రెబల్ అభ్యర్థి బరిలో ఉండటంతో టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ జిల్లాపైనే ఉందా? కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా.. గులాబీ శిబిరంలో గుబులెందుకు? లెట్స్ వాచ్..!
రెబల్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరో ఆరుచోట్ల పోటీ నెలకొంది. ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పక్క రాష్ట్రాల్లోను ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఈ హీట్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై నెలకొంది. అక్కడ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి బరిలో ఉండటమే ఆ ఫోకస్‌కు కారణం. జిల్లాలోను రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. అనేకమంది స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నా.. రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ససేమిరా అన్నారు. ఆయన కరీంనగర్ మాజీ మేయర్ కూడా.
ఎవరికి వారు లెక్కలతో కుస్తీ పడుతున్నారా?
టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ సీటు ఆశించారు రవీందర్‌సింగ్. గతంలోనే ఆ మేరకు హామీ లభించిందన్నది ఆయన వాదన. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన తనదే గెలుపు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారపార్టీ అప్రమత్తమైంది. టీఆర్ఎస్ నేతలతో రవీందర్‌సింగ్‌కు ఉన్న పరిచయాలు ఏంటి? అవి ఎంత వరకు కలిసి వస్తాయి అనే సందేహాలు గులాబీ శిబిరంలో ఉన్నాయట. పైగా కాంగ్రెస్, బీజేపీల నుంచి అభ్యర్థులు బరిలో లేరు. ఉన్నదల్లా టీఆర్ఎస్ రెబల్. దాంతో పరిస్థితులు ప్రతికూలంగా మారకుండా జాగ్రత్త పడుతున్నారు టీఆర్‌ఎస్ నాయకులు. ఎవరికి వారు లెక్కలతో కుస్తీ పడుతూ.. రకరకాల అంచనాల వేసుకుంటున్నారు కూడా.
కాంగ్రెస్ మద్దతు కోరిన రవీందర్‌సింగ్..!
రవీందర్‌సింగ్‌కు మద్దతుగా ఇప్పటికే పలువురు ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో ఆ ప్రభావం స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ ఓటర్లపై ఎంత వరకు ప్రభావం చూపుతుందో అంచనాకు రాలేకపోతున్నారట. విపక్ష పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఈ టీఆర్‌ఎస్ రెబల్ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని కలిసి మద్దతు కోరారు రవీందర్‌సింగ్. ఈ మాజీ మేయర్‌కు మద్దతుగా మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ ఉన్నట్టు గుసగసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు లోపాయికారీగా టీఆర్ఎస్ రెబల్‌కు మద్దతిస్తే ఏంటన్నది ఒక ప్రశ్న. ఆ రెండు పార్టీలు కలిసినా ఇక్కడ టీఆర్‌ఎస్ బలం ఎక్కువే. అందుకే టీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేదా అన్నది ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.
