NTV Telugu Site icon

Shock To MLA: వెంకటయ్యగౌడ్ కి స్వీట్ వార్నింగ్!

నచ్చిన నేతకు నీరాజనం పలికే జనాలు.. తేడా వస్తే అదేస్థాయిలో నిలదీస్తారు. ఆ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో చర్చల్లోకి వచ్చారు ఆ అధికారపార్టీ శాసనసభ్యుడు. ఎవరా ఎమ్మెల్యే? ప్రజలు ఎందుకు అలా రియాక్ట్‌ అయ్యారు?

ఎమ్మెల్యేకు షాక్‌ ఇస్తున్న జనం?
టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో రోజుకో రకంగా మారుతుంది. అలాంటి పరిస్థితినే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారట. సొంత పార్టీలోనే దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. తొలిసారి పోటీ చేసిన ఆయన పలమనేరులో అత్యధిక మెజారిటీతో గెలిచారు. అదీ టీడీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డిపైన. రాజకీయాలకు కొత్త వ్యక్తి కావడంతో.. ఏదో ఒకటి చేస్తారని నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు భావించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వెంకటయ్యగౌడ్‌పట్ల సానుకూల వాతావరణమే కనిపించినా.. ఇప్పుడిప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పటికి ఎప్పటికీ ఎంతో మార్పు వచ్చేసిందన్నది కేడర్‌ చెప్పేమాట.

రెండు నెలలు గడపగడప తిరిగినా సీన్‌ రివర్స్‌
వెంకటయ్య గౌడ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడంతో లోకల్‌ వైసీపీలోని చోటామోటా లీడర్స్ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దాంతో సీన్‌ రివర్స్‌. అదేకాదు నియోజకవర్గంలోకంటే సొంత వ్యాపారాల కోసం ఎమ్మెల్యే బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దాని నుంచి బయటపడేందుకు గడపగడపకు ఎమ్మెల్యే అనే పేరుతో రెండు నెలలు పలమనేరులో తెగ తిరిగేశారు. రెండు మూడు నెలలు అదే తంతు. ఆ పర్యటనలతో పరిస్థితులు కుదుటపడ్డాయని అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేకు షాక్‌ ఇస్తున్నారు కొందరు గ్రామస్థులు.

ఎమ్మెల్యే రావొద్దని ఫ్లెక్సీలు, బ్యానర్లు
ఎమ్మెల్యే ఓ ఊరికి వెళ్లిన సమయంలో అక్కడి గ్రామస్థులు వెంకటయ్యగౌడ్‌కు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. MLA తమ గ్రామంలోకి రావొద్దు అని ఫ్లెక్సీలు.. బ్యానర్లు ప్రదర్శిస్తూ అడ్డుకున్నారు. కొంగాటం గ్రామంలో చేపట్టిన ఈ నిరసన నియోజకవర్గ వైసీపీలో పెద్ద చర్చగా మారింది. ఎమ్మెల్యేతోపాటు గ్రామ సర్పంచ్‌ కూడా తమ గడపకు రావొద్దని పెద్ద అక్షరాలతో బ్యానర్లపై రాశారు. కొంగాటం గ్రామం ఎమ్మెల్యే సొంత మండలంలో ఉండటంతో మరింత హీట్‌ పెరిగింది. ఈ పరిణామాలకు వెంకటయ్య గౌడ్‌ కూడా కంగుతిన్నారట. కామ్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే.

కొంగాటం ప్రజల స్వీట్‌ వార్నింగ్‌..?
రెండు మూడు నెలలు గడపగడపకూ తిరిగినా ఫలితం రివర్స్‌ కావడంతో ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్‌ శిబిరం కూడా డల్‌ అయినట్టు సమాచారం. ఇంటింటికీ తిరిగి తెలుసుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నది పార్టీ కేడర్‌ చెప్పేమాట. ముందుగా ఎమ్మెల్యే తన పనితీరును మార్చుకుంటే నియోజకవర్గంలో అన్ని సమస్యలు సర్దుకుంటాయని వైసీపీలో మరో వర్గం వాదిస్తోంది. కొంగాటంలో ప్రజలు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని.. ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే ప్రతికూల ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారట. మరి.. ఆ స్వీట్‌ వార్నింగ్‌లతో ఎమ్మెల్యే మారతారో లేక మరిన్ని గ్రామాల జనం కూడా మా ఊరికి రావొద్దని ఫ్లెక్సీలు పెడతారో చూడాలి.