Site icon NTV Telugu

తెలంగాణలో లెఫ్ట్‌పార్టీల తీరుపై మళ్లీ చర్చ..!

ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు కాపు కాస్తారు. ఉద్యమాల్లో కాంగ్రెస్‌తో దోస్తీ. తెలంగాణలో కమ్యూనిస్ట్‌ పార్టీల తీరు ఇది. రైట్‌ టర్న్‌ తీసుకుంటున్న సమయంలో లెఫ్ట్‌ ఆలోచనలు ఎందుకు మారుతున్నాయి? కామ్రేడ్ల నిర్ణయాల వెనక బలమైన కారణాలు ఏంటి?


ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీల వైఖరిపై ఆసక్తికర చర్చ..!

తెలంగాణలో ఎన్నికలేవైనా.. కమ్యూనిస్ట్‌ పార్టీలపై కూడా చర్చ జరుగుతుంది. సీపీఐ, సీపీఎంలు ఏం చేస్తాయి? పోటీ చేస్తాయా.. లేదా? ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అనేది ఆ చర్చ సారాంశంగా ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు లెఫ్ట్‌ పార్టీలు అనుసరించిన వైఖరే ఆసక్తి కలిగిస్తుంది. మున్సిపల్, పరిషత్‌, పంచాయతీ ఎన్నికలను మినహాయిస్తే.. అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో కొన్నిచోట్ల ఓపెన్‌గా.. మరికొన్నిచోట్ల లోపాయికారీగా అధికార టీఆర్ఎస్‌కు సాయం పట్టాయి లెఫ్ట్‌ పార్టీలు. ఒకవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూనే.. ఎన్నికల టైమ్‌లో సడెన్‌గా వైఖరి మార్చేసుకుంటాయి. అప్పటి వరకు కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తూనే హస్తం పార్టీని దోషిగా చూస్తారు కామ్రేడ్లు.

లెఫ్ట్‌ పార్టీల వైఖరి వెనక బలమైన కారణం ఉందా?

ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్‌లకు బలం బలగం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైకి చెప్పకపోయినా టీఆర్ఎస్‌కు ఓటేసి.. బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థికి దూరం పాటించాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో దోస్తీ.. ఉద్యమాలలో కలిసి సాగే కాంగ్రెస్‌తో ఎలక్షన్స్‌లో కుస్తీ పట్టడమే తాజా చర్చకు కారణం. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి జరిగిన పరిణామాలను చూసినవాళ్లకు మాత్రం.. కమ్యూనిస్ట్‌ల వైఖరి వెనక ఇంకేదో బలమైన కారణం కనిపిస్తోందట.

టైమ్‌ చూసి కాంగ్రెస్‌పై రివెంజ్‌ తీసుకుంటున్నారా..?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం నుంచి ఎవరూ గెలవలేదు. చట్టసభల్లో లెఫ్ట్‌ పార్టీల ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అంతకుముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీల నుంచి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలుగా ఉండేవారు. 2018లో మాత్రం చేదు ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ వైఖరే దీనికి కారణమన్న కోపం కమ్యూనిస్ట్‌పార్టీల్లో ఉందట. ఆ ఎన్నికల్లో చివరి వరకు పొత్తులు, సీట్లు తేల్చకపోవడంతో దెబ్బతిన్నామన్న బాధ.. ఆవేదన సీపీఐ, సీపీఎంలలో ఉన్నట్టు సమాచారం. అందుకే కాంగ్రెస్‌ పార్టీపై కామ్రేడ్లు గుర్రుగా ఉన్నట్టు చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ అంశాలపై కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సాగుతున్నా.. ఎదురుపడినప్పుడు నవ్వులు చిందిస్తున్నా కడుపులో కత్తులపెట్టుకునే ఉన్నట్టు తెలుస్తోంది. టైమ్‌ చూసుకుని రివెంజ్‌ తీర్చుకుంటున్నట్టు సమాచారం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కారుకే లెఫ్ట్‌ సాయం..?

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ఓపెన్‌గానే టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినా.. దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మారిపోయింది. దుబ్బాకలో బీజేపీని ఓడించాలనే మాటతో కారుకు సాయం పడితే.. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ.. లోకల్‌ కేడర్‌ నిర్ణయం తీసుకుంటుందని CPI, CPMలు ప్రకటించాయి. వెంటనే లోకల్‌ కేడర్‌ టీఆర్ఎస్‌కు మద్దతిచ్చేసింది. హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఓపెన్‌గా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. అక్కడా టీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఖమ్మం లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కే కాపు కాశాయి కమ్యూనిస్ట్‌ పార్టీలు. మరి.. ఈ రివెంజ్ పాలిటిక్స్‌.. రాజకీయ దోబూచులాటలు కమ్యూనిస్ట్‌లకు మేలు చేస్తాయో.. కీడు తలపెడతాయో కాలమే చెప్పాలి.

Exit mobile version