Site icon NTV Telugu

సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్‌ ఫిక్స్‌…?

సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్‌ ఫిక్స్‌ అయిందా? అశోక్‌ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది?

700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా?

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్‌. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను ప్రభుత్వం గుర్తించిదట. దాదాపు 700 ఎకరాలకుపైగా భూమిని ఆలయ రికార్డుల నుంచి తప్పించారట. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే.. ఈ వ్యవహారం వెనకున్న సూత్రధారులు బయటకొస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి.

అప్పటి ఈవో రామచంద్రమోహన్‌ ప్రభుత్వానికి సరెండర్‌
అన్నిదారులు అశోక్‌ గజపతిరాజు వైపే వెళ్తున్నాయా?

2013-2019 మధ్య సింహాచలం ఈవోగా పనిచేసి.. ప్రస్తుతం దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌గా ఉన్న రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆయన ఈవోగా ఉన్న సమయంలోనే సింహాచలం భూముల్లో అక్రమాలు జరిగాయని గుర్తించారట. ఎవరి ప్రమేయంతో ఆలయ రికార్డుల నుంచి భూములను తప్పించారో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అన్ని దారులూ ప్రస్తుత మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజువైపే చూపెడుతున్నాయట. దీంతో కేంద్ర మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొన్ని రోజులుగా విశాఖ కేంద్రంగా.. మరీ ముఖ్యంగా సింహాచలం ఆలయ భూముల అక్రమాలపై ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న కామెంట్స్‌ తాజా పరిణామాలకు బలం చేకూరుస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

మాన్సాస్‌ ట్రస్ట్‌ ల్యాండ్స్‌లోనూ అక్రమాలు?

ఒక్క సింహాచలం భూముల విషయంలోనే కాకుండా.. మాన్సాస్‌ ట్రస్ట్‌కు చెందిన ల్యాండ్స్‌లోనూ అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం నిర్థారణకు వచ్చిందట. ఈ వ్యవహారంలోనూ నాటి ఈవో రామచంద్రమోహన్‌కు సంబంధం ఉందని అనుమానిస్తున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఈవో అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయట. వాటికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు దేవాదాయశాఖ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం.

గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన మరికొందరి పాత్ర ఉందా?

అప్పటి ఈవో రామచంద్రమోహన్‌ వెనక అశోక్‌ గజపతిరాజుతోపాటు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మరికొందరి పాత్ర ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందిందట. దీంతో అటు సింహాచలం భూములు.. ఇటు మాన్సాస్ ట్రస్ట్ ల్యాండ్స్‌ అక్రమాల్లో నిజాలు వెలికి తీస్తే గత ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తుల పాత్ర బయటపడుతుందని.. ఆ మేరకు వారిపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం విచారణ వేగం పుంజుకుంది. త్వరలోనే కీలక పరిణామాలు జరుగుతాయని అనుకుంటున్నారు. అదేంటన్నదే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version