ఉపఎన్నిక వేళ హుజురాబాద్‌లో అధికార పార్టీ నేతలు రహస్య భేటీ ఎందుకు పెట్టుకున్నారు? సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలేంటి? ఓ నేతకు ఇచ్చిన పదవే సీక్రెట్ మీటింగ్‌కు కారణమైందా? టీఆర్ఎస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్!
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ స్థానిక నేతల రహస్య భేటీ?
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదు. అనేక వడపోతలు జరుగుతున్నాయి.. మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్‌ను వీడీ టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తారని చర్చ జరిగింది. ఇంతలోనే కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఈ పదవి ఇవ్వగానే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ నేతలు.. శ్రేణులు అలర్ట్ అయ్యారు. కౌశిక్‌రెడ్డి అంశం వారి మధ్య విస్తృతంగా చర్చకు వచ్చిందట. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కండువా మార్చేయగానే.. ఎమ్మెల్సీ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి? పార్టీని నమ్ముకుని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను వదిలి.. టీఆర్‌ఎస్ కోసం పనిచేస్తున్న తమ సంగతి ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారట. టీఆర్‌ఎస్ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతుంటే తమకు పదవులు రావడం లేదని కొందరు గులాబీ నేతలు రహస్యంగా సమావేశం పెట్టుకున్నారట. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి హుజురాబాద్ టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేగింది.
కౌశిక్‌రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం?
హుజురాబాద్‌లోని ఓ సీనియర్ నాయకుడి ఇంట్లో టీఆర్‌ఎస్ నాయకులు కొందరు రహస్య భేటీలో పాల్గొన్నారట. కౌశిక్‌రెడ్డిపైనే ఆ భేటీ చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా.. నియోజకవర్గంలో జరిగే సన్మాన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తీర్మానించారట. ఏతావాతా హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి చేపట్టే కార్యక్రమాలకు ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తే అంత బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
పార్టీ పెద్దల దృష్టికి రహస్య భేటీ అంశం!
హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో నియోజకవర్గంలోని మిగతా నాయకులకు మరికొన్ని నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్‌కు విధేయంగానే ఉండాలని రహస్య భేటీలో చర్చించారట. తమ అసంతృప్తిని.. అభిప్రాయాలను.. రహస్య భేటీలో చర్చకు వచ్చిన ఇతర అంశాలను టీఆర్‌ఎస్ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. రహస్య సమావేశం గురించి బయటకు గుప్పుమనడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. చాలా మంది ఆసక్తిగా ఆరా తీస్తున్నారట. సమావేశంలో ఎవరు పాల్గొన్నారు? పార్టీలో వారి స్థాయి ఏంటి? సమావేశానికి వచ్చిన వారు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు? కౌశిక్‌రెడ్డి వరకే తమ అసంతృప్తిని పరిమితం చేస్తారా.. లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అని కూపీ లాగుతున్నారట.
అసంతృప్త నేతలను బుజ్జగిస్తారా?
ఇప్పటికే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ విజయానికి కావాల్సిన వ్యహ రచనలో నిమగ్నమయ్యారు. అయితే స్థానిక నేతల్లో వచ్చిన తాజా అసంతృప్తిని ఏ విధంగా బుజ్జగిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. మరి.. పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలకు ఏం మంత్రం వేస్తారో చూడాలి.
