Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి…?

ఈటల ఎపిసోడ్ తర్వాత టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? మాజీ మంత్రికి సన్నిహితులైన ప్రజాప్రతినిధులవైపు అందరి చూపు పడిందా? ప్రస్తుత పరిణామాలపై మౌనంగా ఉండేందుకే సన్నిహితులు మొగ్గుచూపుతున్నారా? మరికొద్ది రోజులు అలా ఉండటమే బెటర్‌ అని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నాయకులు?

టీఆర్‌ఎస్‌లోని ఈటల సన్నిహితుల దశ దిశ ఏంటి?

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత అనుచరులతో డిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. గులాబీ పార్టీతో ఈటల తెగతెంపులు తర్వాత టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన సన్నిహితుల పరిస్థితి ఏంటన్న అంశంపై లేటెస్ట్‌గా చర్చ మొదలైంది. మాజీ మంత్రికి అత్యంత సన్నిహితులైన ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులపై హట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. వారివైపే టీఆర్‌ఎస్‌ వర్గాలు చూస్తున్నాయట. అందుకే ఆ ఇద్దరి దశ…దిశ ఏంటన్నది చర్చ జరుగుతోంది.

ఈటల ఎపిసోడ్‌ తర్వాత రసమయి సైలెంట్‌

ఈటల రాజేందర్‌కు ఉద్యమ సమయం నుంచి సన్నిహితుడుగా ఉన్నారు మానుకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల వల్ల ఈటలతో కలిసి రసమయి ముందుకు సాగారన్న వాదనలు ఉన్నాయి. అప్పట్లో గులాబీ జెండాకు ఓనర్లం మేము అని ఈటల కామెంట్ చేసిన మరుసటిరోజు … ఆయనతో హైదరబాద్‌లో భేటీ అయ్యారు రసమయి. ఒక కార్యక్రమంలో రసమయి పాడిన పాటపై చర్చ కూడా జరుగుతోంది. ఆ పాటపై ఎవరి వాదన వారిదే. ఈటల టీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే రసమయి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉంది. అయితే తాజా ఎపిసోడ్ తర్వాత రసమయి కొంత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారన్న చర్చ నడుస్తోంది.

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి వైఖరి ఏంటి?

టీఆర్‌ఎస్‌లో ఈటలకు మరొక సన్నిహితుడు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి. మొదటి నుంచి ఈటలకు రంజీత్ రెడ్డికి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇద్దరు కలసి వ్యాపారాలు కూడా నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రంజీత్ రెడ్డి. వ్యాపారాలతో పాటు ఇద్దరు కలసి పలు భూముల కొనుగోళ్లు చేసినట్టు రాజకీయ వర్గాల టాక్‌. అందుకే తాజా పరిణామాలతో ఎంపీ ఎటువంటి వైఖరిని తీసుకుంటారన్న చర్చ పార్టీలో మొదలైంది.

ప్రస్తుతానికి మౌనమే బెటర్‌ అని నిర్ణయం!

ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్లిన తర్వాత టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కొక్కరుగా మాజీ మంత్రిపై ఫైర్‌ అవుతున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడేందుకో ఏమో విమర్శించడానికి నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఆ జాబితాలో ఎంపీ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇంకా చేరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెదవి విప్పకుండా మౌనంగా ఉండటమే బెటర్‌ అనే అభిప్రాయానికి ఎంపీ వచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు.

సన్నిహితులుగా ముద్రపడ్డ వారిపై పార్టీ నజర్‌!

టీఆర్‌ఎస్‌ను వీడి ఈటల బీజేపీలో చేరిన సమయంలో కొందరు అధికార పార్టీ నాయకులు ఫాలో అయ్యారు. ఆయన్న సన్నిహితులుగా ముద్రపడ్డవారిలో ఎలాంటి కదలిక లేదు. అందుకే టీఆర్‌ఎస్‌ వర్గాలు ఈటల సన్నిహితులపై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. ఆ విధంగా చర్చలోకి వచ్చారు రంజీత్‌రెడ్డి, రసమయి. మరి.. మాజీ మంత్రి సర్కిల్‌లో క్లోజ్‌గా మువ్‌ అయినవారు ఎన్నాళ్లు మౌనంగా ఉంటారో చూడాలి.

Exit mobile version