సైకిల్ దిగి కారెక్కిన ఎల్ రమణ లోడ్ ఎత్తాలా? ఆయనకు ఎలాంటి పదవీ యోగం ఉంది? ఈటల ఎగ్జిట్ తర్వాత రమణకు రెడ్‌కార్పెట్ పరిచిన టీఆర్ఎస్.. కేబినెట్‌లోకి తీసుకుంటుందా? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటేంటి?
ఈటల ఎపిసోడ్ తర్వాత పెరిగిన ప్రాధాన్యం
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్ రమణకు అధికారపార్టీలో లభించే ప్రాధాన్యం ఏంటి? మారిన రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఆయనకు కలిసి వస్తాయి? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన వివాదరహితుడు. తెలంగాణకు వ్యతిరేకంగా ముద్రపడ్డ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్నా.. రమణ విషయంలో సాఫ్ట్ కార్నరే ఉందని చెబుతారు. ఈటల ఎపిసోడ్ తర్వాత ఆయనకు ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది.
read also : జల వివాదం : కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ !
రమణ చేరికతో టీఆర్ఎస్ లెక్కలు సరిపోయాయా?
కేబినెట్ నుంచి ఈటలను బర్తరఫ్ చేశాక ఆ ఖాళీని అదే జిల్లా నుంచి భర్తీ చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. పైగా హుజురాబాద్ ఉపఎన్నిక వేళ టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న రమణను గులాబీ శిబిరంలో చేర్చుకోవడంవల్ల మేలనే లెక్కలు ఉన్నాయి. ఆయన బీసీ సామాజికవర్గంలోని పద్మశాలీ. బీసీ వర్గానికి చెందిన ఈటల వెళ్లితే.. అదేవర్గానికి చెందిన రమణతో ఖాళీని భర్తీ చేశామనే అభిప్రాయం టీఆర్‌ఎస్ వర్గాల్లో ఉందట.
సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడమే మిగిలింది!
ఎల్ రమణకు టీఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం ఇప్పటిది కాదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండవ వెంకటేశ్వరరావు లాంటి కీలక నేతలు గులాబీ శిబిరంలో చేరినప్పుడే ఆయన కోసం ప్రయత్నించారు. అయితే పదవీ లేకున్నా టీడీపీకి విధేయుడిగా ఉంటానని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ బతికే పరిస్థితులు లేకపోవడం.. టీఆర్ఎస్ నుంచి ఒత్తిడి పెరగడంతో నిర్ణయం తీసేసుకున్నారు రమణ. ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు కూడా. ఇక కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడమే మిగిలింది.
పద్మశాలీ కోటాలో రమణకు ఎమ్మెల్సీ?
మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారా?
తెలంగాణలో ప్రస్తుతం ఏడు ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. ఒకటి గవర్నర్ కోటా కాగా మరో ఆరు ఎమ్మెల్యే కోటాలో వేకెట్ అయ్యాయి. ఏ క్షణమైనా వీటి భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు. పద్మశాలీ సామాజికవర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ కోటాలో ఎల్ రమణకు శాసనమండలి బెర్త్ ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో చర్చా మొదలైంది. ప్రగతి భవన్లో రమణను కలిసిన టైమ్‌లో సీఎం కేసీఆర్ మరో హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈటల బర్తరఫ్‌తో ఖాళీ అయిన కేబినెట్‌లో స్థానాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఆ విధంగా రమణను మంత్రివర్గంలోకి తీసుకునేలా చర్చించినట్టు సమాచారం. భవిష్యత్‌లో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ ఉంటే అప్పుడు ఛాన్స్ ఇస్తామని సీఎం చెప్పారట. అయితే ఇప్పట్లో కేబినెట్ రీషఫుల్ ఉంటుందా? ఉంటే.. ఎల్ రమణకు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
