గుంటూరు జిల్లా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు రూట్ మార్చారా? తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇస్తే చాలు.. తాను పోటీ నుంచి వైదొలుగుతానన్న రాయపాటి ఈసారి తన ఫ్యామిలీకి ఏకంగా రెండుసీట్లు ఇవ్వాల్సిందే అంటున్నారా? దాని వెనక ఆంతర్యం ఏంటి? అసలుదాన్ని పట్టాలంటే కొసరు అడగాల్సిందేనన్నదే రాయపాటి ప్లానా?
కుమారుడికి సీటు కోసం రాయపాటి లాబీయింగ్!
గుంటూరు రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన రాయపాటి సాంబశివరావు వారసుడిని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నారట. గత ఎన్నికల్లోనే కుమారుడు రంగబాబును సత్తెనపల్లి నుంచి పోటీకి దింపడానికి విశ్వ ప్రయత్నం చేశారు రాయపాటి. దివంగత కోడెల శివప్రసాదరావు ససేమిరా అనడంతో రాయపాటి వెనక్కి తగ్గారు. కుమారుడి కోసం అవసరమైతే నరసరావుపేట పార్లమెంట్ సీటు పోటీ నుంచి తాను వైదొలుగుతానని కూడా అప్పట్లో రాయపాటి పార్టీ ఆఫర్ ఇచ్చారు. కట్ చేస్తే రాయపాటి ఇప్పుడు మరలా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉండగానే కుమారుడికి సీటు కోసం లాబీయింగ్ మొదలెట్టారట. అయితే ఈసారి ఆయన తన ఫ్యామిటీకి రెండు సీట్లు కావాలని చంద్రబాబు దగ్గర డిమాండ్ పెట్టారట. కుమారుడితోపాటు.. సోదరుడు రాయపాటి గోపాలకృష్ణ కుమార్తె డాక్టర్ శైలజకీ సీటు ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు రాయపాటి.
తమ్ముడు కుమార్తె శైలజకూ సీటు కోరారట!
రెంటు సీట్లు కోరితే ఒక్కటైనా దక్కుతుందని లెక్క?
కోడెల మృతి తర్వాత సత్తెనపల్లికి ఇంఛార్జ్‌ని నియమించలేదు పార్టీ. దీంతో అక్కడ తన కుమారుడు రంగబాబుకు అవకాశం ఇవ్వాలని బాబును కోరారట రాయపాటి. దీంతోపాటే కుమార్తె వరసైన శైలజకు కూడా సీటు ఇవ్వాలని అడిగారట. అయితే ఆ సీటు ఎక్కడో ఆయన బయట పెట్టడం లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు టీడీపీ ఇంచార్జ్‌లు ఉన్నారు. ఎవరినీ కదిపే పరిస్థితి లేదు. మరి రాయపాటి వారి రెండు సీట్ల డిమాండ్ కథ ఏంట్రా అంటే.. దాని కథ వేరే ఉంది అంటున్నారట. 2 సీట్లు అడిగితే ఒక్కటైనా గట్టిగా దొరుకుతుంది అనేది రాయపాటి వారి లెక్క అట. వయోభారం దృష్ట్యా ఈ సారి రాయపాటి పోటీ చేయపోవచ్చు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే కుమారుడికి మాత్రం సీటు ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట.
చంద్రబాబు దగ్గర మాట తీసుకోవడానికే రెండు డిమాండ్లు!
గత ఎన్నికల్లో రంగబాబును సత్తెనపల్లి నుంచి బరిలో దింపేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని అయితే కోడెల కుదరదు అనడంతో అది ఆగిపోయిందట. ఈసారి అక్కడ ఎవరూ అడ్డు లేకపోవడంతో చంద్రబాబు కూడా తమకు అనుకూలంగా ఉంటారని రాయపాటి శిబిరం ఆశిస్తోంది. అయినా ఎటుపోయి.. ఏం వస్తుందోనని బాబు దగ్గర మాట తీసుకోవడానికి రాయపాటి రెండుసార్లు డిమాండ్‌ను తెరపైకి తెచ్చారట. చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తే సత్తెనపల్లి సీటును పక్కాగా పట్టేయవచ్చనేది వ్యూహం.
రాయపాటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా?
వాస్తవంగా రాయపాటి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేనట. ఒక సీటుకు పోటీచేసి ఖర్చు పెట్టుకోవడమే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కష్టం అంటున్నారు. అలాంటిది 2 సీట్లు అంటే అయ్యే పనికాదని అభిప్రాయపడుతోంది అనుచరగణం. రాజకీయ వారసత్వం నిలుపుకోవడానికే రాయపాటి తపన పడుతున్నారట.
