ఆ నియోజకవర్గంలో ఏ నాయకుడికి జెండా పట్టాలో.. ఎవరి సైకిల్ ఎక్కాలో కేడర్‌కు అర్థం కాని పరిస్థితి. పోటీకి సిద్ధమైన అభ్యర్థులు మాత్రం బస్తీమే సవాల్ అని గ్రూపులు కట్టి కొట్టుకుంటున్నారు. అధిష్ఠానం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా.. అక్కడి లెక్కలు తేల్చకుండా కాలక్షేపం చేస్తున్నట్టు తమ్ముళ్ల అనుమానం. అసలు ఆ నియోజకవర్గంలో ఎందుకు అంత గందరగోళం? హైకమాండ్ లెక్కలేంటి?
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి
గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గం సత్తెనపల్లి. 2014లో కోడెల శివప్రసాదరావు, 2019లో అంబటి రాంబాబు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో సత్తెనపల్లిలో టీడీపీ ఇరకాటంలో పడింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి. కోడెల మరణంతో నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు కలగూరగంపలా తయారయ్యాయి. జిల్లాలో రాజకీయంగా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ సత్తెనపల్లి సీటు నాదంటే నాది అని కామెంట్ చేసుకోవడం కేడర్‌కు విసుగు పుట్టిస్తోందట. చేతిలో నాలుగు డబ్బులు ఉంటే చాలు రెండు కార్లు వేసుకుని తిరుగుతూ.. సత్తెనపల్లి సీటు నాకే ఫిక్స్ చేశారని చెప్పుకొంటున్నారు కొందరు నాయకులు. నాలుగురోజులు వాళ్లతో తిరుగుతున్న కేడర్ సైతం ఎటూ తేలని పంచాయితీ అని సైలెంట్ అయిపోతుందట.
టీడీపీ టికెట్ ఆశించే నాయకులు ఎక్కువే..?
సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ను ఆశించే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, రాయపాటి రంగబాబు, కోడెల శివరాం, నాగోతు శౌరయ్య తదితరులు ఉన్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలోకి వైవీ తొంగి చూసింది లేదు. వైవీకి చెందిన విద్యాసంస్థల్లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిపారని.. ఒక దశలో పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ.. సత్తెనపల్లి టికెట్ రేసులో తాను ఉన్నానని చెబుతూ.. నియోజకవర్గ పరిధిలో జరిగే శుభకార్యాలకు పిలిచిందే తడవుగా వెళ్లిపోతున్నారు. ఆయన హడావిడి చూసి కేడర్ అవాక్కవుతోంది.
2019లోనే టికెట్ ఆశించిన రంగబాబు
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు సైతం సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్నారు. 2019లోనే ఈ సీటు కోసం రాయపాటి విశ్వప్రయత్నం చేశారు. కానీ టికెట్ దక్కకపోవడంతో ఈ దఫా తప్పకుండా అవకాశం ఇస్తారని అనుకుంటున్నారట. ఈసారి సాంబశివరావు MPగా పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఆయన పోటీలో లేకుండా కొడుక్కి సత్తెనపల్లి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే ఛాన్స్ ఉంది.
గతంలో వచ్చిన ఆరోపణలే కోడెల శివరామ్‌కు అడ్డా?
టికెట్ ఆశిస్తున్న వారిలో మరో నేత కోడెల శివరాం. కోడెల శివప్రసాదరావు కుమారుడిగా సత్తెనపల్లిలో పోటీ చేసే హక్కు తనదే అని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన పనులే ఆయనకు ఇబ్బందిగా మారాయి. అవే ఇప్పుడు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. కోడెల వారసుడిగా శివరామ్‌కు లైన్ క్లియరయ్యి ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదు. ఆయన మీద ఉన్న ఆరోపణలను హైకమాండ్ సీరియస్‌గా తీసుకుని సీటు ఇవ్వదనే ప్రచారంతో చాలామంది క్యూ కడుతున్నారు.
శౌరయ్య పేరూ చర్చల్లో నలుగుతోందా?
ఎంపీపీల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నాగోతు శౌరయ్య పేరు సైతం టీడీపీ చర్చల్లో నలుగుతోంది. వీళ్లే కాకుండా పార్టీ పదివేలు కూడా ఖర్చుపెట్టలేని చిన్నా చితకా నాయకులు కూడా సత్తెనపల్లి టికెట్ నాదేనని పార్టీ కేడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారట. గ్రూపులుగా విడిపోయిన నాయకులంతా కలిసి సత్తెనపల్లిలో టీడీపీ ఏ కార్యక్రమం చేసిన రచ్చ చేసేస్తున్నారు. ఇటీవల ఎర్రన్నాయుడి సంస్మరణ సభ జరిగితే అక్కడ పార్టీ ఆఫీస్‌లో బాహాబాహీకి దిగారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లోనూ బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంబటిని ఢీకొట్టాలంటే బలమైన నాయకుడు, వ్యూహం కావాలన్నది టీడీపీ పెద్దలకు కూడా తెలుసు. కానీ.. నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకోవడం లేదు. దీంతో అభ్యర్థిని కాదు కదా.. కనీసం పార్టీ ఇంఛార్జ్‌ను కూడా ప్రకటించలేని పరిస్థితిలో అధిష్ఠానం ఉంది.
పొత్తులు తేలేవరకు సత్తెనపల్లి కొలిక్కి రాదా?
అయితే ఎవరైనా ఒక నాయకుడిని టీడీపీ ఇంఛార్జ్‌గా పెడితే మిగతావాళ్లు ఎదురు తిరుగుతారన్న అభద్రతా భావం అధిష్ఠానంలో ఉందా? సీటు ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఒక నాయకుడు బెదిరించారు. అందుకే హైకమాండ్ సైలెంట్ అయ్యిందా? అనే అనుమానాలు ఉన్నాయి. పార్టీలోని కొందరు సీనియర్లు మాత్రం టీడీపీది వ్యూహాత్మక మౌనంగా చెప్పుకొస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతోపాటు కొన్ని పొత్తుల వ్యవహారాలు తేలేదాకా సత్తెనపల్లిని కూడా కొలిక్కి తెచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని అనుకుంటున్నారట. మరి.. పార్టీ ఆలోచన ఏంటో వేచి చూడాల్సిందే.
