Site icon NTV Telugu

హుజురాబాద్‌ టీఆర్ఎస్‌లో కౌశిక్‌రెడ్డి తీరుపై చర్చ!

అధికారపార్టీలో అంతా ఉపఎన్నికపై ఫోకస్‌ పెడితే.. ఇటీవలే కండువా మార్చిన ఆయన మాత్రం ఇంకేదో షో చేస్తున్నారట. ఒంటరిగా వదిలేస్తే.. ఎక్కడ తలనొప్పులు తెచ్చిపెడతారో అని భయపడి.. ఆయన్ని వెంటేసుకుని మరీ తిరుగుతున్నారట సీనియర్‌ నాయకులు. పైగా బైఎలక్షన్‌ను వదిలిపెట్టి.. సొంత భవిష్యత్‌ కోసం భారీ స్కెచ్‌లు వేస్తున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ?

కౌశిక్‌రెడ్డి చేరినప్పుడు హుజురాబాద్‌ టీఆర్ఎస్‌ శ్రేణులు గుర్రు!

హుజురాబాద్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్‌. ఈటల రాజేందర్‌ రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడ మోహరించాయి గులాబీ శ్రేణులు. ఈ సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే వేయాలన్నది పార్టీ నేతల ఆలోచన. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేస్తున్నారు నాయకులు. అయితే హుజురాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరికలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది టీఆర్‌ఎస్‌. అలా గులాబీ కండువా కప్పుకొన్నవాళ్లే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎల్‌ రమణ, ఇ. పెద్దిరెడ్డి. వీరందరిలో కౌశిక్‌రెడ్డి చేరికే కొంత చర్చగా మారింది. అతని చేరికపై హుజురాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నియోజకవర్గంలో కౌశిక్‌ తీరు తలనొప్పులు తెచ్చిపెడుతోందని గులాబీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. ఆ విషయాలపైనే పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

సీఎం, మంత్రులు వస్తే షో చేసి గాయబ్‌!

టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోక ముందే ఆయన ఆడియోలు కలకలం రేపాయి. తానే టీఆర్ఎస్‌ అభ్యర్థినంటూ చెప్పిన మాటలపై చర్చ జరిగింది. ఆ సమయంలో ఆడియో లీకులు అధికారపార్టీ నేతలకు ఇబ్బందిగా మారాయి. ఇంతలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం.. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా పేరును ప్రతిపాదించడం.. ఆ ఫైల్‌ ఎక్కడుందో తెలియకపోవడం ఒక ఎత్తు అయితే.. హుజురాబాద్‌లో ఆయన వ్యవహార శైలి గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. ఊరంతా ఒకదారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టు కౌశిక్‌ తీరు ఉందని ఆందోళన చెందుతున్నారట. పైగా సీఎం, ఇతర మంత్రులు వస్తే.. షో చేసి వెళ్లిపోతున్నారట.

ప్రైవేట్‌ సంభాషణల్లో చేస్తున్న కామెంట్స్‌ కంగారెత్తిస్తున్నాయా?

ప్రస్తుతం ఉపఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ గెలిస్తే.. ఆయన టెంపరెరీ అని చెబుతున్నారట కౌశిక్‌రెడ్డి. ఆ తర్వాత రెండేళ్లకు జరిగే ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అని ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో ఇప్పుడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపొందడానికి ఏం చేయాలో ఆలోచించకుండా.. ఈ సొంత ప్రచారం ఏంటని మండిపడుతున్నాయట పార్టీ శ్రేణులు. పైగా పార్టీ నేతలతో జరిగే ప్రవేట్‌ సంభాషణల్లో ఆయన చేస్తున్న కామెంట్స్‌ కంగారెత్తించేలా ఉన్నాయట. దీంతో ప్రజల ముందుకెళ్లితే ఏం మాట్లాడి.. ఇంకేం తలనొప్పులు తీసుకొస్తారో అని భయపడుతున్నారట. అందుకే ఆయన్ని ఎక్కడా మాట్లాడనీయకుండా.. కంటికి రెప్పలా కాపు కాస్తున్నారట. ఒక సీనియర్‌ మంత్రైతే.. ఎక్కడికెళ్లినా వెంట బెట్టుకుని వెళ్తున్నారట. దీంతో కౌశిక్‌రెడ్డిపై హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌లో ఒక్కటే చర్చ. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందని చెవులు కొరుక్కుంటున్నట్టు సమాచారం. మరి.. ఉపఎన్నికయ్యే వరకు కౌశిక్‌పై ఎంతమంది కన్నేసి కాపు కాస్తారో చూడాలి.

Exit mobile version