Site icon NTV Telugu

కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ చుట్టూ నేతల ప్రదక్షిణ..!

ఇన్నాళ్లూ అతనొస్తే… టైమ్‌ ఇవ్వలేదు తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు. ఇప్పుడు మాత్రం ఆ నేత చుట్టూ ఒక్కటే ప్రదక్షిణలు. ఇంటికి పిలిచి మరీ కుశల ప్రశ్నలు వేస్తున్నారట. ఇంతకీ ఆ నేతకు టైమ్‌ వచ్చిందని అనుకుంటున్నారా? కానే కాదు.. తమ టైమ్ బాగుండాలని జాగ్రత్త పడుతున్నారట నాయకులు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

ఓటమిపై అభ్యర్థి వెంకట్‌నే నివేదిక కోరిన హైకమాండ్‌..!

13న ఢిల్లీ AICC ఆఫీసులో ఏర్పాటు చేసిన మీటింగ్‌పైనే ఫోకస్‌ పెట్టారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.
ఒక్కటే టెన్షన్‌. హుజురాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ దారుణ ఓటమికి బాధ్యులెవరో తేల్చే మీటింగ్‌ కావడంతో నేతల్లో ఈ ఆందోళన నెలకొంది. సమావేశం తర్వాత AICC ఏం చెబుతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ పీసీసీ చీఫ్‌ను నివేదిక కోరేది. ఈసారి మాత్రం హుజురాబాద్‌ ఉపఎన్నిక బరిలో దిగిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నివేదిక కోరింది అధిష్ఠానం. ఆ రిపోర్ట్‌ పట్టుకుని ఢిల్లీ రావాలన్నది పార్టీ ఆదేశం.

వెంకట్‌ను ఇంటికి పిలిచి ఆరా తీస్తున్న నేతలు..!

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నాయకులు ఏం చెప్పినా.. అభ్యర్థి వెంకట్‌ ఇచ్చే నివేదికపైనే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్‌ నేతలు టెన్షన్‌ పడుతున్నట్టు సమాచారం. హస్తినకు రావాలని AICC నుంచి పిలుపొచ్చినప్పటి నుంచి అభ్యర్థి వెంకట్‌ను పిలిచి కొందరు.. పిలిపించుకుని మరికొందరు మాటామంత్రి కలిపారట. ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా కాంగ్రెస్‌పైనే విమర్శలు చేసిన ఓ నాయకుడు.. వెంకట్‌ను ఇంటికి పిలిచి.. AICCకి ఏం నివేదిక ఇవ్వాలని అనుకుంటున్నావు అని అడిగారట. తన వైఖరికి అనుగుణంగా నివేదిక ఉండాలని కోరినట్టు సమాచారం.

వాస్తవ పరిస్థితులే వెల్లడిస్తానన్న వెంకట్‌..!

ఉపఎన్నికలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేదని మరో నేత వెంకట్‌తో చెప్పారట. ఇంకొందరు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా హుజురాబాద్‌లో ప్రచారానికి వెళ్లిన నాయకులు.. దూరంగా ఉండిపోయిన వాళ్లు రిపోర్ట్‌లో ఏం రాయాలో వెంకట్‌కు బ్రెయిన్‌ వాష్‌ చేసినట్టు సమాచారం. పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా కొందరు.. రేవంత్‌కు అనుకూలంగా మరికొందరు రిపోర్ట్‌ సిద్ధం చేయాలని కోరారట. ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని హితబోధలు చేసినా.. ఎంతెలా బతిమాలినా.. తాను మాత్రం వాస్తవ పరిస్థితినే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముందు పెడతానని స్పష్టం చేశారట వెంకట్‌.

రాహుల్‌ గాంధీకి ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కమిటీ నోట్‌ ఫైల్‌..!

ఢిల్లీ స్థాయిలో AICCలో అభ్యర్థి వెంకట్‌కు కొంత లాబీయింగ్‌ ఉందట. ప్రస్తుతం అతను NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో.. హుజురాబాద్‌ ఓటమిపై NSUI జాతీయ కమిటీ సైతం ఒక నోట్‌ ఫైల్‌ను రాహుల్‌గాంధీకి అందజేసిందట. దీంతో ఈ వ్యవహారం సమీక్ష నుంచి ఎటుదారి తీస్తుంది? ఇంఛార్జులుగా పనిచేసింది ఎవరు? ఎలా పనిచేశారు? దూరంగా ఉన్నదెవరు? అనే అంశాలపై పార్టీ గట్టిగా ఫోకస్‌ పెట్టొచ్చని అనుకుంటున్నారు. అందుకే వెంకట్ ఇచ్చే రిపోర్ట్‌పై అందరి కళ్లూ నెలకొన్నాయి.

Exit mobile version