పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్ ఆఫ్ అయింది. ఛైర్మన్ పోస్ట్ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఛైర్మన్ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..!
రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్‌గా వైసీపీ నేత చందన నాగేశ్వర్‌ను నియమించి మూడు నెలలైంది.
ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు కానీ కుర్చీ కేటాయించలేదు. స్మార్ట్ సిటీ చైర్మన్‌కు కుర్చీ ఎక్కడ వేయాలనేది చర్చగా మారింది. రాష్ట్రంలో అన్ని స్మార్ట్ సిటీ చైర్మన్ల పేర్లుతో చందన పేరును అధికారికంగా ప్రకటించారు. ఆ జాబితాలో ఉన్నవారిలో చందన తప్ప మిగతావారంతా బాధ్యతలు చేపట్టేశారు కూడా.
రాజమండ్రిని స్మార్ట్ సిటీగా గుర్తించని కేంద్రం..!
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా రాజమండ్రిని గుర్తించలేదు. స్మార్ట్ సిటీని చేయాలనే డిమాండ్ ఉంది. అన్ని పక్షాలు ఈ డిమాండ్‌ను తమ అజెండాలో చేర్చుకున్నాయి. ఎంపీ భరత్‌రామ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం రాజమండ్రిని స్మార్ట్ సిటీని చేస్తుందని.. అదిగో..ఇదిగో అంటూ ఎదురు చూడటమే సరిపోతోంది. ఢిల్లీ నుంచి ఎలాంటి ఉలుకు.. పలుకు లేకపోయినా.. స్మార్ట్ సిటీ కాని రాజమండ్రికి చందన నాగేశ్వర్ ఛైర్మన్ అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడానికి సాంకేతిక అంశాలు అడ్డుగా మారాయి.
పదవి ఉందా.. రద్దు చేస్తారా అని డైలమా?
అసలు లోగట్టు ఇలా ఉంటే.. స్మార్ట్ సిటీ ఛైర్మన్ హోదాలో చందన నాగేశ్వర్‌కు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేయర్ ఛాంబర్‌ను కేటాయించాలని కమిషనర్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయట. 3 నెలలుగా ఈ విషయం ఎటూ తేలడం లేదు. పదవి దక్కినా.. అది ప్రకటనకు పరిమితం కావడం.. కుర్చీ లేకపోవడంతో చందన మూడ్ ఆఫ్ అయినట్టు సమాచారం. స్మార్ట్ సిటీ చైర్మన్ పదవి ఉంటుందా? లేక రద్దు చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.
ఆదిలోనే వికటిస్తున్న చికిత్స..!
సమస్యలతో కునారిల్లుతున్న రాజమండ్రి వైసీపీని గాడిలో పెట్టేందుకు చందన నాగేశ్వర్‌కు నామినేటెడ్ పదవి ఇచ్చి చికిత్స చేయాలని చూశారు. ఇప్పటికే ఇద్దరు వైసీపీ కోఆర్డినేటర్లు మారారు. మూడో కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వచ్చారు. అనారోగ్యంతో ఆయన యాక్టివ్‌గా లేరు. చందన నాగేశ్వర్ రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్‌లోని పది డివిజన్లు ఉన్నాయి. పదవి ఇవ్వడంతో ఇక్కడ పార్టీ ఇంకా బలపడుతుందని వైసీపీ నేతలు లెక్కలేసుకున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్. మరి.. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో.. మూడ్ ఆఫ్ అయిన నేతలో తిరిగి చురుకు పుట్టించడానికి ఏం చేస్తారో చూడాలి.
