌తో సంబంధం లేదన్న కాంగ్రెస్‌!

సర్వే సత్యనారాయణ. కేంద్ర మాజీ మంత్రి. ఇటీవల బీజేపీ నాయకులు ఆయనతో భేటీ కావడంతో చర్చల్లోకి వచ్చారు. మళ్లీ సైలెంట్‌. సడెన్‌గా దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం గొప్ప కార్యక్రమంగా అభినందల్లో ముంచెత్తారు. దళితుల జీవితాలు బాగుపడతాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. పైగా ఈ పథకంపై విమర్శలు చేస్తున్నవారికి చురకలు వేశారు సర్వే. దళితబంధుకు మద్దతు తెలియజేయాలని అన్ని పార్టీలను కోరారాయన. సర్వే చేసిన ఈ కామెంట్సే ఒక్కసారిగా వేడి పుట్టించాయి. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పటికీ పార్టీలోకి తిరిగి తీసుకోలేదు. చాలా మంది దీన్ని మర్చిపోయారు. సర్వేను కాంగ్రెస్‌ నాయకుడిగానే చూస్తున్నారు. దీంతో అలర్టయిన కాంగ్రెస్‌ పార్టీ.. సర్వే చేసిన కామెంట్స్‌తో తమకు సంబంధం లేదని కాంగ్రెస్‌ చెప్పుకొచ్చింది.

గతంలో సర్వేతో బీజేపీ నేతలు మంత్రాంగం!

దళిత బంధు పథకంపై సర్వే ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా.. రాజకీయ భవిష్యత్‌పై ఆయన క్లారిటీతో ఉన్నారా లేదా అన్న చర్చ మొదలైంది. అప్పట్లో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ.. సర్వే ఏదీ తేల్చలేదు. ఇప్పుడా ఆ చర్చ కూడా లేదు. బీజేపీలోకి వెళ్లడానికి ఆయన సిద్ధంగా లేరని టాక్‌. ఇంతలోనే దళితబంధును గొప్పగా అభివర్ణించడంతో ఆయన టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. అయితే సర్వే కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఆ పార్టీవర్గాలు చెప్పేమాట. ఈ దిశగా అనుచరులకు ఆయన కొంత క్లారిటీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వచ్చే నెలలో సోనియాగాంధీతో భేటీ?

సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీతో భేటీ కావాలని సర్వే చూస్తున్నారట. అధిష్ఠానంతో ఆయన టచ్‌లో ఉన్నట్టు సమాచారం. మేడమ్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్టు తెలుస్తోంది. సోనియాగాంధీతో భేటీ తర్వాత తిరిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటారా లేదో చూడాలి. తెలంగాణలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకంపట్ల సర్వే సానుకూలంగా ఉన్నారట. కాంగ్రెస్‌పార్టీ కూడా దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో సర్వే అభిప్రాయం భిన్నంగా ఉన్నా.. సీఎం కేసీఆర్‌ను పొగిడి.. కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతానంటే రేవంత్‌ అండ్‌ టీమ్‌ ఒప్పుకొంటుందా అన్నది మరో చర్చ.

కాంగ్రెస్‌ కాదంటే టీఆర్‌ఎస్‌ ఒక ఆప్షన్‌గా చూస్తున్నారా?

తెలంగాణలో బీజేపీ ఎదగడం కష్టమనే అభిప్రాయంతో ఉన్న సర్వే.. టీఆర్ఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించి గందరగోళానికి తెరతీశారు. ఒకవేళ కాంగ్రెస్‌లో గేట్లు క్లోజ్‌ అయితే.. ఒక ఆప్షన్‌గా టీఆర్‌ఎస్‌ను ఉంచుకోవడానికే దళితబంధును ఉపయోగించుకున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. ఏది ఏమైనా సర్వే మనసు ఎప్పుడు ఎటు మొగ్గు చూపుతుందో అంచనా వేయలేమంటున్నారు ఆయన్ని దగ్గరగా చూసినవాళ్లు.

Exit mobile version