Site icon NTV Telugu

హిందూపురం వైసీపీలో ఆధిపత్య జ్వాలలు..!

ఆ నియోజకవర్గంలో అధికారపార్టీకి ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. ఇద్దరు కలిసి సాగితే ఏ గొడవా ఉండేది కాదు. ఆధిపత్యం కోసం కుస్తీపట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీ ఒకటే కానీ.. రెండు కార్యాలయాలు.. రెండు గ్రూపులు. మూడేళ్లుగా ఇదే తంతు. సమస్య ఏదైనా వాళ్ల మధ్య అగ్గి రాజేస్తుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం?

ఆధిపత్యం కోసం ఇద్దరు నేతల ఫైట్‌..!

అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణను ఎదుర్కొనేందుకు వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. కానీ.. అవేమీ వర్కవుట్‌ కాలేదు. వైసీపీ చేసిన ఆ ప్రయోగాలే పార్టీలో కుంపటి రాజేశాయి. పార్టీ పెద్దలు ఒకటి తలిస్తే.. హిందూపురం నాయకులు మరోలా ఆలోచిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడిగా ప్రచారంలో ఉన్న నవీన్‌ నిశ్చల్‌ను కాదని.. 2019లో మాజీ ఐపీఎస్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ను బరిలో దించారు. అప్పటి నుంచి నవీన్‌ నిశ్చల్‌, ఇక్బాల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. హిందూపురంలో టీడీపీని ఎదుర్కోవడం మాట దేవుడెరుగు.. వైసీపీలోనే ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొత్త గొడవలకు ఆస్కారం కల్పిస్తున్నాయి.

ఇద్దరి మధ్య కొత్త కుంపటి..!

హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఇక్బాల్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీ. నవీన్‌ నిశ్చల్‌ను పార్లమెంట్‌ ఇంఛార్జ్‌గా నియమించి.. రాష్ట్ర స్థాయిలో ఆగ్రో ఛైర్మన్‌ను చేసింది అధికారపార్టీ. పదవుల పంపకంతోనైనా ఇద్దరి మధ్య సఖ్యత వస్తుందని పార్టీ ఆశించినా నిరాశే ఎదురైంది. వర్గపోరు ముందు ఆ పదవులు చిన్నబోయాయి. తాజాగా పార్టీ కమిటీల ఏర్పాటు ఇక్బాల్‌, నవీన్‌ల మధ్య కొత్త కుంపటి రాజేసింది.

రెండు మండలాలకు కన్వీనర్లను నియమించిన నవీన్‌ నిశ్చల్‌..!
ఆ నియామకం చెల్లబోదని ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రకటన..!

హిందూపురం రూరల్‌, లేపాక్షీ మండలాలకు వైసీపీ కన్వీనర్లుగా ఇద్దరి పేర్లను నవీన్‌ నిశ్చల్‌ ప్రకటించారు. దీనిపై ఇక్బల్‌ మండిపడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గానికి తాను ఇంఛార్జ్‌గా ఉండగా.. వేరెవరో కమిటీలు ఎలా ఏర్పాటు చేస్తారని కయ్యిమన్నారు. నవీన్‌ నిశ్చల్‌ ప్రకటించిన రెండు పేర్లూ చెల్లబోవని ప్రకటించేశారు ఇక్బాల్‌. నియోజకవర్గంలో ఏం చేయాలన్నా తానే చేయాలి.. అలా కాదని వ్యవహరిస్తే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఇక్బాల్‌ హెచ్చరించారు.

హౌసింగ్‌ బోర్డు కాలనీలో రెండు వైసీపీ ఆఫీస్‌ల ఏర్పాటు..!

వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమ నాయకుడు..పార్టీలో పనిచేస్తున్నవారిని కన్వీనర్లుగా నియమిస్తే తప్పేంటన్నది నవీన్‌ వర్గం చేసే వాదన. ఇప్పుడీ వివాదం కొత్త మలుపు తీసుకుంది. హౌసింగ్‌ బోర్డు కాలనీలో వైసీపీ నుంచి రెండు పార్టీ ఆఫీసులు ఓపెన్‌ చేశారు. ఎవరి శిబిరం వాళ్లదే. హిందూపురంలో బాలకృష్ణకు చెక్‌ పెట్టాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అప్పగించిన టాస్క్‌ను వదిలేసి.. తమలో తామే గొడవ పడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. ఆ స్థాయిలో ప్రభావం చూపించకుండా సొంత ప్రయోజనాలకే రెండువర్గాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇక్కడి విషయాలను పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వైసీపీ శ్రేణులకు అర్థం కావడం లేదట.

Exit mobile version