Site icon NTV Telugu

వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అంత సీను ఉందా..?

ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు.. నలుగురు ఎంపీల బలం. కానీ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 చోట్ల గెలిచి అధికారం చేపడతామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. గెలుచుడు మాట దేవుడెరుగు..? అసలు అంత మంది అభ్యర్థులు వాళ్లకు ఉన్నారా? ఎన్నికల్లో వాళ్లకు అంత సీన్‌ ఉందా? సొంత పార్టీలోనే వినిపిస్తున్నా ప్రశ్నలివి.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రకటనలు..!

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఒక్కటే. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ దుబ్బాక, హుజురాబాద్‌లను తన ఖాతాలో వేసుకుని బలాన్ని పెంచుకుంది. ప్రస్తుతం బీజేపీకి ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరినే కమలనాథులు ట్రిపుల్‌ ఆర్‌గా పిలుచుకుంటున్నారు కూడా. తమది వాపు కాదు.. బలం అని ప్రకటనలు గుప్పిస్తున్న బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో మరో అడుగు ముందుకేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో గెలిచి… తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని జోస్యం చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే బీజేపీకి నిజంగా అంత సీన్‌ ఉందా?

గడిచిన ఎన్నికల్లో 105 చోట్ల బీజేపీకి డిపాజిట్‌ దక్కలేదు..!
40చోట్ల గట్టిగా పోరాడి.. 70 చోట్ల ఎలా గెలుస్తారు..?

వచ్చే ఎన్నికల్లో 70 చోట్ల బీజేపీ గెలుస్తుందని తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ ప్రకటించారు. ఒక పార్టీ నేతగా ఆశ ఉండొచ్చు. కానీ.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా? అభ్యర్థులు ఉన్నారా? అని సొంత పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 చోట్ల డిపాజిట్‌ దక్కలేదు. పైగా క్షేత్రస్థాయిలో బీజేపీ చెప్పుకోదగ్గ నాయకులు లేరు. పార్టీలో పాత నాయకులు.. కొత్తగా వచ్చిన వాళ్లను కలిపితే 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు దొరికే అవకాశం ఉందని కాషాయ శిబిరం టాక్‌. మరి.. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? 40 చోట్ల గట్టిగా పోరాడి.. 70 చోట్ల గెలవడం ఎలాగో.. ఆ మ్యాజిక్‌ ఏంటో కమలనాథులకే తెలియాలి.

ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రొజెక్ట్‌ చేయాలని చర్చ..!

తెలంగాణలో దాదాపు 79 నియోజకవర్గాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరన్నది పార్టీ అంతర్గత సమావేశాల్లో జరుగుతున్న చర్చ. కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికి సైతం అంతంత మాత్రమే. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ఉనికి ఎంతో.. ఏ మేరకు ప్రభావం చూపగలరో తెలిసిందే. ఇప్పటికీ వేలాది పోలింగ్‌ బూత్‌లలో బీజేపీకి క్రియాశీల కార్యకర్తలు లేరు. ఇప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఒక నేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయకపోతే కష్టమని ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒకరిద్దరు చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా రెండేళ్ల సమయం ఉంది కదా అని ఊరుకుంటే.. తర్వాత చేతులు కాల్చుకోక తప్పదని పార్టీ పెద్దలను హెచ్చరించారట.

ప్రధాని మోడీ ఆకర్షణ కలిసి వస్తుందని లెక్కలు..?

వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌.. 70 చోట్ల గెలుస్తాం.. 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారని ఎందుకు ప్రకటించారు? కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు అనుకుంటే.. రేపటి రోజున అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఆ విషయం బీజేపీ నేతలకూ తెలుసు. అయితే టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. అది బీజేపీకి కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారట. పైగా ప్రధాని మోడీ ఆకర్షణ అదనపు బలంగా భావిస్తున్నారట. ఎన్నికలన్నాక.. పార్టీలు ఇలాంటి లెక్కలు వేసుకోవడం కామన్‌. కాకపోతే బీజేపీ వేస్తున్న అంచనాలే ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి.. కమలనాథులు వాటిని అందుకుంటారో.. తలబొప్పికడుతుందో చూడాలి.

Exit mobile version