సింహాచలం, మాన్సస్ అక్రమాల అంతు తేలుస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. భగవంతుడి సొమ్ము తిన్న వాళ్లకు అరెస్టులు తప్పవని హింట్ ఇస్తోంది. ఈ హెచ్చరికల వెనక ప్రభుత్వ పెద్దలకు పకడ్బందీ వ్యూహమే ఉందా? విచారణ కోసం సీఐడీ రంగంలోకి దిగనుందా? తాజా పరిణామాలు దేనికి సంకేతం?
నాటి ఈవో రామచంద్రమోహన్ సమయంలోనే రికార్డుల్లో మార్పు?
విజయనగర సంస్థానం వారసత్వ వివాదం తర్వాత మాన్సస్ ట్రస్ట్.. సింహాచలం దేవస్థానం భూముల తేనెతుట్ట కదిలింది. 2016 సమయంలో సుమారు 800 ఎకరాల ఆలయ భూములు చేతులు మారాయనేది ప్రభుత్వం అంచనా. నిబంధనలకు విరుద్ధంగా టెంపుల్ ప్రాపర్టీ రిజిస్టర్లోనూ మార్పులు జరిగినట్టు నిర్ధారించుకుంది. అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అశోక గజపతిరాజుకు ఇష్టుడైన ఆఫీసర్‌గా ముద్రపడ్డ కోడూరి రామచంద్ర మోహన్‌ను విధుల నుంచి తప్పించింది. సింహాచలంలో ఆరేళ్లపాటు ఆయన ఈవోగా పని చేశారు. రామచంద్రమోహన్ హయాంలోనే ప్రాపర్టీ రిజిస్టర్లో దేవుడి భూముల రికార్డులను మార్చారనేది అభియోగం. ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ స్థాయిలో పనిచేస్తున్న రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్టేననే చర్చ జరుగుతోంది.
అశోక్, రామచంద్రమోహన్ కలిసి తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష!
సింహాద్రి అప్పన్నకు 11 వేల ఎకరాలకుపైగా భూములు!
అశోక గజపతిరాజు సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా ఉన్న కాలంలో ట్రస్ట్ బోర్డు మనుగడలో లేదు. మాన్సస్ వ్యవహారాలకు సైతం రామచంద్ర మోహనే ఇంచార్జ్‌గా ఉన్నారు. దీంతో అశోక గజపతిరాజు, రామచంద్ర మోహన్ ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఇటీవల దేవుడి ఆస్తులు-దేవాలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సింహాచలం పంచ గ్రామాల వివాదం పరిష్కారం కోసం చర్చ జరిగినప్పుడు అనేక కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. సుమారు 11వేల ఎకరాలకు పైగా సింహాద్రి అప్పన్నకు భూములు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీటిలో రైతులు, బడబడా వ్యక్తుల చేతుల్లోనే సింహభాగం ఉన్నట్టు నిర్ధారణైంది.
1948 నుంచి మాన్సాస్‌లో జరిగిన లావాదేవీలపై ఫోకస్!
70 ఏళ్లనాటి రికార్డులు, ఫైళ్లు సిద్ధం చేస్తున్నారు!
మొత్తం భూముల వాస్తవ పరిస్థితులను లెక్క తీసేందుకు జియో టాగింగ్, రికార్డ్స్ డిజిటలైజేషన్ ప్రారంభమైంది. ఆ సందర్భంగానే ప్రాపర్టీ రిజిస్టర్లో తేడాలు గమనించారట. ఈ భూముల విలువ పదివేల కోట్ల రూపాయల పైమాటేనని ప్రభుత్వ పెద్దలు లెక్కగడుతున్నారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమలులోకి రాగా.. అప్పటి నుంచి మాన్సస్‌లో జరిగిన లావాదేవీలు అన్నింటినీ పరిశీలించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించగా వీటిని సమన్వయం చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. దేవాదాయ, రెవెన్యు శాఖల దగ్గర ఉన్న మొత్తం రికార్డులను తనిఖీలు చేసి కులంకుషంగా విచారణ జరపాలని సూచించింది. దేవాదాయ, రెవెన్యు, రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలతో కూడిన ఆరు బృందాలు ఆ పనిలో ఉన్నాయి. 70ఏళ్ల నాటి రికార్డులను తవ్వి తీయాలని నిర్ణయించడంతో.. వాటికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నాయి విచారణ బృందాలు.
అశోక్ మినహాయింపు కాదని ఇప్పటికే అధికారపార్టీ పెద్దలు ప్రకటన!
అశోక్ అక్రమాలను బహిర్గతం చేస్తామని ప్రకటించిన అధికారపార్టీ పెద్దలు ఇప్పుడు కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఆయన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన కాలంలో భూముల బదలాయింపు జరిగిందని స్వయంగా మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్రమాలు నిరూపణైతే బాధ్యులను జైలుకు పంపడానికి వెనుకాడబోమని కుండబద్ధలు కొడుతున్నారు. ఇందుకు అశోక్ మినహాయింపు కాదని ఎంపీ విజయసాయిరెడ్డి ఖరకండిగా చెబుతున్నారు కూడా. అశోక్‌పై చర్యలు అనివార్యమైతే విజయనగర సంస్థానంపై ప్రజలకు ఉన్న అభిప్రాయాల ఆధారంగా తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే దూకుడుగా కాకుండా ప్రణాళిక బద్ధంగా వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనట.
విచారణ అధికారిగా డీసీ పుష్పవర్దన్ నియామకం
సీఐడీ ఎంట్రీ ఇచ్చాక ఒక దెబ్బకు రెండు పిట్టలు!
రికార్డుల మార్పు, భూములు బదలాయింపులను కుట్రపూరిత చర్యలుగా భావిస్తున్నారు అధికారపార్టీ పెద్దలు. తాజాగా విచారణ అధికారిగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌ను నియమించి స్పీడ్ పెంచారు. త్వరలో దర్యాప్తు కోసం సీఐడీని రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భోగట్టా. దర్యాప్తు సంస్థగా సీఐడీకి ఉన్న అనుభవంతో సమగ్ర విచారణ జరిపించడం ద్వారా వన్ షాట్ ఎట్ టు బర్డ్స్ అనిపించాలన్నది అసలు ఉద్దేశంగా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే పరిణామాలు కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
