Site icon NTV Telugu

పోలింగ్ నాటికీ వ్యూహాల్లో మార్పు తప్పదా ?

హుజురాబాద్‌లో పార్టీలు కులాలు.. బలాల లెక్కలు తీస్తున్నాయా? గత ఎన్నికలకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉండటంతో.. వివిధ సామాజికవర్గాల వైఖరి అంతుచిక్కడం లేదా? ఏ వర్గం ఎటు.. పార్టీలకు కలిసి వచ్చే అంశాలు ఏంటి?

ఉపఎన్నికలో కాంగ్రెస్‌ బలం చాటగలదా?

2018లో జరిగిన హుజురాబాద్‌ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పుడు జరగబోతున్న ఉపఎన్నికకు అస్సలు పోలిక లేదు. నియోజకవర్గ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ వర్సెస్‌ టీఆర్ఎస్‌ అన్నట్టుగా ఉంది పోరాటం. అప్పట్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంటే.. ఇప్పుడు ఉపఎన్నికలో ఉనికిని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్‌ది. నాడు కాంగ్రెస్‌కు 60వేల ఓట్లు వచ్చాయి. ఉపఎన్నికలో ఆ స్థాయిలో మళ్లీ ఓట్లు కాంగ్రెస్‌ సాధించగలదా? ఒకవేళ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోతే.. టీఆర్ఎస్‌, ఈటలలో ఎవరికి పడతాయి? ప్రధాన పార్టీలకు ఒక పట్టాన ఈ లెక్క అందడం లేదట. నిరుద్యోగ సమస్యను అజెండాగా చేసుకుని బల్మూరి వెంకట్‌ను బరిలో దింపిన కాంగ్రెస్‌.. రేస్‌లోకి వచ్చేందుకు ఇంకా గేర్‌ మార్చలేదు.

లక్షా 30 వేల మంది బీసీ ఓటర్లు..!
బీసీ, ఎస్సీ ఓటర్లపై టీఆర్‌ఎస్‌ ఆశ?

హుజురాబాద్‌లో బీసీ ఓటర్లే ఎక్కువ. దాదాపు ఒకలక్షా 30 వేల వరకు బీసీ ఓటర్లు ఉన్నారు. 45 వేలతో ఎస్సీ ఓటర్లది తర్వాతి స్థానం. ఓసీ ఓటర్లు 31 వేలు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ ఓసీ సామాజికవర్గం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్‌, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌లు ఇద్దరిదీ బీసీ సామాజికవర్గం. బీసీ ఓటర్లతోపాటు.. ఎస్సీఓటర్లు కలిసి వస్తారని.. గెల్లును గెలిపిస్తారని గులాబీ శిబిరం అంచనా. షెడ్యూల్‌ రాకముందే దళితబంధుతో ఎస్సీలను.. గోర్లె పంపిణీతో యాదవ సామాజికవర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది అధికార టీఆర్ఎస్‌. ఈ రెండు పథకాలు గెల్లును గెలుపు తీరాలకు తీసుకెళ్తాయా? గ్రామస్థాయిలో మకాం వేసిన గులాబీ నేతలు సాయం పడతారా?

ముదిరాజ్‌, రెడ్డి ఓటర్లు కలిపి 45 వేలు..!
2018లో కాంగ్రెస్‌వైపు గౌడ్, రెడ్డి సామాజికవర్గం మొగ్గు?

ఈటల రాజేందర్‌.. ముదిరాజ్‌ సామాజికవర్గమైతే ఆయన భార్య జమున.. రెడ్డి సామాజికవర్గం. ఈ రెండు కులాల ఓటర్లు కలిసి దాదాపు 45 వేల వరకు ఉన్నారు. వీరంతా ఈటలకే అనుకూలమన్నది బీజేపీ నేతల అభిప్రాయం. దీనికితోడు కులాలకు అతీతంగా గ్రామస్థాయిలో ఈటలకు బలమైన వర్గాలు.. అభిమానమూ ఉన్నాయని కమలనాథులు లెక్కలేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు నేతలు. ఇక్కడో ముఖ్య విషయం ఉంది. 2018లో కాంగ్రెస్‌ పార్టీకి పడిన 60వేల ఓట్లలో రెడ్డి, గౌడ సామాజికవర్గం షేర్‌ ఎక్కువన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఈ లెక్కలతోనూ కాషాయ శిబిరం కుస్తీ పడుతోందట. ఇవే లెక్కలను అధికార పార్టీ దగ్గర పెట్టుకుందని సమాచారం.

పోలింగ్‌ నాటికి వ్యూహాల్లో మార్పులు తప్పదా?

హుజురాబాద్‌లో పైకి గంభీరంగా ప్రచారం చేస్తూ.. ఉపఎన్నిక తమకే అనుకూలమని పార్టీలు ప్రచారం చేసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో కులాల లెక్కలు.. ఆయా సామాజికవర్గాల నుంచి లభించే మద్దతు అంతుచిక్కడం లేదన్నది నేతల మాట. మరి.. పోలింగ్‌ నాటికి వ్యూహాలు ఎలా మారతాయో? సామాజికవర్గాలను పార్టీలు ఏ విధంగా బుట్టలో వేసుకుంటాయో చూడాలి.

Exit mobile version