ఏపీలో కొందరు జిల్లా కలెక్టర్లపై బదిలీ వేటు పడనుందా? సచివాలయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటి? ప్రత్యేకించి కొన్ని జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వానికి అదేపనిగా ఫిర్యాదులు అందుతున్నాయా? ఇంతకీ ఆ ఐఏఎస్‌లు ఏం చేస్తున్నారు? ఫిర్యాదుల వెనక కథేంటి? లెట్స్ వాచ్!
ఏపీలో త్వరలో కలెక్టర్ల బదిలీలు?
కొందరు కలెక్టర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కృష్ణా, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం మినహా మిగతా ఇద్దరు బదిలీ ఉద్యోగ, అధికారవర్గాల్లో కాస్త చర్చకు దారితీసింది. అయితే రాష్ట్రంలో కొంతకాలంగా కలెక్టర్ల బదిలీలు పెద్దగా జరగలేదు. త్వరలో జరగబోయే IASల ట్రాన్స్‌ఫర్లలో కలెక్టర్లు కూడా ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. రెగ్యులర్ బదిలీల్లో భాగంగా ఇవి చేపడితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ.. కొన్ని జిల్లాల కలెక్టర్లపై ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందాయట. వాటిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం బయటకొచ్చినప్పటి నుంచి ఏ జిల్లాల కలెక్టర్ల మీద ఫిర్యాదులు వచ్చాయి? ఎందుకొచ్చాయి? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జిల్లాలో మంత్రికి చెప్పకుండానే కోస్తాలో ఓ కలెక్టర్ మీటింగ్!
సమావేశంలో పాల్గొనాలని మంత్రి ఫోన్‌కు జూమ్ లింక్!
ప్రభుత్వంలో కీలకంగా ఉండే నేతతో మంత్రికి ఫోన్ చేయించిన కలెక్టర్
స్థానికంగా ఉండే మంత్రులు.. ఎమ్మెల్యేల మాటను పెడచెవిన పెట్టి కొందరు కలెక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన అభియోగం. ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాలో పనిచేస్తున్న ఓ కలెక్టర్ తన జిల్లాకు చెందిన మంత్రులను.. ఎమ్మెల్యేలను ఎంతమాత్రం పట్టించుకోరట. ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోరట. సమావేశాలు పెట్టే సందర్భంలోనూ ఆ జిల్లా మంత్రులకు మాట మాత్రంగానైనా చెప్పడం లేదట. అదేమంటే.. ఇంఛార్జ్ మంత్రికి తెలియజేశానని ఆన్సర్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఆ జిల్లా మంత్రికి అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొనాల్సిందిగా సూచిస్తూ ఓ జూమ్ లింక్ ఓ మంత్రి ఫోనుకు వచ్చిందట. ఆ లింక్ ఎవరు పంపారా? అని ఆరా తీస్తే.. అది ఇరిగేషన్ SE నుంచి వచ్చిందని తెలిసింది. సమావేశం గురించి ముందుగా చెప్పాలి కదా అని సదరు మంత్రి ప్రశ్నిస్తే.. కలెక్టర్ పెట్టమన్నారని SE బదులిచ్చారట. తనకు చెప్పకుండా సమావేశం ఎలా పెడతారంటూ మండిపడ్డారు సదరు అమాత్యుడు. సమావేశం పెట్టడానికి ససేమిరా వీల్లేదు.. అంతగా సమావేశం పెట్టుకోవాలనుకుంటే మీరే పెట్టుకొండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆ మంత్రి. దీంతో ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ నేతకు ఫోన్ చేసి మంత్రికి సర్దిచెప్పే ప్రయత్నం చేయించారట కలెక్టర్. జిల్లాల్లో కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుకు ఈ అంశాన్ని ఓ మచ్చు తునకగా ప్రస్తావిస్తున్నారట.
ఎమ్మెల్యే చేస్తే తప్పు.. కలెక్టర్ చేస్తే ఒప్పు అయిపోతుందా?
సీఎం పేషీలో పలుకుబడి ఉందని బెదిరిస్తోన్న కలెక్టర్?
ఇటీవల వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఓ ఎమ్మెల్యే ఏదో చిన్నపాటి సూచన చేస్తే.. దాన్ని అమలు చేసినందుకు ఓ మండలస్థాయి అధికారిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. కానీ అదే కలెక్టర్ వ్యాక్సిన్ విషయంలో నిబంధనల విరుద్దంగా వ్యవహరించారని సమాచారం. వ్యాక్సిన్ విషయంలో ఎమ్మెల్యే చేస్తే తప్పు.. అదే తప్పు కలెక్టర్ చేస్తే ఒప్పు అయిపోతుందా..? అని స్థానిక ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారట. సదురు కలెక్టరుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చెప్పినా.. దానికి అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా ఉండడం లేదట. ప్రతి దానికీ ఏదో ఒక కొర్రీ వేస్తున్నారని చెబుతున్నారు. ఇదే అంశాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా తనకేం ఇబ్బంది లేదని.. సీఎం పేషీలో తనకు పలుకుబడి ఉందని.. బాహటంగానే చెప్పేస్తున్నారని మంత్రులు గగ్గోలు పెడుతున్నారట. ఆ కలెక్టరును వెంటనే బదిలీ చేయకుంటే జిల్లాలో రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ పెద్దలకు మంత్రులు స్పష్టం చేశారట.
మంత్రుల మధ్య గొడవలు రాజేస్తోన్న కలెక్టర్లు?
ఇదే తరహాలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారట. ఓ మంత్రి శాఖాపరంగా చేసిన బదిలీలను మార్చేందుకు కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆ శాఖకు చెందిన మంత్రికి.. జిల్లా మంత్రికి గ్యాప్ వచ్చినంత పనైందట. ఈ విధంగా కొందరు కలెక్టర్లు మంత్రుల మధ్య గొడవలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇంఛార్జ్ మంత్రులతో సఖ్యతగా ఉంటూ జిల్లా మంత్రులు.. స్థానిక ఎమ్మెల్యేలతో సరిగా వ్యవహరించడం లేదని సమాచారం.
సొంతంగా సమాచారం తెప్పించుకుంటోన్న ప్రభుత్వం!
ఇలాంటి కలెక్టర్లను వెంటనే బదిలీ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వం మీద ఆయా జిల్లాల మంత్రులు.. ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారని కాకుండా.. ప్రభుత్వం కూడా సొంతంగా సమాచారం రప్పించుకుని.. అది నిజమని తేలితే బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
