Site icon NTV Telugu

Off The Record : మంత్రి సంధ్యారాణిపై సాలూరు టీడీపీలో అసహనం

Sandhya Rani

Sandhya Rani

Off The Record : పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను ఆ మంత్రిగారు బాగా… ఒంటబట్టించుకున్నారా. అందుకే ఏళ్ళ తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని… పదవుల పందేరంలో జంపింగ్‌ జపాంగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారా? చివరికి సొంత నియోజకవర్గంలో సొంత కేడరే ఆమె కార్యక్రమాన్ని బహిష్కరిస్తోందా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌లో అంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఆ మినిస్టర్‌ ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత నియోజకవర్గం సాలూరులోనే సెగలు మొదలయ్యాయి. మినిస్టర్‌ వ్యవహారశైలిని టీడీపీ శ్రేణులే తప్పుపడుతున్నాయట. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తల్ని పక్కనపెట్టి…. మంత్రి మధ్యలో వచ్చిన వాళ్ళకు పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్టుగా మంత్రి వ్యవహరిస్తున్నారంటూ సొంత కేడరే తీవ్రంగా రగిలిపోతోందట.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీలో తమను పట్టించుకోవడం లేదన్న బాధతో సీనియర్ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకు జరుగుతున్న అవమానాల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, లోలోపల రగిలిపోతున్నారట సాలూరు టీడీపీ సీనియర్స్‌.

Read Also : The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?

తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా మాజీ కౌన్సిలర్ మజ్జి చిరంజీవిని నియమించడంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పట్టణం నుంచి మండలాల దాకా అర్హులైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలామందే ఉండగా… అందర్నీ పక్కనబెట్టి, మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తీసుకొచ్చి పదవి ఇవ్వడం షాకింగేనంటున్నాయి టీడీపీ శ్రేణులు. సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాల్లో అదే వర్గానికి చెందిన పలువురు అర్హులుండగా వాళ్ళని విస్మరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అలాగే…. శ్యామలాంబ, శంబర పోలమాంబ ఆలయాల ట్రస్ట్ కమిటీల నియామకాల్లోనూ ఇలాగే వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవుల విషయంలో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన నాయకులకు మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ….తీవ్ర అసహనంగా ఉన్నారు నియోజకవర్గ పార్టీ సీనియర్స్‌.శంబర ఆలయంలో జరిగిన ట్రస్ట్‌ బోర్డ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవకపోవడం చూస్తుంటేనే… అసంతృప్తి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోందని మాట్లాడుకుంటోంది టీడీపీ కేడర్‌.

ఈ ట్రస్ట్‌ బోర్డ్‌లో కొత్తగా పది మంది నియమితులైతే… అందులో సగం వైసీపీ నుంచి వలస వచ్చినవారేనని చెప్పుకుంటోంది టీడీపీ కేడర్‌. స్థానిక నేతలు కార్యక్రమాన్ని బహిష్కరిస్తారని ముందుగానే పసిగట్టిన మంత్రి సంధ్యారాణి ఇతర ప్రాంతాల నుంచి క్లస్టర్, బూత్ కమిటీల నాయకులను రప్పించినట్టు చెప్పుకుంటున్నారు. వివిధ మండలాల్లో ఇప్పుడు దీని గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి టీడీపీ శ్రేణులు. నాయకుల శైలి వలన పార్టీలో సమతుల్యత దెబ్బతింటే… ముఖ్య సామాజిక వర్గాలు దూరమవుతాయంటూ మక్కువ మండలానికి చెందిన సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా… సాలూరు టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి పార్టీ భవిష్యత్‌ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కేడర్‌లో ఆందోళన పెరుగుతోంది. దీన్ని సెట్‌ చేసేందుకు అధిష్ఠానం జోక్యం చేసుకుంటుందో.. లేక మీ ఇష్టం…. తన్నుకు చావండని వదిలేస్తుందో చూడాలంటున్నారు కొందరు నాయకులు.

Read Also : Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version