Site icon NTV Telugu

పెదవేగి వైసీపీలో రచ్చ రచ్చ …?

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. కీలక నియోజకవర్గంలో గెలిచారు. ఇక తనకు తిరుగే లేదని అనుకున్నారో ఏమో.. క్షేత్రస్థాయిలో సీన్‌ రివర్స్‌. కేడర్‌నే కంట్రోల్‌ చేయలేకపోతున్నారట. పైగా ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు. ఇకేముందీ.. రెండోవర్గం టైమ్‌ కోసం ఎదురు చూస్తోందని ఒక్కటే గుసగుసలు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఎమ్మెల్యేపై వైసీపీలోని మరోవర్గం గుర్రు..!

కొఠారు అబ్బయ్య చౌదరి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ కోటను వైసీపీ గాలిలో బద్దలుకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి గెలుపు తన పెతాపమే అనుకున్నారో ఏమో.. నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు అబ్బయ్య చౌదరి. ఎమ్మెల్యేగా ప్రజలను.. పార్టీ కార్యకర్తలను సమానంగా చూడాల్సిన ఆయన.. ఒకవైపే చూస్తున్నారట. దీంతో నిర్లక్ష్యానికి లోనైన రెండోవర్గం ఎమ్మెల్యేపై కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం. చివరకు దెందులూరులోని వైసీపీ శ్రేణులపై అబ్బయ్య చౌదరి నియంత్రణ కోల్పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెదవేగి వైసీపీలో రచ్చ రచ్చ
ఎమ్మెల్యే తీరుపై ఎంపీపీ రమ్య వర్గం గుస్సా..!

నియోజకవర్గంలో నాలుగు మండలాలు పెదవేగి.. దెందులూరు.. పెదపాడు.. ఏలూరు రూరల్‌ ఉన్నాయి. పెదవేగి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అనుకూలం. ఇక్కడ ఎప్పటి నుంచో పట్టుకోసం చూస్తున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. కలిసికట్టుగా సాగాల్సిన మండలంలో ఆయనే ఒకవర్గాన్ని ప్రోత్సహించడం పెదవేగి వైసీపీలో రచ్చ రచ్చ అవుతోంది. ఇందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పుట్టిన రోజు వేడుకలే వేదిక అయ్యాయి. వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు తొంటా తాతయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎంపీపీ రమ్య వర్గం చించేసింది. దీంతో తాతయ్య భార్య పిల్లలతో వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో ఎమ్మెల్యే రావడంతో తాతయ్యను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు. తర్వాత కొందరు పార్టీ నాయకులు వెళ్లి తాతయ్యను ఎమ్మెల్యే కార్యక్రమానికి తీసుకొచ్చారు. మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయిస్తానని అబ్బయ్య చౌదరి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారంతా. ఈ మాట వినగానే ఎంపీపీ రమ్య వర్గం రివర్స్‌ అయ్యింది. అయితే పార్టీలో మాకు విలువ లేదా అని ప్రశ్నలు సంధించారు. తాతయ్య మళ్లీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించారు రమ్య.

ఎమ్మెల్యేను దెబ్బతీయాలనే ప్లాన్‌లో రెండో వర్గం?

ఈ గొడవపై చర్చ జరుగుతుండగానే ఎంపీపీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తుండటంతో పార్టీ నేతలు వారిని ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లారు. ఎంపీపీ భర్త ఆదేశాలతోనే తీసేస్తున్నామని చెప్పడంతో అబ్బయ్య చౌదరికి ఆగ్రహం కట్టలు తెంచుకుందట. వెంటనే వాళ్లను పెదవేగి పోలీసులకు అప్పగించారట. ప్రస్తుతం ఈ వర్గపోరు ఎమ్మెల్యే కాళ్ల కిందకే నీళ్లు తీసుకొచ్చేలా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తీరు నచ్చని రెండో వర్గం ఎమ్మెల్యేను ఎలా దెబ్బతీయాలా అనే ప్లాన్‌లో ఉందట. వచ్చే ఎన్నికల్లో అబ్బయ్యకు ఈ వర్గం నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ప్రతికూల ఫలితాలు వస్తాయని కేడర్‌ ఆందోళన చెందుతోందట.

స్పీడ్‌ పెంచిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని

గత ఎన్నికల్లో ఓడి.. అనేక కేసుల్లో ఇరుక్కుని కొన్నాళ్లు కామ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇప్పుడిప్పుడే మళ్లీ స్పీడ్‌ అందుకుంటున్నారు. తిరిగి సత్తా చాటేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. దీనికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుసరిస్తున్న విధానాలు కూడా చింతమనేనికి కలిసి వస్తున్నట్టు సమాచారం. మరి రానున్న రోజుల్లో దెందులూరు రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version